తృటిలో చేజారిన సెంచరీ.. అయినా చరిత్ర వైభవ్ సూర్యవంశీ సంచలనం!
ఐపీఎల్ చరిత్రలోనే ఒక అపూర్వమైన.. నభూతో నభవిష్యతి అన్న చందంగా సాగిన ఒక సంచలన ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.
By: A.N.Kumar | 27 May 2026 9:17 PM ISTఐపీఎల్ చరిత్రలోనే ఒక అపూర్వమైన.. నభూతో నభవిష్యతి అన్న చందంగా సాగిన ఒక సంచలన ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. సాధారణంగా అంతర్జాతీయ క్రికెటర్లే ఐపీఎల్ లాంటి భారీ వేదికపై ఒత్తిడికి లోనవుతుంటారు. కానీ కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచ స్థాయి బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ వండర్ కిడ్.. సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. స్టేడియంలోని నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ అభిమానులను ఊహించని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
తృటిలో చేజారిన సెంచరీ.. కానీ రికార్డుల వేట..
ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి.. కేవలం 3 పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు. అయితే అతడి ఇన్నింగ్స్ సాగిన తీరు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. వైభవ్ చేసిన 97 పరుగులలో ఏకంగా 92 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే రావడం విశేషం. అతని ఇన్నింగ్స్‌లో 12 భారీ సిక్సర్లు, 5 అద్భుతమైన ఫోర్లు ఉన్నాయి. అంటే సింగిల్స్, డబుల్స్ జోలికి వెళ్లకుండా కేవలం బౌండరీలతోనే ప్రత్యర్థి బౌలింగ్ లైన్‌అప్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకొని ఈ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా దీనిని నమోదు చేశాడు.
కమిన్స్ వ్యూహాలు ఫ్లాప్.. బౌండరీల తుఫాన్!
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ కెప్టెన్ ప్రపంచ స్థాయి దిగ్గజ బౌలర్ ప్యాట్ కమిన్స్ మ్యాచ్‌కు ముందే వైభవ్‌ను అవుట్ చేయడానికి ప్రత్యేక వ్యూహాలు రచించినట్లు పేర్కొన్నాడు. అయితే మైదానంలోకి దిగాక ఆ ప్రణాళికలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ముఖ్యంగా కమిన్స్ వేసిన ఒకే ఓవర్లో వైభవ్ వరుసగా మూడు భారీ సిక్సర్లు బాదడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. వైభవ్ విధ్వంసక బ్యాటింగ్ పుణ్యమా అని రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం 8 ఓవర్లలోనే 125 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచగలిగింది.
సెంచరీ దిశగా దూసుకుపోతున్న వైభవ్.. ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి.. మలింగ పట్టిన ఒక అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దీంతో స్టేడియంలోని అభిమానులంతా ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయారు. క్రిస్ గేల్ పేరిట ఉన్న 30 బంతుల అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశాన్ని వైభవ్ కేవలం ఒకే ఒక్క బంతితో మిస్ చేసుకున్నాడు.
క్రిస్ గేల్ 14 ఏళ్ల రికార్డు బద్దలు!
ఈ ఇన్నింగ్స్ ద్వారా సెంచరీ మిస్ అయినప్పటికీ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట 2012 నుంచి చెక్కుచెదరకుండా ఉన్న ఒక అరుదైన రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా గేల్ (59 సిక్సర్లు) రికార్డును ఈ మ్యాచ్‌లో బాదిన 12 సిక్సర్ల ద్వారా వైభవ్ అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. "14 ఏళ్లుగా ఎవరికీ సాధ్యంకాని రికార్డును.. కేవలం 15 ఏళ్ల వయసున్న ఒక కుర్రాడు బద్దలు కొట్టడం నమ్మశక్యం కాని విషయం!" అని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
భారత క్రికెట్ కాబోయే సూపర్ స్టార్!
గత మ్యాచ్‌లోనే హైదరాబాద్‌పై సెంచరీ బాదిన వైభవ్.. ఇప్పుడు మరోసారి అదే జట్టుపై ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఆడటం అతడి నిలకడకు, ప్రతిభకు అద్దం పడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం ఎంత పెద్ద తప్పో హైదరాబాద్ యాజమాన్యానికి వైభవ్ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. భారత క్రికెట్‌కు భవిష్యత్తులో ఒక తిరుగులేని సూపర్ స్టార్ దొరికాడని.. అతడి బ్యాటింగ్‌లో లారా స్టైల్, గేల్ పవర్ ఉన్నాయని నెటిజన్లు, మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
