Begin typing your search above and press return to search.

30 ఏళ్ల తర్వాత టీమిండియా కోచ్ గా హైదరాబాదీ

టీమిండియా తరఫున టెస్టుల్లో దిగ్గజ బ్యాట్స్ మన్ అయిన వీవీఎస్ లక్ష్మణ్.. ఇప్పుడు హెడ్ కోచ్ పదవికి సరైనోడు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 4:30 PM GMT
30 ఏళ్ల తర్వాత టీమిండియా కోచ్ గా హైదరాబాదీ
X

వన్డే ప్రపంచ కప్ ముగిసి వారమైంది.. ఇప్పుడిప్పుడే అభిమానులు కప్ చేజారిన బాధ నుంచి కోలుకుంటున్నారు. నాలుగు రోజుల కిందట ఆస్ట్రేలియాతో టి20 మ్యాచ్ కూడా గెలిచాం. ఇప్పుడిక జట్టు పరంగా ఆలోచించాల్సిది లేదు. తదుపరి కోచ్ ఎవరనేది..? హెడ్ కోచ్ గా ఉన్న దిగ్గజ బ్యాట్స్ మన్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ప్రపంచ కప్ తో ముగిసింది. వచ్చే ఏడాది టి20 ప్రపంచ కప్ ఉంది. 2007 తొలి టి20 ప్రపంచ కప్ ను తప్ప పదహారేళ్లుగా ఈ కప్ ను మళ్లీ మన జట్టు గెలవలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా హెచ్ కోచ్ గా వచ్చే వ్యక్తికి చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. ఇక 2027 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. అందుకోసం జట్టును ప్రాథమికంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద బాధ్యతను మోయాలంటే.. ఆ కోచ్ మంచి క్రికెట్ నాలెడ్జ్ ఉన్నవాడు అయి ఉండాలి.

వెరీ వెరీ స్పెషల్..

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్ కు హైదరాబాదీ వెరీ వెరీ స్పెషల్ (వీవీఎస్) లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ద్రవిడ్‌ తిరిగి రావడంపై స్పష్టత లేదు. డిసెంబరులో టీమిండియా టీ20 సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. అప్పటికైనా ద్రవిడ్ కోచింగ్ పై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అది కూడా అతడు సరేనంటే బీసీసీఐ ఏడాది పాటు పొడిగించే అవకాశముంది. దీనికి ద్రవిడ్ సంసిద్ధంగా లేడని తెలుస్తోంది. కాగా, టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాల్లో సచిన్, గంగూలీ కోచింగ్ బాధ్యతలు తీసుకోలేదు. దాదాపు 20 ఏళ్లు అంతర్జాతీయ, జాతీయ క్రికెట్ లో గడిపిన వారంతా ఇకపై కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వాలనుకోవడమే. అయితే, ద్రవిడ్ మాత్రం దేశం కోసం కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. అండర్- 19, ఇండియా –ఎ జట్లకు కోచింగ్ చేశాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌ గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. రిషబ్‌ పంత్, శుభ్‌ మన్, ఇషాన్‌ కిషన్‌ వంటి వారు ద్రవిడ్ కోచ్ గా ఉన్నప్పుడే వెలుగులోకి వచ్చారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా పట్టుబట్టి టీమిండియా కోచ్‌ గా తెచ్చాడు. ఇప్పుడు ఆ టర్మ్ ముగిసింది. అటు గంగూలీ కూడా బీసీసీఐ పదవిలో లేడు. రాహుల్‌ ద్రవిడ్ ను వ్యక్తిగతంగా అంత బలవంతం చేసే వ్యక్తి ఎవరూ లేరు. అందుకే కోచ్ గా తప్పుకొంటాడేమో అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

సరైనోడు..

టీమిండియా తరఫున టెస్టుల్లో దిగ్గజ బ్యాట్స్ మన్ అయిన వీవీఎస్ లక్ష్మణ్.. ఇప్పుడు హెడ్ కోచ్ పదవికి సరైనోడు. వరుసగా రెండుసార్లు టీమిండియా టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఓడింది. ఇలాంటి వేళ లక్ష్మణ్ అవసరం ఉంది. మరోవైపు ద్రవిడ్‌ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్‌ కావడమే కాక, భారత జట్టుకు కొన్ని సిరీస్‌ల్లో తాత్కాలిక కోచ్‌ గానూ పనిచేశాడు లక్ష్మణ్‌. అందుకే ఇప్పుడు ప్రధాన కోచ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, టీమిండియా 1983-87 మధ్య హైదరాబాదీ పీఆర్ మాన్ సింగ్ కోచ్ (మేనేజర్)గా వ్యవహరించాడు. 1991-92లో స్వల్ప కాలం హైదరాబాదీ అబ్బాస్ అలీ బేగ్ (ఏఏ బేగ్) కోచ్ గా ఉన్నాడు. వీరి తర్వాత.. వారి కంటే గొప్ప ఆటగాడైన.. పక్కా తెలుగువాడైన వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ కానుండడం విశేషమనే చెప్పాలి.