Begin typing your search above and press return to search.

అనారోగ్యంతో బాధపడుతున్న విరాట్.. అసలేమైంది?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అంటేనే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్‌కు బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ. మైదానంలో కోహ్లీ ఉన్నాడంటే ఆ జోష్ వేరుగా ఉంటుంది.

By:  A.N.Kumar   |   16 April 2026 3:37 PM IST
అనారోగ్యంతో బాధపడుతున్న విరాట్.. అసలేమైంది?
X

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అంటేనే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్‌కు బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ. మైదానంలో కోహ్లీ ఉన్నాడంటే ఆ జోష్ వేరుగా ఉంటుంది. అయితే, తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్.ఎస్.జీ)తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ప్రదర్శన వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. అనారోగ్యం వేధిస్తున్నా శరీరం సహకరించకపోయినా జట్టు కోసం తను పడ్డ తపన చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

శరీరం సహకరించకున్నా.. క్లాస్ తగ్గలేదు

బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పోరులో లక్నో నిర్దేశించిన 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ అసలైన ‘ఛేజ్ మాస్టర్’ అనిపించుకున్నాడు. కేవలం 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 49 పరుగులు చేసి జట్టుకు గట్టి పునాది వేశాడు. కేవలం ఒకే ఒక్క పరుగుతో అర్ధశతకాన్ని కోల్పోయినప్పటికీ ఆ ఇన్నింగ్స్ విలువ వంద పరుగులతో సమానమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇన్నింగ్స్ తర్వాత ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ‘ఆరెంజ్ క్యాప్’ ను కూడా కైవసం చేసుకున్నాడు.

100 శాతం ఫిట్ కాదు.. కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ వేడుకలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి."నేను ఇంకా 100 శాతం ఫిట్‌గా లేను. నిజం చెప్పాలంటే గత నాలుగు ఐదు రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. దానితో పాటు గత మ్యాచ్‌లో తగిలిన మోకాలి గాయం ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇప్పుడు కాస్త కోలుకుంటున్నప్పటికీ శరీరం ఇంకా పూర్తి స్థాయిలో సహకరించడం లేదు" అని కోహ్లీ వెల్లడించాడు.ఒక అగ్రశ్రేణి అథ్లెట్ తన అసౌకర్యాన్ని దాచుకుని మైదానంలో ఆ స్థాయిలో పోరాడటం అతని అంకితభావానికి నిదర్శనం.

ఇంపాక్ట్ ప్లేయర్‌గా కోహ్లీ

కోహ్లీ ఆరోగ్యం దృష్ట్యా టీమ్ మేనేజ్‌మెంట్ ఒక తెలివైన నిర్ణయం తీసుకుంది. అతనిపై ఫీల్డింగ్ ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఈ మ్యాచ్‌లో అతడిని ‘ఇంపాక్ట్ ప్లేయర్’ గా బరిలోకి దింపారు. కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం చేసి, తగినంత విశ్రాంతి దొరికేలా ప్లాన్ చేశారు. అనారోగ్యంలో ఉండి కూడా మొదటి ఓవర్ నుంచే దూకుడు ప్రదర్శించడం చూస్తుంటే కోహ్లీలో గెలవాలనే కసి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా చిన్నస్వామి స్టేడియం అంటే పరుగుల వరద పారే పిచ్. కానీ ఈ మ్యాచ్‌లో సీన్ రివర్స్ అయింది. దీనిపై కోహ్లీ స్పందిస్తూ.. "ఈసారి వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. పిచ్‌పై అసలు గడ్డి లేదు, పైగా గత కొద్దిరోజులుగా బెంగళూరులో ఎండలు తీవ్రంగా ఉండటంతో వికెట్ పూర్తిగా పొడిగా మారింది. అందుకే బంతి బ్యాట్‌పైకి అనుకున్నంత వేగంగా రావడం లేదు. అందుకే పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని ప్లాన్ చేశాం, అది వర్కౌట్ అయింది" అని వివరించాడు.

అభిమానుల్లో ఆందోళన

కోహ్లీ ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలియడంతో సోషల్ మీడియాలో అభిమానులు ‘గెట్ వెల్ సూన్ కింగ్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆర్‌సీబీ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే కోహ్లీ ఫిట్‌నెస్ జట్టుకు చాలా ముఖ్యం. తదుపరి మ్యాచ్‌ల నాటికి అతను పూర్తిగా కోలుకుని.. మళ్ళీ తన పాత ఫామ్‌ను కొనసాగించాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.

మొత్తానికి విరాట్ కోహ్లీ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు ఓ అలుపెరగని పోరాట యోధుడు అని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది.