Begin typing your search above and press return to search.

ప్రపంచ కప్ ఫైనల్ పోరులో మన కుర్రాళ్లు.. చూసేద్దామా ఈ రోజు మ్యాచ్ ను!

డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన మన పిల్లల జట్టు మాంచి ఫామ్ లో ఉంది. అంచనాలకు తగ్గట్లు ఆడితే ఆసీస్ మీద విజయం ఖాయమన్న మాట వినిపిస్తోంది

By:  Tupaki Desk   |   11 Feb 2024 5:06 AM GMT
ప్రపంచ కప్ ఫైనల్ పోరులో మన కుర్రాళ్లు.. చూసేద్దామా ఈ రోజు మ్యాచ్ ను!
X

పిల్లలు కాదు పిడుగులుగా అదరగొట్టేస్తున్నారు అండర్ 19 ప్రపంచ కప్ లో మన పిల్లలు. తాజాగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల్లో విజయకేతనాన్ని ఎగురవేసిన మన కుర్రాళ్లు ఈ రోజు ఫైనల్ పోరులో ఆసీస్ పిల్లల్ని ఎదుర్కోనున్నారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన మన పిల్లల జట్టు మాంచి ఫామ్ లో ఉంది. అంచనాలకు తగ్గట్లు ఆడితే ఆసీస్ మీద విజయం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

కుర్రాళ్ల మెగా ఈవెంట్ గా చెప్పే ప్రపంచ కప్ టోర్నీలో తొమ్మిదోసారి టైటిల్ వేటకు అర్హత సాధించారు. ఇప్పటికే ఐదుసార్లు టోర్నీని సొంతం చేసుకున్న భారత్ కుర్రాళ్లు మరోసారి అలాంటి మేజిక్ ను క్రియేట్ చేసేందుకు ఉత్సాహపడుతున్నారు. ప్రపంచ కప్ ఫైనల్ పోరులో ఆసీస్ 5సార్లు ఫైనల్ కు చేరితే.. భారత్ కుర్రాళ్ల జట్టు తొమ్మిదోసారి ఫైనల్ కు చేరుకుంది. ఇప్పటివరకు టైటిల్ ను గెలుచుకున్న ఆసీస్ జట్టు.. పాకిస్థాన్.. సౌతాఫ్రికా జట్ల మీద మాత్రమే గెలవగలిగింది.

భారత్ మీద రెండుసార్లు ఫైనల్ పోరులో తలపడినా.. మన కుర్రాళ్ల ఆటకు తలవంచింది. దీంతో.. ఈసారి అలాంటి సీనే రిపీట్ అవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత టోర్నీలో రెండు జట్ల బలాబలాల్ని చూస్తే.. యువ భారత్ జట్ట ఆల్ రౌండ్ షోతో జైత్రయాత్ర చేస్తోంది. ఎవరికి వారు తమ స్థాయిలో దూసుకెళుతున్నారు.

జట్టు కెప్టెన్ ఉదయ్ సహరణ్ బ్యాటింగ్ లో ఈ టోర్నీలో ఇప్పటివరకు 389 పరుగులు చేయగా.. ముషీర్ ఖాన్ 338, సచిన్ దాస్ 294 పరుగులతో సూపర్ ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ విషయానికి వస్తే సౌమీ పాండే 17 వికెట్లు.. స్పిన్ మాయాజాలం ప్రత్యర్థి బ్యాటర్లను కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఇక.. ఆసీస్ విషయానికి వస్తే ఆ జట్టు ఓపెనర్ గా బరిలోకి దిగే హ్యారీ డిక్సన్ 267 పరుగులు.. కెప్టెన్ హ్యూగ్ వేగన్ 256 పరుగులతో రాణిస్తున్నారు. బౌలింగ్ లో కలమ్ విడ్లెర్ 12 వికెట్లు.. టాస్ స్ట్రేకర్ 12 వికెట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడుతున్నారు.

మొత్తంగా చూసినప్పుడు ఆసీస్ జట్టు కంటే మన జట్టే మెరుగ్గా ఉంది. టైటిల్ కోసం జరిగే తుదిపోరులో మన కుర్రాళ్లకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. టోర్నీలో విజయాల పరంగా చూస్తే.. భారత్ మాదిరే ఆసీస్ యువ జట్టు ధీటైన ప్రదర్శన చేసింది. సూపర్ సిక్స్ లో విండీస్ తో జరిగిన మ్యాచ్ రద్దు కాగా.. మిగిలిన ఐదు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగనుంది. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మ్యాచ్ లైవ్ షురూ కానుంది. స్టార్ స్పోర్ట్స్ 1లో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉంది. ఆదివారం.. ఎంచక్కా మన కుర్రాళ్ల ఆటను లంచ్ పూర్తి చేసిన తర్వాత చూస్తూ ఎంజాయ్ చేసేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. అందుకు రెఢీ కండి.