జెర్సీ నంబర్ 03.. జూన్ 26.. భారత క్రికెట్ చరిత్రలో నయా శకం
అప్పుడెప్పుడో 1988 నవంబరు..! భారత క్రికెట్ లో ఓ శకం మొదలైంది.. అది చివరకు చరిత్రగా మిగిలింది..! మళ్లీ 38 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్త శకం షురూ కానుంది.
By: Tupaki Desk | 23 Jun 2026 5:18 PM ISTఅప్పుడెప్పుడో 1988 నవంబరు..! భారత క్రికెట్ లో ఓ శకం మొదలైంది.. అది చివరకు చరిత్రగా మిగిలింది..! మళ్లీ 38 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్త శకం షురూ కానుంది. అది కూడా మరి మూడు రోజుల్లో..! అవును ఈ నెల 26 నుంచి ఐర్లాండ్ తో జరిగే టి20 సిరీస్ నుంచి భారత క్రికెట్ లో కొత్త కెరటం రానుంది. బిహార్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. ఐర్లాండ్ తో రెండు టి20ల సిరీస్ కోసం ఎంపికైన వైభవ్ కు .. తాజాగా టీమ్ ఇండియా జెర్సీని అందజేశారు. ఇక మిగిలింది టీమ్ ఇండియా క్యాప్ అందుకోవడమే.! దానికి ముహూర్తం ఈ నెల 26 అయినా ఆశ్చర్యం లేదు.
నంబర్ ఎంతంటే?
వైభవ్ ఈ నెల 26న టీమ్ ఇండియా తరఫున మైదానంలోకి దిగితే కేవలం 15 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన వాడిగా చరిత్రలో నిలిచిపోతాడు. 1988లో దిగ్గజ క్రికెటర్ సచిన్ 16 ఏళ్ల వయసులో భారత జట్టుకు ఎంపికయ్యాడు. 38 ఏళ్ల ఈ రికార్డును వైభవ్ బద్దలు కొట్టనున్నాడు. కాగా, ఇప్పుడు వైభవ్ కు నంబర్ 03 జెర్సీని కేటాయించారు. బహుశా అతడు ఈ నెల 26న తొలి టి20 ఆడడం ఖాయం అయినందునే టీమ్ఇండియా జెర్సీని అందించి ఉంటారని భావించవచ్చు. ఎందుకంటే, వైభవ్ ను ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో అతడు ముక్కోణపు సిరీస్ లో ఇటీవల శ్రీలంక ఏ జట్టుపై ఆడిన ఇన్నింగ్స్ మరింత బలాన్నిచ్చింది.
మరో ఓపెనర్ ఎవరు?
వైభవ్ తో కలిసి ఐర్లాండ్ పై టీమ్ ఇండియా ఇన్నింగ్స్ ను మొదలుపెట్టేది ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం సంజూ శాంసన్ అని కనిపిస్తోంది. అదే జరిగితే, దూకుడైన అభిషేక్ శర్మను పక్కనపెట్టినట్లు అవుతుంది. అలా కాకుండా సంజూను వన్ డౌన్ లో ఆడిస్తే సమీకరణాలు అభిషేక్-వైభవ్ గా ఉంటాయి. వీరిద్దరూ లెఫ్ట్ హ్యాండర్లే. వన్ డౌన్ లో సంజూను దింపి.. నాలుగో నంబరులో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వస్తాడు. ఐదో నంబరులో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దిగొచ్చు. టాప్ ఆర్డర్ లో అందరూ లెఫ్ట్ హ్యాండర్లే ఎందుకు? అని భావిస్తే అభిషేక్ ను తాత్కాలికంగా అయినా పక్కనపెట్టే చాన్సుంది. కానీ, అదంత సులభమైన నిర్ణయం కాదు.
క్యాప్ అందించేది ఎవరు?
వైభవ్ కు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లేదా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా క్యాప్ అందించే చాన్సుంది. వీరిద్దరూ కాదంటే, ఐర్లాండ్ టూర్ కు జట్టుతో వెళ్లే భారత మాజీలు ఎవరైనా క్యాప్ ఇవ్వవచ్చేమో? మొత్తానికి 15 ఏళ్ల వయసుకే టీమ్ఇండియా వంటి అత్యంత పోటీ ఉండే జట్టులోకి ఎంపికవడం అంటే వైభవ్ మామూలోడు కాదు అని స్పష్టం చేస్తోంది.
