Begin typing your search above and press return to search.

వైభవ్ ను కేర్ ఫుల్ గా చూసుకోండి.. వాళ్ల మాదిరి చేయొద్దు

ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగిలిన విషయాల్ని పక్కన పెట్టేసి.. ఆట మీద మాత్రమే మరింత ఫోకస్ పెంచే వాతావరణం వైభవ్ సూర్యవంశీ చుట్టూ ఉండాలి.

By:  Tupaki Desk   |   5 May 2025 11:00 AM IST
వైభవ్ ను కేర్ ఫుల్ గా చూసుకోండి.. వాళ్ల మాదిరి చేయొద్దు
X

పద్నాలుగేళ్ల వయసులో ఎలా ఉంటారు? అన్న ప్రశ్నకు ఇప్పుడు చెప్పే సమాధానం క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మాదిరి ఉండరని చెబుతున్నారు. దీనికి కారణం.. ఇంత పిన్న వయసులో ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన అతగాడు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనంగా మారాడు. కేవలం 35 బంతుల్లో సెంచరీ బాదేసిన సూర్య వంశీ ఇప్పుడెంతలా పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిహార్ కు చెందిన ఈ టీనేజర్ ఆట చూసిన తర్వాత.. అతడి ఫ్యూచర్ గురించి కొంత ఆందోళనకు గురవుతున్న వారు లేకపోలేదు.

ఎందుకలా అంటే.. రాత్రికి రాత్రి వచ్చి పడిన స్టార్ స్టేటస్.. మీడియా మొదలు సోషల్ మీడియా వరకు అతడే హాట్ టాపిక్ కావటం.. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అతడి మీద కన్నేయటం లాంటివి చూసినప్పుడు.. ఈ చిన్న కుర్రాడిని కొంతకాలం కేర్ ఫుల్ గా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. పాపులార్టీ.. స్టార్ డం కొందరికి రావొచ్చు. కానీ.. వాటిని డీల్ చేసే విషయంలో చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమవుతుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగిలిన విషయాల్ని పక్కన పెట్టేసి.. ఆట మీద మాత్రమే మరింత ఫోకస్ పెంచే వాతావరణం వైభవ్ సూర్యవంశీ చుట్టూ ఉండాలి. లేకుంటే.. ట్రాక్ తప్పేందుకు చాలానే అవకాశాలు ఉంటాయి. ఇదే విషయాన్ని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్. అతడ్ని సచిన్ టెండూల్కర్ లా చేయాలని.. అంతే తప్పించి వినోద్ కాంబ్లి మాదిరి చేయొద్దని సూచన చేయటం గమనార్హం.

‘అతడ్ని సచిన్ టెండూల్కర్ మాదిరి చేయాలి. వినోద్ కాబ్లి.. ప్రథ్వీ షా మాదిరి కానీయొద్దు. సచిన్ కుర్రాడిగా ఉన్నప్పుడు కేవలం ప్రతిభతోనే సక్సెస్ కాలేదు. క్రమశిక్షణ.. తెలివైన కోచ్.. మంచి కుటుంబం సచిన్ ను గందరగోళం నుంచి కాపాడాయి. అదే సమయంలో అంతే ప్రతిభ ఉండి.. బహుళా సచిన్ కంటే మెరుగైన బ్యాటర్ అయిన కాంబ్లి.. క్రమశిక్షణ లేని కారణంగా దారి తప్పాడు. అతని ఎదుగుదల కూడా అతని పతనం మాదిరే నాటకీంగా సాగింది’ అంటూ తానేం చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాడు.

ఈ సందర్భంగా మీడియాతో పాటు.. ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు.. మెంటార్లకు కీలక సూచన చేశాడు. అతిగా ప్రచారం చేయటం.. మార్కెటింగ్ చేయకుండా చక్కగా సానపట్టాలని చెప్పిన ఛాపెల్ సరైన సమయంలో సలహా సూచనతో పాటు హెచ్చరిక కూడా జారీ చేశాడని చెప్పాలి. మరోవైపు.. వైభవ్ ఆట తీరును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించి.. ప్రశంసల వర్షం కురిపించారు. సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చూశానని.. ఎంతో శ్రమతో చిన్న వయసులోనే గొప్ప రికార్డును నెలకొల్పినట్లుగా పేర్కొన్నారు. ఎంత ఎక్కువ ఆడితే అంత బాగా మెరుగుపడతారంటూ ప్రధాని పేర్కొన్నారు.