ఇండియాకు అందలం.. పాకిస్తాన్ కు అవమానం.. లంకలో పరిస్థితిదీ..
భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు మైదానం వెలుపల కూడా కనిపిస్తున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
By: A.N.Kumar | 20 Feb 2026 11:53 PM ISTశ్రీలంకలో జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలో పాకిస్తాన్ జట్టుకు జరిగిన వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి కంటే.. తమతో శ్రీలంక పోలీసులు వ్యవహరించిన తీరే ఎక్కువ బాధ కలిగించిందని పాకిస్తాన్ బౌలర్ ఉస్మాన్ తారిక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీలంక పోలీసుల ప్రవర్తనపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
"ఓటమి బాధ కాదు... అవమానం బాధ"
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి సహజమేనని.. క్రికెట్‌లో గెలుపోటములు సహజమని ఉస్మాన్ తారిక్ పేర్కొన్నారు. అయితే మ్యాచ్ తర్వాత జరిగిన భద్రతా తనిఖీలు మాత్రం తమకు అవమానంగా అనిపించాయని అన్నారు. “మేము ఓడిపోయినందుకు బాధపడటం లేదు. కానీ మా ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది అందరి బ్యాగులను రెండుసార్లు చెక్ చేశారు. అదే సమయంలో భారత ఆటగాళ్ల బ్యాగులను మాత్రం చెక్ చేయలేదు. ఈ విధమైన భిన్న వైఖరి ఎందుకు?” అని ఆయన ప్రశ్నించారు.
పోలీసుల తనిఖీలపై అనుమానాలు
సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో భద్రతా చర్యలు కఠినంగా ఉండటం సహజమే. కానీ అన్ని జట్లపైనా సమానంగా అమలు చేయాల్సిన నిబంధనలు ఒకే జట్టుపైనే కఠినంగా అమలు చేయడం పక్షపాతానికి దారి తీస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ జట్టు సభ్యుల బ్యాగులను రెండుసార్లు తనిఖీ చేయడం, ఇతర జట్లకు మాత్రం సడలింపులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది.
క్రీడల్లో రాజకీయాల ప్రభావమా?
ఈ ఘటనతో మరోసారి క్రీడల్లో రాజకీయాల ప్రభావంపై చర్చ మొదలైంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు మైదానం వెలుపల కూడా కనిపిస్తున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయ టోర్నీల్లో సమానత్వం, పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఐసీసీ, నిర్వాహకుల స్పందన ఏంటి?
ఈ అంశంపై ఇంకా అధికారికంగా శ్రీలంక క్రికెట్ బోర్డు లేదా ఐసీసీ స్పందించలేదు. అయితే పాకిస్తాన్ జట్టు అభ్యంతరాలు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వాహకులు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. భద్రతా తనిఖీలు సాధారణ విధానంలో భాగమా? లేక నిజంగా పక్షపాతం జరిగిందా? అన్నది స్పష్టత అవసరం.
పాకిస్తాన్ ముందు నుంచి ఉగ్రవాద దేశం. ఆ దేశ పౌరులను ఎక్కడైనా అనుమానిస్తారు. ఉగ్రవాదానికి మూలం పాక్ గడ్డ. అందుకే పాక్ క్రికెటర్లను కూడా ఏ దేశం మినహాయించకుండా తనిఖీలు చేస్తూనే ఉంటుంది. భారతీయుల విషయంలో అలాంటి ఉగ్రజాఢలు లేవు. అందుకే వదిలేస్తుంది.
ఈ చిన్నపాటి లాజిక్ కూడా పాక్ బౌలర్ తారిఖ్ కు లేకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. క్రీడలు దేశాల మధ్య స్నేహానికి ప్రతీకగా నిలవాలి. కానీ బంగ్లాదేశ్ కు మద్దతుగా బాయ్ కాట్ చేస్తామంటూ మొసలికన్నీరు కార్చిన పాక్ కు ఇది తగిన శాస్తి అని అంటున్నారు. జట్ల మధ్య సమాన వ్యవహారం వారు చూపించే నిబద్ధత, వ్యక్తిత్వంపైనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
ఈ ఘటనపై త్వరలోనే స్పష్టత రావాల్సి ఉంది. లేదంటే ఇది మరో పెద్ద వివాదానికి దారి తీసే అవకాశముంది.
