Begin typing your search above and press return to search.

ఒక బంతికి 14 పరుగులు.. ఇలాంటివి కోహ్లీకే సాధ్యం

ప్రపంచకప్ టోర్నీ సాగుతోంది. అంచనాలకు తగ్గట్లే టీమిండియా జట్టు దూసుకెళుతోంది. వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ టీమిండియా విజయాల్ని సొంతం చేసుకుంటోంది

By:  Tupaki Desk   |   20 Oct 2023 4:04 AM GMT
ఒక బంతికి 14 పరుగులు.. ఇలాంటివి కోహ్లీకే సాధ్యం
X

ప్రపంచకప్ టోర్నీ సాగుతోంది. అంచనాలకు తగ్గట్లే టీమిండియా జట్టు దూసుకెళుతోంది. వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ టీమిండియా విజయాల్ని సొంతం చేసుకుంటోంది. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 103 పరుగులు సాధించాడు. అది కూడా 97 బంతుల్లో. మొత్తం నాలుగు సిక్సులు.. ఆరు ఫోర్లతో ఆయన శతకాన్ని సొంతం చేసుకున్నారు. అదే సమయంలో జట్టు ఘన విజయం సాధించటంలో కీలకభూమిక పోషించారు.

ఈ మ్యాచ్ లో కోహ్లీ శతకమే కాదు.. ఒక బంతికి అతగాడు ఏకంగా పద్నాలుగు పరుగులు సాధించిన విశేషం ఉంది. రోహిత్ శర్మ ఔట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ దూకుడుగా ఆడారు. ఏ మాత్రం ఛాన్సు చిక్కినా భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లుకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో హసన్ మహమూద్ వేసిన పదమూడో ఓవర్లో ఒక బంతికి ఏకంగా పద్నాలుగు పరుగుల్ని రాబట్టిన వైనం ఆసక్తికరంగా మారింది.

అదెలానంటే.. పదమూడో ఓవర్లోని నాలుగో బంతికి రోహిత్ శర్మ ఔటయ్యారు. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ రావటమే బ్యాట్ తో షాట్ కొట్టి రెండు పరుగులు సాధించాడు. అయితే.. అది నో బాల్ కావటంతో ఫ్రీ హిట్ వచ్చింది. దాన్ని మిడాన్ మీదుగా బౌండరికి తరలించాడు. ఇక్కడే మరో విశేషం చోటు చేసుకుంది. ఫ్రీ హిట్ బాల్ సైతం నో బాల్ కావటంతో మరో బంతి లభించింది. ఆ బంతిని లాంగాన్ మీదుగా స్టాండ్స్ లో పడేశాడు. దీంతో ఆరు పరుగులు లభించాయి. మొత్తం రెండు నో బాల్స్ కు రెండు పరుగులు. ఇలా ఒక్క బంతికి ఏకంగా పద్నాలుగు పరుగులు జట్టు ఖాతాలో పడ్డాయి. ఇలాంటివి చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి.

ఇక.. మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. అందుకు ప్రతిగా టీమిండియా తాను చేధించాల్సిన లక్ష్యాన్ని 41.3 బంతుల్లో 3 వికెట్లను నష్టపోయి 257 పరుగల్ని సాధించింది. రోహిత్ శర్మ 48 పరుగులు.. శుభమన్ గిల్ 53 పరుగులు.. రాహుల్ 34 పరుగులు చేయగా.. కోహ్లీ 103 పరుగులు చేసి నాటౌట్ చేయటం తెలిసిందే. పాయింట్ల పట్టిక విషయానికి వస్తే న్యూజిలాండ్.. భారత్ జట్లు మాత్రం తాము ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. అయితే.. నెట్ రన్ రేట్ విషయంలో న్యూజిలాండ్ 1.923 ఉండగా.. భారత్ 1.659 రేట్ తో రెండో స్థానంలో నిలిచింది.