యూఏఈ జట్టంతా రిటైర్డ్ ఔట్..ఎక్కువ ఇండియన్సే..ఇదేం మ్యాచ్ రా నాయనా?
రిటైర్డ్ ఔట్ కావడం వల్ల యూఏఈ ఇన్నింగ్స్ లో 8 మంది (రిటైర్డ్ ఔట్) డకౌట్, ఒకరు 0 నాటౌట్ గా ఉన్నారు.
By: Tupaki Desk | 11 May 2025 11:16 AM ISTఅసలే మహిళల క్రికెట్.. ఇప్పుడిప్పుడే ఆదరణ దక్కుతోంది.. పోటీ పక్కనపెడితే.. ప్రమాణాలు కాస్త తక్కువే.. అలాంటి మహిళల క్రికెట్ లో ఓ విచిత్రం జరిగింది..
వచ్చే ఏడాది మహిళల టి20 ప్రపంచ కప్ ఉంది. ఆసియా నుంచి ఇందులో పాల్గొనే జట్లను ఎంపిక చేసేందుకు క్వాలిఫయర్స్ నడుస్తున్నాయి. శనివారం యూఏఈ-ఖతర్ మధ్య మ్యాచ్ జరిగింది.
యూఏఈ జట్టు అంటే అందరూ ఎడాది దేశం వారే అనుకున్నారు. ఇందులో ఆరుగురు అమ్మాయిలు ఇండియన్సే. కెప్టెన్ ఈషా ఓజా (113; 55 బంతుల్లో 14×4, 5×6)తో పాటు మరో ఓపెనర్ తీర్థా సతీష్ (74; 42 బంతుల్లో 11×4) కూడా. వీరిద్దరు మాత్రమే బ్యాటింగ్ కు దిగారు. మిగతా 9 మందిని క్రీజులోకి దిగకుండానే రిటైర్డ్ ఔట్ గా ప్రకటించారు.
అప్పటికి 16 ఓవర్లలో జట్టు స్కోరు 192 మాత్రమే. అయితే ఈ మ్యాచ్ గెలవడం యూఏఈకి ముఖ్యం. కానీ, వర్షం అంతరాయంతో ఖతర్ ను ఓడించడానికి ఈ స్కోరు సరిపోతుందని యూఏఈ జట్టు భావించింది. దీంతో మొత్తం 10 మంది బ్యాటర్లు రిటైర్డ్ ఔట్ అని ప్రకటించింది. అనంతరం యూఏఈ బౌలర్లు మిచెల్లీ బోథా (3/11), కేటీ థాంప్సన్ (2/6) అద్భుతంగా రాణించడంతో ఖతర్ 11.1 ఓవర్లలో 29 పరుగులకే ఆలౌటైంది. ఏడుగురు డకౌట్ అయ్యారు. యూఏఈ 163 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రిటైర్డ్ ఔట్ కావడం వల్ల యూఏఈ ఇన్నింగ్స్ లో 8 మంది (రిటైర్డ్ ఔట్) డకౌట్, ఒకరు 0 నాటౌట్ గా ఉన్నారు. ఖతర్ ఇన్నింగ్స్ లో ఏడు డకౌట్లతో కలిపితే 15 మంది డకౌట్ అయ్యారు. 0 నాటౌట్ ను కూడితే 16 మంది ఖాతా తెరవనట్లు అన్నమాట. ఇది ప్రపంచ రికార్డు కావడం విశేషం. పురుషులు, మహిళల క్రికెట్ లో అంతర్జాతీయ స్థాయిలో ఇద్దరికి మించి రిటైర్డ్ ఔట్ అవ్వలేదు. కానీ, పది రిటైర్డ్ ఔట్ లతో యూఏఈ రికార్డు నెలకొల్పింది.
యూఏఈ జట్టులో ఈషా, తీర్థా, ఇందూజా, హీనా, వైష్ణవి, లావణ్య.. ఇలా ఆరుగురు ఇండియన్సే. ఇక ఖతర్ జట్టులోనూ ఒకరిద్దరు ఇండియన్స్ ఉన్నారు. పేసర్ సుథా థాపా వీరిలో ఒకరు.