ఆట కంటే అతడు ఎక్కువా...? బీసీసీఐ ఇదేం పని?
టీమ్ ఇండియా సభ్యులకు కొత్తగా ఫిట్ నెస్ లో భాగంగా బ్రాంకో టెస్టు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఉన్న యోయోనే కఠినం అనుకుంటే ఈ రెండూ కచ్చితం చేశారు.
By: Tupaki Desk | 3 Sept 2025 7:00 PM IST**ఆట కంటే ఎవరూ ఎక్కువ కాదు** భారత క్రికెట్ లో తరచూ చెప్పే మాట ఇది..! కానీ, పోనుపోను ఆటగాళ్లే ఎక్కువ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇటీవలి కొన్ని నిర్ణయాలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీరును వివాదాస్పదం చేశాయి. కేవలం ఒక వ్యక్తి కోసమా? అన్నట్లు ఇప్పుడు మరో అంశంలోనూ బోర్డు వ్యవహార శైలిని అందరూ తప్పుబడుతున్నారు. ఆసియా కప్ మరికొద్ది రోజుల్లో.. అంటే ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం టీమ్ ఇండియాను ఇప్పటికే ఎంపిక చేశారు. టి20 ఫార్మాట్ లో జరిగే ఈ కప్ లో 360 డిగ్రీ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కే కెప్టెన్సీ అప్పగించారు. అయితే, వైస్ కెప్టెన్ గా మాత్రం టెస్టు కెప్టెన్ శుబ్ మన్ గిల్ ను అనూహ్యంగా ఎంపిక చేశారు. అంతకుముందు వైస్ కెప్టెన్ గా చేసిన అక్షర్ పటేల్ ను ఆటగాడిగా మాత్రమే కొనసాగించారు.
యోయోతో పాటు బ్రాంకో..
టీమ్ ఇండియా సభ్యులకు కొత్తగా ఫిట్ నెస్ లో భాగంగా బ్రాంకో టెస్టు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఉన్న యోయోనే కఠినం అనుకుంటే ఈ రెండూ కచ్చితం చేశారు. బ్రాంకోను తప్పించినట్లు కథనాలు వస్తున్నా అవేవీ నిర్ధారణ కాలేదు. ఇటీవల వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుబ్ మన్ గిల్, ఓపెనర్ జైశ్వాల్ తదితరులు ఈ టెస్టు పాసయ్యారు. ఇక మిగిలింది స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లినే.
అతడికి లండన్ లోనే టెస్టు..
ఈ ఏడాది ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు ముందు, ఐపీఎల్ జరుగుతుండగానే టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు కోహ్లి. జూన్ 3న తన ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచాక, మరుసటి రోజు బెంగళూరులో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నాడు. అటునుంచి అటే కుటుంబంతో సహా లండన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ లకు అతడు ప్రేక్షకుడిగా హాజరయ్యాడు. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ పంత్ లను తన ఇంటికి ఆహ్వానించాడు కూడా. ఇప్పటికీ కోహ్లి ఇంకా ఇంగ్లండ్ లోనే ఉన్నాడు. దీంతో అతడు యోయో/ బ్రాంకో టెస్టులను అక్కడే నిర్వహించుకుంటానని బోర్డుకు సమాచారం ఇచ్చాడట. దీనికి బోర్డు కూడా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ, ఈ విషయం ఇప్పుడు చర్చనీయం అయింది. రూల్ అంటే అందరికీ ఒకేలా ఉండాలని, కోహ్లికి మాత్రం మినహాయింపు ఎందుకని ప్రశ్నలు వస్తున్నాయి. మిగతా ఆటగాళ్లంతా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఫిట్ నెస్ టెస్టుకు హాజరయ్యారు.
-ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ వచ్చే నెల 19 నుంచి మొదలుకానుంది. కోహ్లి టి20లు, టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చినందున ఈ వన్డే సిరీస్ కు అందుబాటులో ఉంటాడు. అందుకని లండన్ నుంచే ఫిట్ నెస్ టెస్టుకు ముందస్తు పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ రిపోర్టును వైద్యులు పరిశీలించి బోర్డుకు నివేదిస్తారు. కోహ్లి కాకుండా బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిలు మాత్రమే ఇంకా ఫిట్ నెస్ టెస్టులకు హాజరవాల్సి ఉంది. వీరికి గాయాలు ఉండడంతో కాస్త సమయం ఇచ్చారు.
