Begin typing your search above and press return to search.

సరిగ్గా 17 ఏళ్ల క్రితం..ప్రపంచ క్రికెట్‌లో అద్భుతం మొదలైంది..

వన్డే మ్యాచ్‌తోనే కెరీర్‌ను మొదలుపెట్టిన కోహ్లి.. ఇప్పటివరకు ఈ ఫార్మాట్లో 302 మ్యాచ్‌లు ఆడాడు. 290 ఇన్నింగ్స్‌లో 14,181 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 183. సగటు 5.788. మొత్తం 51 సెంచరీలు చేశాడు.

By:  Tupaki Desk   |   19 Aug 2025 3:00 AM IST
సరిగ్గా 17 ఏళ్ల క్రితం..ప్రపంచ క్రికెట్‌లో అద్భుతం మొదలైంది..
X

ప్రపంచ క్రికెట్‌ ఎందరో గొప్ప ఆటగాళ్లను చూసింది..వారిలో ఆల్‌ రౌండర్‌లు ఉన్నారు.. బ్యాట్స్‌మెన్లు ఉన్నారు.. బౌలర్లు ఉన్నారు.. కానీ, వీరంతా ఏదో ఒక ఫార్మాట్‌లోనో, రెండు ఫార్మాట్లలోనో గొప్పవారు.. ఇతడు మాత్రం మూడు ఫార్మాట‍్లలోనూ మొనగాడు. వందకు పైగా టెస్టులు.. 300 పైగా వన్డేలు.. 125 టి20లు..! ఇది ట్రాక్‌ రికార్డు కాదు.. ఇండస్ట్రీ రికార్డ్‌..! మొత్తమ్మీద చూస్తే ప్రపంచ క్రికెట్‌లో అతడో సూపర్‌ మ్యాన్‌. ఆ అద్భుతానికి పునాది పడింది సరిగ్గా 17 ఏళ్ల కిందట ఇదే రోజు.

అనుకున్నంత సులువుగా ఏం కాలేదు..

సరిగ్గా సచిన్‌ టెండూల్కర్‌ యుగం మొదలయ్యే సమయంలో వచ్చాడు విరాట్‌ కోహ్లి. తన శకం మొదలుపెట్టాడు. 2008లో అండర్‌ 19 ప్రపంచ కప్‌ గెలిచిన భారత జట్టు కెప్టెన్‌గా ఆరు నెలల్లోనే జాతీయ జట్టులోకి వచ్చాడు. మహామహులు ఉన్న జట్టుకు ఎంపికయ్యాడు. ఆ ఏడాది ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఆడాడు. అంటే ఇప్పటికి 17 ఏళ్లు అన్నమాట. రావడం అయితే సులువుగానే వచ్చాడు కానీ.. కోహ్లి ప్రయాణం అనుకున్నంత సులువుగా ఏమీ జరగలేదు. సెహ్వాగ్‌, సచిన్‌, గంభీర్‌, రైనా, రోహిత్‌, ధోనీ, యువరాజ్‌ తదితరులు ఉండడంతో 2011 వరకు వన్డే తుది జట్టులో చోటు ఖాయం కాలేదు. 2011 వన్డే ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ తన పాత్ర మరీ జూనియర్‌ యాంకర్‌. అయితే, 2012 నుంచి కోహ్లి ఎరా మొదలైంది.

వన్డేల్లో మొనగాడు

వన్డే మ్యాచ్‌తోనే కెరీర్‌ను మొదలుపెట్టిన కోహ్లి.. ఇప్పటివరకు ఈ ఫార్మాట్లో 302 మ్యాచ్‌లు ఆడాడు. 290 ఇన్నింగ్స్‌లో 14,181 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 183. సగటు 5.788. మొత్తం 51 సెంచరీలు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధికం ఇవే. 74 హాఫ్‌ సెంచరీలు బాదాడు. 2011 ప్రపంచ కప్‌ అందుకున్న జట్టులో సభ్యుడు. సచిన్‌ (18426), సంగక్కర (14234) తర్వాత కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు.

-కోహ్లి 2011, 2015, 2019, 2023 వన్డే ప్రపంచ కప్‌లు ఆడాడు. 2019లో సెమీస్‌ చేరిన జట్టుకు అతడే కెప్టెన్‌. 2027 వన్డే ప్రపంచ కప్‌ వరకు కొనసాగితే ఐదో ప్రపంచ కప్‌ ఆడిన అతి తక్కువ మంది క్రికెటర్ల సరసన నిలుస్తాడు. 19 ఏళ్ల కుర్రాడిగా 2008లో అరంగేట్రం చేసిన కోహ్లి దాదాపు 40 ఏళ్ల మధ్య వయస్కుడిగా 2027 ప్రపంచ కప్‌ ఆడినట్లు అవుతుంది.

-కోహ్లి 2024 జూన్‌లో టి20లకు రిటైర్మెంట్‌ ఇచ్చాడు. ఈ ఏడాది మేలో టెస్టుల నుంచి వైదొలగాడు. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో అక్టోబరులో జరగబోయే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇటీవల ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. అంటే.. తాను ఎక్కడైతే మొదలుపెట్టాడో అందులోనే ఉన్నాడు.

కొసమెరుపుః 2008లో కోహ్లి తొలి వన్డే ఆడిన జట్టులో ఉండి ఇప్పటికీ కొనసాగుతున్నది ఒకే ఒక్కడు. అతడు కెప్టెన్‌ (వన్డే) రోహిత్‌శర్మ, నాడు కోహ్లి ఓపెనర్‌గా వచ్చాడు. అవతలి ఎండ్‌లో పార్టనర్‌ ఎవరు అంటే.. ప్రస్తుతం టీమ్‌ ఇండియా హెడ్‌ కోచ్‌గా ఉన్న గౌతమ్‌ గంభీర్‌.