Begin typing your search above and press return to search.

10 వేల రన్స్.. 100 శతకాలు.. ట్రిపుల్ సెంచరీ.. కోహ్లి రికార్డులు మిస్

వన్డేల్లో ఎన్ని పరుగులు చేసినా.. టి20ల్లో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొట్టినా.. అవి ఓ బ్యాట్స్ మన్, బౌలర్ కు లెక్కలోకి రావు.. కేవలం టెస్టు క్రికెట్ నే ఓ క్రికెటర్ ప్రతిభకు కొలమానంగా పరిగణిస్తారు.

By:  Tupaki Desk   |   13 May 2025 12:30 PM
Virat Kohlis Retirement: The Records That Slipped Away
X

వన్డేల్లో ఎన్ని పరుగులు చేసినా.. టి20ల్లో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొట్టినా.. అవి ఓ బ్యాట్స్ మన్, బౌలర్ కు లెక్కలోకి రావు.. కేవలం టెస్టు క్రికెట్ నే ఓ క్రికెటర్ ప్రతిభకు కొలమానంగా పరిగణిస్తారు. అలాంటి టెస్టు క్రికెట్ లో చరిత్రలో గొప్ప బ్యాట్స్ మన్ గా నిలవాలంటే కొన్ని ప్రమాణాలు ఉన్నాయి.

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రిటైర్మెంట్ నేపథ్యంలో అతడి రికార్డులను పరిశీలిస్తే అబ్బా.. ఇవి మిస్ చేసుకున్నాడా? అనిపిస్తుంది. వీటిలో ముఖ్యమైనది టెస్టుల్లో 10 వేల పరుగులు. కోహ్లి 123 టెస్టుల్లో 9,230 పరుగులు చేశాడు. భారత జట్టు టెస్టు చరిత్రలో సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,288), సునీల్ గావస్కర్ (10,122) మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు. కోహ్లి మరొక్క ఏడాది ఆడినా పదివేల పరుగుల అరుదైన మైలురాయిని చేరేవాడేమో? కానీ, ఇంతలోనే రిటైర్మెంట్ ఇచ్చేశాడు.

టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ అనేది చాలా అరుదైన ఫీట్. భారత్ తరఫున కేవలం వీరేంద్ర సెహ్వాగ్ (309), (319), కరుణ్ నాయర్ (303 నాటౌట్) మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. అయితే, కోహ్లి అత్యధిక స్కోరు 254 దగ్గరే ఆగిపోయాడు. కోహ్లి టెస్టుల్లో కొనసాగినా.. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం అయితే.. ట్రిపుల్ సెంచరీ కొట్టడం కష్టమే.

ఇక మరో రికార్డు.. అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు చేయడం. క్రికెట్ లో సెంచరీల సెంచరీ (వన్డేల్లో 49, టెస్టుల్లో 51) చేసిన ఏకైక బ్యాటర్ సచిన్ టెండూల్కర్. ఓ దశలో కోహ్లి కూడా దీనికి దగ్గరగా వచ్చాడు. కానీ, 2020 తర్వాత ఫామ్ పడిపోవడంతో వెనక్కు వెళ్లిపోయాడు.

వన్డేల్లో 51, టి20ల్లో 1, టెస్టుల్లో 30 సెంచరీలు చేశాడు. మొత్తమ్మీద 82 సెంచరీల దగ్గరే ఆగిపోయాడు. ఇప్పుడు వన్డేలు మాత్రమే ఆడబోతున్నాడు. ఈ ఏడాది ముగిసేలోగా 9 వన్డేలు ఉన్నాయి. వీటిలో రెండో, మూడో సెంచరీలు చేస్తే.. 2027 ప్రపంచ కప్ వరకు ఆడితే మరో 9 సెంచరీలు అవుతాయేమో. అలా 60 వన్డే సెంచరీలతో.. మొత్తం సెంచరీల సంఖ్య 91కి చేరుస్తాడు. అప్పటికీ సచిన్ కంటే 9 సెంచరీలు వెనుకబడి ఉంటాడు.

-సచిన్ కు సాధ్యం కానిది.. కోహ్లి అందుకున్నది ఒక్క టి20 సెంచరీ మాత్రమే. సచిన్ తన కెరీర్ లో ఒక్కటే అంతర్జాతీయ టి20 ఆడాడు. మొత్తమ్మీద గణాంకాలు పక్కనపెడితే కోహ్లిది సచిన్ స్థాయే అనడంలో సందేహం లేదు.