అంపైర్ తలకు బంతి విసిరిన పాక్ ప్లేయర్..! అద్భుతం అన్న అక్రమ్
ఇక మ్యాచ్ లో యూఏఈ బ్యాటింగ్ సందర్భంగా ఏకంగా అంపైర్ రుచిరా పల్లియుగురుగె వైపు బంతిని విసిరాడు పాక్ ఫీల్డర్.
By: Tupaki Desk | 18 Sept 2025 3:02 PM ISTభారత క్రికెటర్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడానికి రిఫరీనే కారణమంటూ యూఏఈతో మ్యాచ్ ను బహిష్కరించి ఆసియా కప్ నుంచే ఔట్ అయ్యేలా కనిపించిన పాకిస్థాన్ నవ్వుల పాలైంది. చివరకు మైదానంలో దిగి కాస్త కష్టంగానైనా యూఏఈపై గెలిచింది. కానీ, బుధవారం నాటి మ్యాచ్ కు ముందు బాయ్ కాట్ హైడ్రామా నడిపించిన పాక్ చివరకు తోక ముడిచింది.
షేక్ హ్యాండ్.. బాయ్ కాట్..
రిఫరీని తప్పుబడుతూ భారత్ తో మ్యాచ్ లో షేక్ హ్యాండ్ అంశాన్ని వివాదంగా మలిచిన పాకిస్థాన్.. యూఏఈతో మ్యాచ్ లో బాయ్ కాట్ చేస్తామని బెదిరించింది.. ఇక మ్యాచ్ లో యూఏఈ బ్యాటింగ్ సందర్భంగా ఏకంగా అంపైర్ రుచిరా పల్లియుగురుగె వైపు బంతిని విసిరాడు పాక్ ఫీల్డర్. ఇది అంపైర్ తలకు తగిలింది. దీంతో శ్రీలంకకు చెందిన రుచిరా మైదానాన్ని వీడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అక్రమ్.. నువ్వు కూడానా..?
పాకిస్థాన్ క్రికెటర్లలో వసీం అక్రమ్ అంటే మంచివాడు అనే పేరుంది. అతడి కామెంట్రీ కూడా హుందాగా ఉంటుంది. భారత మాజీ క్రికెటర్లతోనూ వసీంకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే, అలాంటివాడు కూడా బుధవారం నాటి మ్యాచ్ లో అంపైర్ కు బంతి తగిలిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఫీల్డర్ వికెట్లకు దూరంగా బంతిని విసరడాన్ని అక్రమ్ తప్పుబట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే సమయంలో అంపైర్ తలమీదుగా అద్భుతమైన త్రో అని కామెంట్ చేయడం వైరల్ గా మారింది.
కావాలనే చేశారా?
శ్రీలంకకు చెందిన అంపైర్ రుచిరా.. గతంలో పాకిస్థాన్ మ్యాచ్ లకు అంపైరింగ్ చేశాడు. ఆ సమయంలో పలు ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలు వెల్లడించాడు. దీంతోనే అతడిని పాక్ ఆటగాళ్లు టార్గెట్ చేశారు అనే కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇలా ప్రతీకారం తీర్చుకున్నారు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక భారత అభిమానులైతే.. అరుదైన అంపైర్ రిటైర్డ్ హర్ట్ అంటూ ఎద్దేవా చేశారు. మొన్నటి మ్యాచ్ లో రిఫరీ, నేటి మ్యాచ్ లో అంపైర్ టార్గెట్ అంటూ ఎగతాళి చేశారు.
పాక్ కు చెందిన సయీమ్ అయూబ్ బౌలింగ్ లో యూఏఈ బ్యాట్స్ మన్ ధ్రువ్ పరాశర్ బంతిని కొట్టాడు. సింగిల్ కోసం ప్రయత్నిస్తుండగా, ఫీల్డర్ నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు బంతిని విసిరాడు. కానీ, అది అంపైర్ రుచిరా తలకు తగిలింది. అతడు మైదానాన్ని వీడడంతో రిజర్వ్ అంపైర్ గాజీ సొహైల్ మైదానంలోకి వచ్చాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో వసీం అక్రమ్ వంటి దిగ్గజ ఆటగాడు చేసిన వ్యాఖ్యలే వైరల్ గా మారాయి. విమర్శలకు తావిచ్చాయి.
