Begin typing your search above and press return to search.

మిస్ట‌రీ మిస్ వ‌రుణ్..ప్ర‌త్య‌ర్థుల ర‌న్ మెషిన్.. ఫైన‌ల్ ఆడ‌తాడా?

వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బ‌లం గుక్క తిప్పుకోనివ్వ‌ని బంతులు. కానీ, ఇవేమీ ప్రపంచ‌క‌ప్ లో ప‌డిన‌ట్లు క‌నిపించ‌డం లేదు.

By:  Tupaki Political Desk   |   7 March 2026 7:00 PM IST
మిస్ట‌రీ మిస్ వ‌రుణ్..ప్ర‌త్య‌ర్థుల ర‌న్ మెషిన్.. ఫైన‌ల్ ఆడ‌తాడా?
X

నాలుగైదేళ్ల కింద‌టి వ‌ర‌కు టీమిండియా టి20 స్పిన్ బ‌లం య‌జ్వేంద్ర చాహ‌ల్-కుల్దీప్ యాద‌వ్-. ర‌వీంద్ర జ‌డేజా -అక్ష‌ర్ ప‌టేల్. లేదంటే, అప్పుడ‌ప్పుడు ర‌విచంద్ర‌న్ అశ్విన్. కానీ, ఈ మ‌ధ్య కాలంలో అనూహ్యంగా దూసుకొచ్చాడు వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి. 2021లో 29 ఏళ్ల వ‌య‌సులో టీమ్ఇండియాలోకి అడుగుపెట్టాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో మిస్ట‌రీ స్పిన్ తో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) జ‌ట్టును గెలిపిస్తూ.. అటునుంచి అటే భార‌త జ‌ట్టులో చోటు సంపాదించాడు. 44 మ్యాచ్ ల‌లో 72 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ టి20 ప్ర‌పంచ క‌ప్ ముందు వ‌ర‌కు కూడా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిపై ఎన్నో అంచ‌నాలున్నాయి. ఒక‌టీ అరా మ్యాచ్ ల‌లో భారీగా ప‌రుగులు ఇచ్చినా, ఎక్కువ శాతం మ్యాచ్ ల‌లో అద్భుతంగా బౌలింగ్ చేయ‌డ‌మే దీనికి కార‌ణం. కానీ, గురువారం ఇంగ్లండ్ తో వాంఖ‌డే స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్ చూశాక మాత్రం అబ్బే.. ఇదేం బౌలింగ్ అని అభిమానులు మండిప‌డుతున్నారు. కేవ‌లం 4 ఓవ‌ర్ల‌లోనే 64 ప‌ర‌గులు ఇవ్వ‌డంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌ను క‌నీసం ఒక్క ఓవ‌ర్ అయినా క‌ట్ట‌డి చేయ‌క‌పోవ‌డంతో ఫైన‌ల్ కు వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిని త‌ప్పించాల‌నే డిమాండ్లు వ‌స్తున్నాయి.

బంతి తిర‌గ‌డం లేదా?

వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బ‌లం గుక్క తిప్పుకోనివ్వ‌ని బంతులు. కానీ, ఇవేమీ ప్రపంచ‌క‌ప్ లో ప‌డిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. అందుకే వ‌రుస‌గా బ్యాట్స్ మెన్ బాదేస్తున్నారు. వెస్టిండీస్ పై 40, జింబాబ్వేపై 35 ప‌రుగులు ఇచ్చిన అత‌డు ఒక్క‌టే వికెట్ తీశాడు. సెమీస్ లోనూ ఇంగ్లండ్ బ్యాట‌ర్ బ‌ట్ల‌ర్ వికెట్ ప‌డ‌గొట్టినా.. అత‌డు ఫామ్ లో లేని బ్యాట‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. సూప‌ర్ 8 తొలి మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికాపై వ‌రుణ్ 47 ప‌రుగులిచ్చి ఒక వికెట్ మాత్ర‌మే తీశాడు. లీగ్ ద‌శ‌లో బ‌ల‌హీన నెద‌ర్లాండ్ మీద‌నే మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీన్నంత‌టినీ చూస్తుంటే వ‌రుణ్ బంతుల్లో బ‌ల‌మైన మిస్ట‌రీ మిస్ అయిందా? అనిపిస్తోంది.

ఫైన‌ల్ కు ఆడిస్తారా లేదా?

అహ్మ‌దాబాద్ పిచ్ అస‌లే బ్యాట్స్ మెన్ కు అనుకూలం. ఈ నేప‌థ్యంలో వ‌రుణ్ ను ఆదివారం జ‌రిగే టి20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్లో ఆడిస్తారా? లేదా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. పైగా న్యూజిలాండ్ బ్యాట‌ర్లు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో వ‌రుణ్ ను త‌ప్పించ‌డ‌మే మేలు అంటున్నారు. కానీ, అటు చూస్తే, చైనామ‌న్ కుల్దీప్ యాద‌వ్ కూడా గొప్ప‌గా బౌలింగ్ చేయ‌డం లేదు. స్పిన్ ఆల్ రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ ను ద‌క్షిణాఫ్రికాపై ఆడిస్తే పూర్తిగా తేలిపోయాడు. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. క‌ష్ట‌మో న‌ష్ట‌మో వ‌రుణ్ ను ఫైన‌ల్లో ఆడించ‌డ‌మే ఉత్త‌మం అనే అభిప్రాయం వినిపిస్తోంది. కీల‌క మ్యాచ్ కు ముందు జ‌ట్టు కూర్పు మార్చ‌డం ఎందుకు? అని కూడా పేర్కొంటున్నారు. అస‌లే బ్యాటింగ్ లో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ పేల‌వ ఫామ్ రీత్యా, ఆరో బౌలింగ్ ప్ర‌త్యామ్నాయం శివ‌మ్ దూబెను పూర్తిగా న‌మ్మ‌లేనందున ప్ర‌యోగాలు చేయ‌లేని ప‌రిస్థితి. టీమ్ఇండియా మేనేజ్ మెంట్ ఏం నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.