Begin typing your search above and press return to search.

మంగళగిరిలో టీమిండియా దిగ్గజాల ఢీ.. ఎవరు గెలిచారంటే?

మొత్తానికి భారత క్రికెట్ లో ఆ ఇద్దరూ దిగ్గజ బ్యాట్స్ మెన్ అనడంలో సందేహం లేదు. అలాంటి ఆ ఇద్దరూ మన విజయవాడలో తలపడ్డారు. ఇది ఆశ్చర్యంగా ఉన్నా నిజం

By:  Tupaki Desk   |   12 Dec 2023 10:06 AM GMT
మంగళగిరిలో టీమిండియా దిగ్గజాల ఢీ.. ఎవరు గెలిచారంటే?
X

ఒకరు టెస్టులను వన్డేల్లా.. వన్డేలను టి20ల్లా ఆడిన బ్యాట్స్ మన్.. మరొకరు టెస్టు క్రికెట్ కే మారు పేరుగా నిలిచిన మేరునగధీరుడు.. వన్డేలకు తగడని పక్కనపెడితే.. పిచ్ పై కొట్టిన బంతిలా తిరిగొచ్చి పదివేల పరుగులు కొట్టాడు.. ఒకరు టెస్టు క్రికెట్ స్వరూపాన్నే మార్చేస్తే.. మరొకరు టెస్టు బ్యాట్స్ మన్ కు సిసలైన ప్రతిరూపంగా నిలిచారు. మొత్తానికి భారత క్రికెట్ లో ఆ ఇద్దరూ దిగ్గజ బ్యాట్స్ మెన్ అనడంలో సందేహం లేదు. అలాంటి ఆ ఇద్దరూ మన విజయవాడలో తలపడ్డారు. ఇది ఆశ్చర్యంగా ఉన్నా నిజం..

అరి 'వీర రాహుల్'

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బ్యాట్స్ మన్ గా ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. వన్ డౌన్ లో 15 ఏళ్లకు పైగా జట్టుకు సేవలందించాడు అతడు. టెస్టులు, వన్డేల్లో పదివేలకు పైగా పరుగులు సాధించాడు. ఇక వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనర్ గా చేసిన విధ్వంసాలు మామూలువి కాదు. టెస్టులు, వన్డేల్లో 8 వేలకు మించి పరుగులు చేశాడతడు. భారత్ తరఫున టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన రికార్డు అతడొక్కడిదే. సెహ్వాగ్, ద్రవిడ్ ఇద్దరూ కలిసి జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. రిటైర్మెంట్ అనంరతం ద్రవిడ్ కోచింగ్ బాధ్యతల్లోకి వచ్చాడు. సెహ్వాగ్ కామెంట్రీ చేస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ మంగళగిరి తలపడ్డారు.. అవును.. ద్రవిడ్‌, సెహ్వాగ్‌ పోటీపడుతున్నారు. కానీ వారు రాహుల్‌ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ కాదు

అచ్చం తండ్రలు పాత్రల్లో..

రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్‌ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్య వీర్‌ సెహ్వాగ్‌.. విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ జాతీయ అండర్‌-16 టోర్నీలో ఆడుతున్నారు. వారి సొంత రాష్ట్రాలు కర్ణాటక, దిల్లీ మధ్య సోమవారం మూడు రోజుల మ్యాచ్‌ ఏపీలోని మంగళగిరిలో ఉన్న ఏసీఏ మైదానంలో మొదలైంది. కర్ణాటకకు అన్వయ్‌ కెప్టెన్‌, వికెట్ కీపర్. ఆర్యవీర్‌ దిల్లీకి ఓపెనర్‌. అంటే.. సీనియర్ ద్రవిడ్ లాగానే అతడి కుమారుడు కూడా కెప్టెన్, వికెట్ కీపింగ్ చేస్తున్నాడన్నమాట. ఆర్యవీర్ తన తండ్రిలాగే ఓపెనర్ పాత్ర పోషిస్తున్నాడు. కాగా,మ్యాచ్ తొలి రోజు జూనియర్‌ ద్రవిడ్‌ డకౌట్‌ కాగా.. జూనియర్‌ సెహ్వాగ్‌ 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అన్వయ్ డకౌటయ్యాడు. ఈ మ్యాచ్ లో కర్ణాటక తొలి ఇన్నింగ్స్ లో 56.3 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన దిల్లీ మొదటి రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. ఆర్యవీర్ 98 బంతుల్లో 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. తొలిరోజు ఆటను పరిశీలిస్తే... ఒక విధంగా టీనేజ్‌ ద్రవిడ్‌ టీమ్‌పై కుర్ర సెహ్వాగ్‌ పైచేయి సాధించాడు.

కొసమెరుపు: సెహ్వాగ్ కు ఇద్దరు కుమారులు. వీరిలో ఆర్యవీర్ పెద్దవాడు. 2007లో పుట్టాడు. మరొకడు వేదాంత్. 2010లో జన్మించాడు. ఇక ద్రవిడ్ కూ ఇద్దరు కుమారులు. వీరిలో రెండో కుమారుడు అన్వయ్. 2009లో పుట్టాడు. పెద్దవాడు సమిత్ 2005లో జన్మించాడు. ద్రవిడ్ 2003లో నాగపూర్ కు చెందిన సర్జన్ విజేతను వివాహమాడాడు. సెహ్వాగ్ 2004లో ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు.