Begin typing your search above and press return to search.

అయ్యో.. యువ భార‌త్.. చేజేతులా ఆసియా క‌ప్ అండర్‌-19 ఫైన‌ల్లో ఓట‌మి

అన్ని మ్యాచ్ లు బాగా ఆడి.. ఫైన‌ల్లో చేతులెత్తేసింది యువ భార‌త్..! క‌నీసం పోటీ కూడా కాదు అనుకున్న పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది..!

By:  Tupaki Desk   |   21 Dec 2025 11:55 PM IST
అయ్యో.. యువ భార‌త్.. చేజేతులా ఆసియా క‌ప్ అండర్‌-19 ఫైన‌ల్లో ఓట‌మి
X

అన్ని మ్యాచ్ లు బాగా ఆడి.. ఫైన‌ల్లో చేతులెత్తేసింది యువ భార‌త్..! క‌నీసం పోటీ కూడా కాదు అనుకున్న పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది..! మ‌రెవ‌రి మీదైనా ప‌రాజ‌యం పాలైనా ఫ‌ర్వాలేదు.. మ‌రెక్క‌డైనా ఓట‌మి ఎదురైనా స‌ర్దుకునే వార‌మే! కానీ, ఫైన‌ల్లో అదీ పాకిస్థాన్ చేతిలో ఓడిపోవ‌డంతో అభిమానుల‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆదివారం దుబాయ్ లో జ‌రిగిన ఆసియా కప్ అండ‌ర్ 19 తుది స‌మ‌రంలో భార‌త కుర్రాళ్లు విఫ‌ల‌మ‌య్యారు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోవ‌డ‌మే మ‌న జ‌ట్టును దెబ్బ‌తీసింది. మొద‌ట బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ ఏకంగా 348 ప‌రుగులు చేసింది. భార‌త పేస‌ర్లు ముఖ్యంగా కిష‌న్ సింగ్ (5 ఓవ‌ర్ల‌లో 50 ప‌రుగులు), దీపేశ్ దేవేంద్ర‌న్ (10 ఓవ‌ర్ల‌లో 83 ప‌రుగులు) ధారాళంగా ప‌రుగులు ఇచ్చారు. దీంతోపాటు పాక్ ఓపెన‌ర్ స‌మీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172, 17 ఫోర్లు, 9 సిక్సులు) ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి ఆడాడు. అత‌డికి అహ్మ‌ద్ హుస్సేన్ (72 బంతుల్లో 56) స‌హ‌కారం అందించాడు. స‌మీర్ మిన్హాస్ అచ్చ‌మైన సీనియ‌ర బ్యాట్స్ మ‌న్ లా రెచ్చిపోతున్నా.. భార‌త బౌల‌ర్లు క‌ట్ట‌డి చేయ‌లేక‌పోయారు. ఇక అత్యంత భారీ స్కోరును ఛేదించేందుకు బ‌రిలో దిగిన టీమ్ ఇండియా బ్యాట‌ర్లు వెంట‌వెంట‌నే వికెట్లు కోల్పోయారు.

ఆయుష్ తుస్..

అతి భారీ ల‌క్ష్యం ముందు ఉండ‌గా 14 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ తొలి ఓవ‌ర్లోనే 18 ప‌రుగులు బాదేసి ఆశ‌లు రేపాడు. కానీ, యువ టీమ్ ఇండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే (7 బంతుల్లో 2 ప‌రుగులు) మ‌రోసారి నిరాశ‌ప‌రిచ్చాడు . ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ లో మాత్ర‌మే రాణించిన ఆయుష్ పేల‌వ‌మైన షాట్ ఆడి వెనుదిరిగాడు. ఇక వైభ‌వ్ కు ఒక‌సారి లైఫ్ వ‌చ్చినా స‌ద్వినియోగం చేసుకోలేదు. పేస‌ర్ అలీ ర‌జా వేసిన అద్భుత‌మైన బంతికి కీప‌ర్ కు క్యాచ్ ఇచ్చాడు. అంత‌కుముందే వ‌న్ డౌన్ బ్యాట‌ర్ అరోన్ జార్జి (4 ఫోర్ల‌తో 16) బౌండ‌రీల మీద బౌండ‌రీలు బాది మంచి ట‌చ్ లో క‌నిపించినా వెంట‌నే లూజ్ షాట్ కు ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన‌వారూ విఫ‌లం కావ‌డంతో యువ టీమ్ ఇండియా 156 ప‌రుగుల‌కే ఆలౌటైంది. 191 ప‌రుగుల భారీతేడాతో ఓడిపోయింది. 26.2 ఓవ‌ర్ల‌లోనే ఆలౌటైంది. ప‌దో నంబ‌రు బ్యాట‌ర్ దీపేశ్ దేవంద్ర‌న్ (36) టాప్ స్కోర‌ర్.

టాస్ గెలిచి బౌలింగ్ ఎందుకో?

ఈ టోర్నీలో యూఏఈ, పాకిస్థాన్, మ‌లేసియా, శ్రీలంక‌ల‌ను ఓడించి అజేయంగా ఫైన‌ల్ చేరింది యువ టీమ్ ఇండియా. కానీ, ఫైన‌ల్లో మాత్రం నిరుత్సాహ‌ప‌రిచింది. బ్యాటింగ్ కు అనుకూలంగా క‌నిపించిన పిచ్ పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఛేజింగ్ లో భారీ టార్గెట్ ఎదుర‌వ‌డంతో కుర్రాళ్లు ఒత్తిడికి గుర‌య్యారు.

సీనియ‌ర్ల మ్యాజిక్ రిపీట్ చేయ‌లే

సెప్టెంబ‌రులో జ‌రిగిన ఆసియా క‌ప్ ఫైన‌ల్లో సీనియ‌ర్ టీమ్ ఇండియా.. పాకిస్థాన్ పై ఫైన‌ల్లో విజ‌యం సాధించి టైటిల్ కొట్టేసింది. అదే మ్యాజిక్ ను ఇప్పుడు యువ జ‌ట్టు రిపీట్ చేస్తుంద‌ని భావిస్తే సాధ్యం కాలేదు. మ‌రీ ముఖ్యంగా ఫైన‌ల్లో మొద‌ట బౌలింగ్ వైఫ‌ల్యం దెబ్బ‌తీసింది. త‌ర్వాత బ్యాట‌ర్లు చెల‌రేగుతారులే అనుకుంటే వారూ విఫ‌ల‌మ‌య్యారు. అయితే.. ఇంత‌టితో పోయేది ఏమీ లేదు..! బెట‌ర్ ల‌క్ నెక్ట్స్ టైమ్..!