కోహ్లి రిటైర్ ను ఆపిన యుద్ధం..విలువ తగ్గని విరాట్ నమ్మే గురువు ఎవరు?
సరిగ్గా ఏడాది కిందట టి20 ప్రపంచ కప్ ను గెలుచుకున్న వెంటనే విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలు అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించేశారు.
By: Tupaki Desk | 13 May 2025 4:30 PMసరిగ్గా ఏడాది కిందట టి20 ప్రపంచ కప్ ను గెలుచుకున్న వెంటనే విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలు అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించేశారు. వాస్తవానికి వీరిద్దరూ అంతకుమందే పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకొన్నా.. టి20 ప్రపంచ కప్ కోసం అన్నట్లుగా మళ్లీ జట్టుతో చేర్చింది సెలక్షన్ కమిటీ.
మళ్లీ ఇప్పుడు కూడా ముందుగా రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అయితే, ఇదే సమయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా ఇక చాలించేస్తున్నట్లు ప్రకటించబోయాడట.
పాకిస్థాన్ పై భారత్ దాడి మొదలుపెట్టిన ఈ నెల 7వ తేదీనే రోహిత్ రిటైర్మెంట్ ఇచ్చాడు. అదే రోజు కోహ్లి కూడా గుడ్ బై చెబుదామని అనుకున్నాడట. కానీ, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కాస్త ఆగమని బీసీసీఐ సూచన చేయడంతో వెనక్కుతగ్గాడని చెబుతున్నారు. ఇప్పుడు కాల్పుల విరమణ జరిగి.. పరిస్థితులు సద్దుమణగడంతో కోహ్లి తన రిటైర్మెంట్ ను బీసీసీఐకి గుర్తుచేసి తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంటే.. కోహ్లి రిటైర్మెంట్ ను వారం పాటు యుద్ధం ఆపిందన్నమాట.
ఇక కోహ్లి వెంటనే భార్య అనుష్కశర్మతో కలిసి తన గురువును కలిశాడు. ఇప్పుడే కాదు.. కోహ్లి కెరీర్ డౌన్ అయిన సందర్భంలోనూ యూపీలోని బృందావన్ ధామ్ కు వెళ్లేవాడు. అక్కడ ప్రేమానంద్ మహరాజ్ ఆశీస్సులు తీసుకునేవాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు. టెస్టులకు రిటైర్మెంట్ తర్వాత కోహ్లి మొదటిసారి బయటకు వచ్చాడు.
విలువ పెరిగింది..
ఇకమీదట కోహ్లిని కేవలం వన్డేల్లో మాత్రమే చూడగలం.. అయితే.. మూడు ఫార్మాట్ల ఆటగాళ్లకు మాత్రమే ఇచ్చే బీసీసీఐ ఏ ప్లస్ కాంట్రాక్టులో ఉన్నందున కోహ్లికి ఏడాదికి రూ.7 కోట్లు వస్తాయి. వచ్చే ప్రపంచకప్ వరకు 27 వన్డేలు ఆడతాడు. ఒక్కో వన్డేకు రూ.6 లక్షలు. ఐపీఎల్ లో ఆర్సీబీకి ఆడుతూ రూ.21 కోట్లు తీసుకుంటున్నాడు. 2008లో రూ.12 లక్షలకు మొదలుపెట్టిన అతడు ఇన్నేళ్లలో ఆర్సీబీ నుంచి రూ.212 కోట్లు పొందాడు.
ఇక కోహ్లికి సొంతగా వన్ 8 బ్రాండ్ ఉంది. డిజిట్ ఇన్సూరెన్స్, వీగన్ కూడా అతడు స్థాపించినవే. 18 అనేది అతడి జెర్సీ నంబరు. చాలా పెద్ద కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ కూడా.
విరాట్ కు రిటైర్మెంట్ తో ఖాళీ సమయం దొరుతుంది. దీనిని అతడు మరింత సంపాదనకు మార్గం చేసుకుంటాడు. కొత్త బ్రాండ్లతో ఒప్పందాలు, సొంతంగా కంపెనీలు స్థాపించడం వంటి మార్గాలెన్నో ఉన్నాయి. బాడీలో మంచి ఈజ్ ఉన్నందున అడ్వర్టయిజ్ మెంట్లు పోటెత్తవచ్చు.
ప్రస్తుతం కోహ్లి నికర ఆస్తి రూ.1,050 కోట్లు. భవిష్యత్ లో వన్డేలకూ వీడ్కోలు పలికి.. సినిమాల్లోనూ అవకాశం దక్కితే ఇక అతడి సంపాదనకు ఆకాశమే హద్దు. ఏమో.. భార్య అనుష్క శర్మ సినీ హీరోయిన్. ఆమెతోనే ఎన్నో యాడ్స్ చేశాడు. మున్ముందు సినిమాల్లోనూ నటించడని చెప్పలేం కదా?
కొసమెరుపు: కోహ్లి ఇన్ స్టా గ్రామ్ ఖాతాకు 25 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. గత ఏడాది టి20 ప్రపంచ కప్ గెలిచాక రోహిత్ తో కలిసి ఉన్న ఫోటోకు 2 కోట్ల లైక్స్ వచ్చాయి. తాజాగా టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ను కూడా ఇన్ స్టాలోనే పోస్ట్ చేశాడు.