వైభవ్ సూర్యవంశీ: కారున్న ’మైనరు’.. తోలాలంటే నాలుగేళ్లు ఆగాలి తమరు
13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ కు ఎంపికై ఔరా అనింపించాడు బిహారీ బాలుడు వైభవ్ సూర్యవంశీ.
By: Tupaki Desk | 10 Jun 2025 9:00 PM ISTఇటీవలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ లో అత్యంత సంచలనం ఏమిటి..? రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలిసారి టైటిల్ గెలవడమా? ఈ సీజన్ లో 300 కొడుతుంది అనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) ప్లేఆఫ్స్ నకు కూడా చేరకపోవడమా..? ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడమా..? వాస్తవానికి ఇవేమీ కాదు.
13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ కు ఎంపికై ఔరా అనింపించాడు బిహారీ బాలుడు వైభవ్ సూర్యవంశీ. అంతేకాక, గుజరాత్ టైటాన్స్ వంటి జట్టపై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. మొత్తం 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఏడు మ్యాచ్ లలో 252 పరుగులు చేశాడు. స్ట్రయిక్ రేట్ 206.55 కావడం విశేషం.
తనపై వెచ్చించిన రూ.1.10 కోట్ల ధరకు న్యాయం కూడా చేశాడు.
ఇటీవల బిహార్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీని వైభవ్ విమానాశ్రయంలో కుటుంబంతో సహా కలిశాడు. వైభవ్ కు గొప్ప భవిష్యత్ ఉందని.. మోదీనే కొనియాడారు. ఇప్పటికే ఇంగ్లండ్ లో పర్యటించే భారత అండర్ 19 జట్టుకు ఎంపికైన వైభవ్ అక్కడా రాణిస్తే ఈ ఫార్మాట్ లో ప్రపంచ కప్ నకు వెళ్లడం ఖాయం. వచ్చే రంజీ ట్రోఫీ సీజన్ లోనూ వైభవ్ అదరగొడితే 16 ఏళ్ల వయసు లోపే టీమ్ ఇండియాకు ఆడినా ఆశ్చర్యం లేదు.
ఇదంతా అలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీకి ఇటీవల కారు గెలుచుకున్నాడు. సహజంగా ఈ వయసు పిల్లలకు పెద్దవాళ్లు రిమోట్ కార్లు గిఫ్ట్ గా ఇస్తుంటారు. కానీ, వైభవ్ పిల్లల్లో పెద్దవాడు కదా..? అతడు కారునే గెలిచాడు. ఐపీఎల్ లో 206 స్ట్రయిక్ రేట్ తో పరుగులు చేసింనదుకు ఈ కారును అందుకున్నాడు. కానీ, వైభవ్ మరో నాలుగేళ్లకు కానీ.. దానిని డ్రైవ్ చేయలేదు. ఇండియాలో వాహనం నడిపేందుకు కనీస వయసు 18 ఏళ్లు కావడమే దీనికి కారణం. అప్పటివరకు లైసెన్సు కూడా ఇవ్వరు. అందుకే వైభవ్ సూర్యవంశీని కారున్న ’మైనరు..’ నాలుగేళ్ల ఆగాలి మీరు అంటున్నారు.
