విరాట్ కోహ్లి రిటైర్మెంట్ దేవ రహస్యం.. ఎప్పటికీ బయటపడదంతే!
టి20లకు అనధికారిక రిటైర్మెంట్ ఇచ్చి అంతలోనే మళ్లీ టి20 ప్రపంచ కప్ ఆడాడు విరాట్ కోహ్లి.. గత ఏడాది ఈ కప్ నెగ్గడంతో ఇక అధికారికంగా రిటైర్మైంట్ ప్రకటించాడు.
By: Tupaki Desk | 26 Aug 2025 11:00 PM ISTటి20లకు అనధికారిక రిటైర్మెంట్ ఇచ్చి అంతలోనే మళ్లీ టి20 ప్రపంచ కప్ ఆడాడు విరాట్ కోహ్లి.. గత ఏడాది ఈ కప్ నెగ్గడంతో ఇక అధికారికంగా రిటైర్మైంట్ ప్రకటించాడు. చాంపియన్ ట్రోఫీ (వన్డే ఫార్మాట్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అదరగొట్టాడు. ఫామ్, ఫిట్ నెస్ చాటుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో తన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటిది అనూహ్యంగా, తనకు ఎంతో ఇష్టమైన టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇది ఎవరూ ఊహించనది...!
ఇష్టమైన ఫార్మాట్...
కోహ్లికి ఎంతో ఇష్టమైన ఫార్మాట్ ఏది అంటే.. టెస్టులు అని ఠక్కున చెబుతారు. అలాంటిది ఐపీఎల్ జరుగుతుండగా, కీలకమైన ఇంగ్లండ్ టూర్ ముందుండగా కోహ్లి టెస్టులకు గుడ్ బై చెప్పాడు. వాస్తవానికి కోహ్లి కంటే కొద్ది రోజుల ముందే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు బైబై పలికాడు. అప్పుడు ఎవరూ ఆశ్చర్చపోలేదు కానీ, కోహ్లి రిటైర్ కావడమే అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఫామ్, ఫిట్ నెస్ అన్నీ ఉన్నా కోహ్లి ఎందుకీ నిర్ణయం తీసుకున్నట్లు? అని అభిమానులు ఆశ్చర్యపోయారు.
ఇంగ్లండ్ లో అండగా ఉంటాడని అనుకుంటే..
మే12న కోహ్లి టెస్టు రిటైర్మెంట్ ఇచ్చాడు. దీనికి వారం ముందే రోహిత్ శర్మ రిటైరయ్యాడు. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో కోహ్లి అవసరం, అనుభవం బాగా పనికొస్తుందని భావిస్తే అతడూ సంప్రదాయ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. అంతర్జాతీయ టోర్నీలు లేకుంటే దేశవాళీలు ఆడాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని గౌరవిస్తూ రంజీ మ్యాచ్ (జవనరి 30-ఫిబ్రవరి 1) కూడా ఆడాడు కోహ్లి. అంటే, టెస్టులకు అందుబాటులో ఉండాలన్నది తన ఉద్దేశంగా కనిపించింది. ఏం జరిగిందో కానీ చివరకు రిటైర్ అయ్యాడు.
కారణం ఇదేనా?
36 ఏళ్ల కోహ్లి అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో విఫలమయ్యాడు. ఆపై ఆస్ట్రేలియా టూర్ లోనూ ఒక్క సెంచరీ తప్ప మిగతా సార్లు పరుగులు చేయలేకపోయాడు. దీంతోనే అతడి టెస్టు ఫామ్ స్థాయి ఏమిటో సెలక్టర్లు అంచనాకు వచ్చేశారు. మరోవైపు కుర్రాళ్లు పోటీ పడుతుండగా.. రోహిత్, కోహ్లి వంటివారిని మోసుకురావడం సరికాదని సెలక్టర్లు భావించి ఉంటారు. మిమ్మల్ని ఇంగ్లండ్ టూర్ కు ఎంపిక చేయడం లేదు అని పరోక్షంగా హింట్ ఇచ్చి ఉంటారు. ఈ నేపథ్యంలో కోహ్లితో పాటు రోహిత్ కూడా గౌరవప్రదంగా తప్పుకొన్నారని భావించాలి.
అతడికే తెలియాలి...
టెస్టులకు రిటైర్మెంట్ అసలు కారణం కోహ్లి ఎప్పటికీ చెప్పకపోవచ్చని అంటున్నాడు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ. పశ్చిమ బెంగాల్ కు చెందిన తివారీ.. తెలుగువాడైన అంబటి రాయుడు తరహాలో మంచి ప్రతిభ ఉన్నవాడు. అయితే, లక్ కలిసిరాలేదు. రాజకీయాల్లోకీ ప్రవేశించిన అతడు మంత్రి అయ్యాడు. తాజాగా మనోజ్ తివారీ స్పందిస్తూ రిటైర్మెంట్ తెరవెనుక ఏం జరిగోందో కోహ్లికే తెలుసని అన్నాడు. తాను పొందినదాంతో కోహ్లి ఆనందంగా ఉండి ఉంటాడని, ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న అతడు.. గతం గురించి గానీ, ఇతర విషయాలను ఏవీ పట్టించుకునే స్థితిలో ఉండడని తివారీ విశ్లేషించాడు.
