వైభవ్ సూర్యవంశీ 171.. టీమ్ ఇండియా 433.. రికార్డులు బద్దలు
14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. టోర్నీ ఏదైనా సెంచరీ ఖాయం అంటున్నాడు.
By: Tupaki Desk | 12 Dec 2025 4:29 PM IST14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. టోర్నీ ఏదైనా సెంచరీ ఖాయం అంటున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన వైభవ్ రాజస్థాన్ రాయల్స్ తరఫున 35 బంతుల్లోనే సెంచరీ కొట్టేయడం విశేషం. ఆ తర్వాత యూత్ వన్డే సిరీస్ లో, యూత్ టెస్టులో, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ (స్మాట్)లో మూడంకెల స్కోరు చేసేశాడు. శుక్రవారం అండర్-19 ఆసియా కప్ లో అదరగొట్టాడు. ఇంతకూ ఈ టోర్నీ ఎక్కడ జరిగింది అంటే... దుబాయ్ లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో ఈ బిహారీ బాబు 55 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈకి చుక్కలు చూపించాడు. మొత్తం 95 బంతుల్లో 171 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 14 సిక్సులు, 9 ఫోర్లు ఉండడం విశేషం. ఇక వైభవ్.. మరికొన్ని బంతులు ఆడి ఉంటే డబుల్ సెంచరీ కూడా కొట్టేసేవాడేమో..?? కానీ, 33వ ఓవర్ చివరి బంతికే బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. సూర్యవంశీ దూకుడు చూస్తుంటే.. అతడు అండర్ 19 స్థాయిలోనే ఏదో ఒక టోర్నీలో డబుల్ సెంచరీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
సరిగ్గా నెల రోజుల్లో.. వచ్చే ప్రపంచ కప్ లో..
అండర్ 19 ప్రపంచ కప్ లో వైభవ్ సూర్యవంశీ చెలరేగడం ఖాయం. జనవరి 15 నుంచి ఈ ప్రపంచకప్ జింబాబ్వేలో జరగనుంది. కెప్టెన్ ఆయుష్ మాత్రే (18ఏళ్లు) కంటే వైభవ్ సూర్యవంశీనే అన్ని టోర్నీల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో అండర్ 19 ప్రపంచ కప్ లో జట్టుకు వైభవ్ కెప్టెన్ అయినా ఆశ్చర్యం లేదు. తాజాగా అండర్-19 ఆసియా కప్ లో ఆయుష్ 4 పరుగులకే వెనుదిరిగాడు. కానీ, వైభవ్ భారీ సెంచరీకి అరోన్ జార్జి (69), విహాన్ మల్హోత్రా (69), వేదాంత్ త్రివేది (38) కూడా దుమ్మురేపడంతో యువ టీమ్ ఇండియా ఏకంగా 433 పరుగుల భారీ స్కోరు సాధించింది. 2004లో అండర్ 19 భారత జట్టు చేసిన 425 పరుగుల రికార్డు స్కోరు ప్రస్తుత జట్టు అధిగమించింది.
వైభవ్.. ఇక టీమ్ఇండియాలోకేనా!
14 ఏళ్ల వయసుకే రికార్డులతో హోరెత్తిస్తున్న సూర్యవంశీని ఇప్పుడు టీమ్ ఇండియా సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తన ఏజ్ గ్రూప్ నకు మించిన ఆటతీరును కనబరుస్తున్న వైభవ్ 14 ఏళ్ల 260 రోజుల వయసులో ఉన్నాడు. మరొక్క 105 రోజులు అయితే , 15 ఏళ్లు నిండుతాయి. ప్రస్తుతం ఉన్న ఐసీసీ నిబంధనల ప్రకారమైతే అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు 15 ఏళ్లు ఉండాలి. అంతకంటే తక్కువ వయసు వారిని ఎంపిక చేయాలంటే ఆయా దేశాల బోర్డులు ఐసీసీ అనుమతి తీసుకోవాలి. ఇప్పటికే వైభవ్ పైన భారత సెలక్టర్లు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇదే జోరు కొనసాగితే, వచ్చే ఏడాదిలో అతడిని సీనియర్ జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యం లేదు.
