Begin typing your search above and press return to search.

బ్యాట్ పట్టి కప్పు గెలిచాడు.. ఇప్పుడు పెన్ను పట్టి బోర్డు ఎగ్జామ్స్ రాయబోతున్నాడు!

భారత క్రికెట్ ఆకాశంలో మరో ధృవతార ఉదయించింది. కేవలం 14 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.

By:  A.N.Kumar   |   14 Feb 2026 2:48 PM IST
బ్యాట్ పట్టి కప్పు గెలిచాడు.. ఇప్పుడు పెన్ను పట్టి బోర్డు ఎగ్జామ్స్ రాయబోతున్నాడు!
X

భారత క్రికెట్ ఆకాశంలో మరో ధృవతార ఉదయించింది. కేవలం 14 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. మైదానంలో పరుగుల వరద పారించిన ఈ 'వండర్ కిడ్', ఇప్పుడు తన జీవితంలో మరో కీలకమైన ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడు. అదే.. పదో తరగతి బోర్డు పరీక్షలు!

- క్రికెట్ మైదానంలో పరుగుల సునామీ

ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్ కప్‌లో వైభవ్ ప్రదర్శన అమోఘం. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో 175 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడి బ్యాటింగ్ వీరవిహారం భారత్‌ను విశ్వవిజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది. అతి పిన్న వయస్సులోనే అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడిని అధిగమించి ఆడిన తీరు చూసి దిగ్గజ క్రికెటర్లే ఆశ్చర్యపోతున్నారు.

విజయం వెంటే విద్యా బాధ్యత

ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో మునిగిపోకుండా తన భవిష్యత్తుకు పునాది అయిన చదువుపై వైభవ్ దృష్టి సారించాడు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు ఈ యువ హీరో సిద్ధమయ్యాడు. సమస్తిపూర్‌లోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిగా వైభవ్ తన విద్యా బాధ్యతలను నెరవేర్చుకోబోతున్నాడని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ నీల కిషోర్ సగర్వంగా ప్రకటించారు. ఒక చేత్తో ప్రపంచ కప్ అందుకున్న వైభవ్.. ఇప్పుడు మరో చేత్తో పెన్ను పట్టి పరీక్షలు రాయబోతున్నాడు. క్రీడలు, చదువుల మధ్య అతను పాటిస్తున్న సమతుల్యం నేటి తరానికి ఆదర్శం.

నేటి యువతకు స్ఫూర్తిప్రదాత

సాధారణంగా చిన్న వయస్సులో స్టార్‌డమ్ వస్తే చదువును నిర్లక్ష్యం చేయడం చూస్తుంటాం. కానీ వైభవ్ అందుకు భిన్నం. మైదానంలో బౌలర్లను ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో పరీక్షా హాల్‌లో ప్రశ్నలను ఎదుర్కోవడం కూడా అంతే ముఖ్యమని ఈ కుర్రాడు నిరూపిస్తున్నాడు.అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని అలవోకగా భరించిన వైభవ్, ఇప్పుడు విద్యా రంగంలోనూ తన సత్తా చాటుతాడని క్రీడా విశ్లేషకులు.. అతడి ఉపాధ్యాయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కప్ గెలిచిన హీరోగా దేశం గర్వించేలా చేసిన వైభవ్.. చదువులోనూ రాణించి లక్షలాది మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం.