’కొండ ఖాళీ అయింది..’ కోహ్లి స్థానాన్ని భర్తీచేసే మొనగాడు ఎవరు?
123 టెస్టులు.. 9,230 పరుగులు.. 46.85 సగటు.. 30 సెంచరీలు.. 31 హాఫ్ సెంచరీలు.. కెప్టెన్ గా 68 టెస్టుల్లో 40 విజయాలు.... దూకుడు సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు ట్రాక్ రికార్డు కాదు ఆల్ టైమ్ రికార్డు.
By: Tupaki Desk | 12 May 2025 7:00 PM IST123 టెస్టులు.. 9,230 పరుగులు.. 46.85 సగటు.. 30 సెంచరీలు.. 31 హాఫ్ సెంచరీలు.. కెప్టెన్ గా 68 టెస్టుల్లో 40 విజయాలు.... దూకుడు సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు ట్రాక్ రికార్డు కాదు ఆల్ టైమ్ రికార్డు. టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లిదే ఈ రికార్డు. మరి అలాంటి వాడు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించేశాడు.. దీంతో టీమ్ ఇండియాలో పెద్ద లోటు ఏర్పడింది. మరి ఈ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..??
టెస్టు క్రికెట్లో టీమ్ ఇండియా తరఫున ట్రిపుల్ సెంచరీ కొట్టినది ఇద్దరే ఇద్దరు. ఒకరు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే మరొకడు కరుణ్ నాయర్. ఇటీవల కరుణ్ దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రతిభ చూపడంతో అతడిని కోహ్లి స్థానం భర్తీచేసేవాడిగా భావించవచ్చు. అయితే, కరుణ్ కు 33 ఏళ్లు. టీమ్ ఇండియాకు దూరమై దాదాపు ఎనిమిదేళ్లు. ఇప్పుడు అతడిని జట్టులోకి తీసుకున్నా.. వెంటనే మ్యాచ్ ఆడిస్తారా? అంటే చెప్పలేం. లేదా.. సీనియారిటీ, ఫామ్ కూడా ఉంది కాబట్టి ఆడించినా ఆశ్చర్యం లేదు.
మహారాష్ట్రకు చెందిన టాలెంటెడ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ను కూడా కోహ్లి స్థానోం టీమ్ ఇండియాలోకి తీసుకోవచ్చు. ఇప్పటికే రుతురాజ్ పలుసార్లు టీమ్ ఇండియాలోకి వచ్చి వెళ్లాడు. 6 వన్డేలు, 23 టి20లు ఆడాడు. టెస్టులు మాత్రం ఆడలేదు. రుతురాజ్ ను టెస్టుల్లోకి తీసుకుంటే నాలుగో స్థానంలో కోహ్లికి సరైన ప్రత్యామ్నాయమే. అయితే, ఈ ఏడాది ఐపీఎల్ లో గాయపడిన రుతురాజ్ ఎప్పటికి కోలుకుంటాడో?
దేవదత్ పడిక్కల్ టాప్ ఆర్డర్ బ్యాటర్. కోహ్లి ఆడేది నాలుగో స్థానంలో కాబట్టి పడిక్కల్ కు కాస్త అవకాశాలు తక్కువే.
రజత్ పటీదార్ రూపంలో మంచి మిడిలార్డర్ బ్యాటర్ ఉన్నప్పటికీ.. అతడికి స్వదేశంలో ఇచ్చిన చాన్సులనే సద్వినియోగం చేసుకోలేదు.
వీరెవరూ కాదు అనుకుంటే ఇప్పటికే జట్టుతో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ కు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. స్వదేశంలో న్యూజిలాండ్ పై 150 పరుగుల భారీ సెంచరీ చేసిన సర్ఫరాజ్.. ఆ తర్వాత విఫలమయ్యాడు. దీంతో ఆస్ట్రేలియాతో సిరీస్ లో అతడికి అవకాశమే ఇవ్వలేదు. మరి ఇప్పుడైనా చాన్స్ ఉంటుందో లేదో?
వీరేవరూ కాకుండా... అనుభవం రీత్యా రోహిత్ స్థానాన్ని కేఎల్ రాహుల్ తో భర్తీ చేసి.. కోహ్లి ప్లేస్ లో రిషభ్ పంత్ ను ఆడిద్దామని టీమ్ ఇండియా మేనేజ్ మెంట్ భావిస్తే ఇంతటితో చర్చకు తెరపడుతుంది.