మెట్లు ఎక్కలేని స్థితిలో... చరిత్ర మరువని పరుగుల చిరుత..
జన్మతః వచ్చిన జీన్స్... శరీర నిర్మాణంలోని ప్రత్యేకతతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు.
By: Tupaki Desk | 17 Sept 2025 1:39 PM ISTఅతడి పరుగుకు చిరుత కూడా చిన్నబోయేది... అతడు ట్రాక్ లో అడుగుపెడితే ప్రత్యర్థులు బెంబేలెత్తేవారు.. పోటీ ఏదైనా టైటిల్ అతడిదే అని అభిమానులు నిర్ధారించుకునేవారు.. పతకం కాదు ఎంత తక్కువ సమయంలో పరుగు పూర్తిచేశాడో అని రిఫరీలు పరీక్షించుకునేవారు.. ఓ పదేళ్లు ప్రపంచ అథ్లెటిక్స్ ను అంతగా పరుగులు పెట్టించాడు.
జన్మతః వచ్చిన జీన్స్... శరీర నిర్మాణంలోని ప్రత్యేకతతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు.
చరిత్ర మరువని చిరుత
కరీబియన్ దీవులంటే క్రికెట్ కే కాదు మేటి అథ్లెట్లకూ పెట్టింది పేరు. అలాంటి దీవుల్లోని జమైకా నుంచి వచ్చినవాడే ఉసేన్ బోల్ట్. 8 ఒలింపిక్ బంగారు పతకాలతో ప్రపంచ దిగ్గజ స్ప్రింటర్ గా నిలిచాడు. 100, 200, 4x100 మీటర్లు ఇలా ఏ పోటీలో అయినా ఒక దశలో ఉసేన్ బోల్ట్ దే ఆధిపత్యం. ప్రపంచ రికార్డులు అతడి ధాటి ముందు చెరిగిపోతుండేవి. మొత్తం 11 సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు బోల్ట్. ఇప్పటికీ ఇది రికార్డు. దీని దగ్గరకు కూడా రాలేదు ఎవరు. బోల్ట్ 2017లో అథ్లెటిక్స్ కు గుడ్ బై చెప్పాడు. అప్పటినుంచి ట్రాక్ కు దూరమైన అతడు కుటుంబంతో గడుపుతున్నాడు.
ఖాళీగా కూచుంటే...
ఏ మనిషికైనా ఫిట్ నెస్ ముఖ్యం. కనీసం నాలుగు అడుగులు అటుఇటు అయినా వేస్తుండాలి. కానీ, ఒకప్పుడు అత్యంత ఫిట్ నెస్ తో అత్యంత వేగవంతమైన 100 మీటర్ల పరుగును రికార్డు సమయంలో పూర్తిచేసిన బోల్ట్.. రిటైర్మెంట్ తర్వాత ఫిట్ నెస్ ను పక్కనపెట్టాడు. కుటుంబంతో గడిపేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తూ.. తన శరీరంపై నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. తాజాగా అతడు మాట్లాడుతూ పిల్లలు స్కూల్ కు వెళ్లేప్పటికి తాను నిద్రలేస్తానని, ఆ తర్వాత సాయంత్రం వరకు వెబ్ సిరీస్ లు చూస్తూ కూర్చుంటానని తెలిపాడు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కాసేపు వారితో ఆడుకోవడం, జిమ్ మొక్కుబడిగా చేయడంతో రోజును గడిపేస్తున్నట్లు చెప్పాడు.
మెట్లు కూడా ఎక్కే స్థితిలో లేడా..?
బోల్ట్ ఆరు అడుగులకు పైగా మంచి దేహ దారుఢ్యంతో ఉండే అథ్లెట్. అలాంటివాడు ఇప్పుడు కనీసం మెట్లు కూడా ఎక్కలేక ఆయాసపడుతున్నాడట. టోక్యో ప్రపంచ చాంపియన్ షిప్ ను చూసేందుకు వచ్చిన అతడు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఈ విషయం తెలిపాడు. ఒకప్పుడు లేడికి లేచిందే పరుగు అన్నట్లున్న అతడు ఇప్పుడు కనీసం పరుగు తీయడం లేదట. ఎక్కువగా ఇంటికే పరిమితం అవుతున్నాడట. మెట్లు ఎక్కే సమయంలో ఆయాసం వస్తున్నందన, మళ్లీ పరుగు మెదలుపెడితే అంతా సెట్ రైట్ అవుతుందని ఉసేన్ బోల్ట్ చెప్పుకొచ్చాడు.
