టీ20 యూఎస్ జట్టు.. మెజార్టీ సభ్యులు మనోళ్లే
తాజాగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ ను అమెరికాతో తలపడింది.
By: Garuda Media | 8 Feb 2026 10:01 AM ISTతాజాగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ ను అమెరికాతో తలపడింది. ఈ మ్యాచ్ కు ముందు అంతా.. అమెరికా జట్టును టీమిండియా ఒక ఆట ఆడేస్తుందని భావించారు.కట్ చేస్తే.. యూఎస్ దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. యూఎస్ జట్టును తక్కువగా అంచనా వేసిన టీమిండియా సభ్యులు.. మ్యాచ్ మధ్యలో కానీ పుంజుకొని ఉండకపోతే.. పెను సంచలన ఫలితం వచ్చేది. మొత్తానికి చచ్చీచెడీ గెలిచినప్పటికీ.. అమెరికన్ క్రికెటర్ల ఆట తీరు ఆకట్టుకునేలా సాగింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. పేరుకు అమెరికా టీ20 క్రికెట్ టీం అనే కానీ.. సగం కంటే ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారే జట్టులో ఉండటం ఆసక్తికరం. ఆ మాటకు వస్తే.. టీం మొత్తంలో ఒక్కరు కూడా పక్కా అమెరికన్ కాకపోవటం విశేషంగా చెప్పాలి.
టీమిండియాకు తమ ఆటతో ముచ్చెమటలు పోసేలా చేసిన అమెరికా జట్టులో మెజార్టీ సభ్యులు భారత మూలాలకు చెందిన వారే. వారిలో ఒకరు తెలుగోడు ఉన్నాడు. అతని పేరు సాయితేజ ముక్కమల్ల. పేరుతోనే అతను అసలుసిసలు తెలుగోడన్న విషయం అర్థమవుతంది. అతడి తండ్రి ఉద్యోగ రీత్యా అమెరికాలో సెటిల్ కావటంతో సాయితేజ అక్కడే పెరిగాడు. క్రికెట్ లో ట్రైనింగ్ కోసం భారత్ తో పాటు.. యూకేలోనూ తీసుకున్నాడు. ఏడాది పాటు వీవీఎస్ లక్ష్మణ్ అకాడమీలోనే ట్రైనింగ్ తీసుకున్న అతను.. ఆటతో చూపిన సత్తాతో అమెరికాలో జట్టులో చోటు దక్కించుకున్నాడు.
తన ఆటతో టీ20 లీగ్స్ లో సత్తా చాటిన అతనికి అమెరికా జట్టులో లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటున్న అతను టాప్ ఆర్డర్ లో కీలక బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్నాడు. సాయితేజతో పాటు మిలింద్ కుమార్ కూడా ఢిల్లీకి చెందిన వాడు. భారత్ లోనూ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ లో చోటు దక్కింది కూడా. అయితే.. మ్యాచ్ లో ఆడేందుకు అవకాశం లభించలేదు. దీంతో అతను అమెరికాకు వెళ్లిపోయి.. జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
మహారాష్ట్రకు చెందిన శుభమ్ రంజానే కథ కూడా ఈ తరహాలోనిదే. నాలుగేళ్ల క్రితం వరకు దేశవాళీల్లో ఆడాడు. ఇక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో అమెరికాకు వెళ్లిపోయాడు. అంతదాకా ఎందుకు.. ప్రస్తుత అమెరికా కెప్టెన్.. టాప్ ఆర్డర్ బ్యాటర్ మోనాంక్ పటేల్ ది గుజరాత్. అండర్ 19 స్థాయి వరకు అతను గుజరాత్ కే ప్రాతినిధ్యం వహించాడు. యూఎస్ టీంలోని స్పిన్ ఆల్ రౌండర్ హర్మీత్ సింగ్.. ఫాస్ట్ బైలర్ సౌరభ నేత్రావల్కర్ ఇద్దరూ ముంబయికి చెందిన వారే. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కం స్పిన్నర్ సంజయ్ క్రిష్ణమూర్తి పుట్టింది పెరిగింది యూఎస్ లో అయినా.. అతడి మూలాలు కర్ణాటకలోనే ఉన్నాయి. ఇలా అమెరికా జట్టులో పలువురు భారతీయులు.. భారత మూలాలున్నోళ్లు ఉన్నారు. ఇక.. జట్టులోని మిగిలిన వారిలో పాకిస్థాన్.. సౌతాఫ్రికా నుంచి అమెరికాలో స్థిరపడినోళ్లే. ఇలా.. పేరుకు అమెరికా జట్టే కానీ ఒక్కరు కూడా పక్కా అమెరికన్ క్రీడాకారుడు లేకపోవటం గమనార్హం.
