Begin typing your search above and press return to search.

టీమిండియా ఓటమికి టాసే కారణమా?

అక్కడ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసే జట్టు గెలుస్తుందా, బౌలింగ్ చేసే జట్టు గెలుస్తుందా, గతంలో రికార్డ్ ఎలా ఉంది అన్న విషయాలపై క్రికెట్ అభిమానులు మొదలు కామెంట్రేటర్ల వరకు విశ్లేషణ చేస్తుంటారు.

By:  Tupaki Desk   |   20 Nov 2023 5:25 PM GMT
టీమిండియా ఓటమికి టాసే కారణమా?
X

క్రికెట్..దీనికి జెంటిల్మన్ గేమ్ అని మరో పేరు కూడా ఉంది. అంటే, క్రికెట్ లో టాస్ వేయడం మొదలు వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఏ జట్టు విజేత అని ప్రకటించే వరకు జెంటిల్మన్ మాదిరి నియమాలు, నిబంధనలు ఉంటాయన్నమాట. అయితే, కాలక్రమేణా క్రికెట్ నియమనిబంధనలలో ఎన్నో మార్పులుచేర్పులు జరిగాయి. కానీ, టాస్, పిచ్ ల తయారీ, డే అండ్ నైట్ మ్యాచ్ లు, మంచు ప్రభావం వంటి విషయాలలో మాత్రం ఏ మార్పూ రాలేదు. అందుకే, క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్న నానుడి కాస్తా..టాసెస్ విన్ మ్యాచెస్ గా మారిందంటే అతిశయోక్తి కాదు.

ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది అంటే సగటు క్రికెట్ అభిమాని ముందుగా తెలుసుకోవాలని ఆసక్తి చూపే విషయం పిచ్ రిపోర్ట్. ఆ మ్యాచ్ జరిగే వేదిక, అక్కడ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసే జట్టు గెలుస్తుందా, బౌలింగ్ చేసే జట్టు గెలుస్తుందా, గతంలో రికార్డ్ ఎలా ఉంది అన్న విషయాలపై క్రికెట్ అభిమానులు మొదలు కామెంట్రేటర్ల వరకు విశ్లేషణ చేస్తుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మెజారిటీ మ్యాచ్ లలో గెలుపోటములను ఇరు జట్లలోని ఆటగాళ్ల సామర్థ్యం కాదు..టాస్, పిచ్ డిసైడ్ చేస్తాయన్నది నగ్న సత్యం.

వన్డే క్రికెట్ ప్రపంచ కప్-2023 లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ చేశాడు అన్నది పాక్ మాజీ క్రికెటర్ సికిందర్ భట్ ఆరోపణ. ఒకవేళ పొరపాటున రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి ఉంటే..టీమిండియా కప్ గెలిచి ఉంటే ఈ ఆరోపణకు ఎన్నో కుట్ర సిద్ధాంతాలు జోడించి ఈ పాటికి కోకొల్లలుగా కథనాలు వెలువడి ఉండేవి. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టాస్ గెలవడం, ముందుకు ఫీల్డింగ్ తీసుకోవడంతో రోహిత్ పెద్ద అపవాదు నుంచి లక్కీగా బయటపడ్డాడని అనుకోవడంలో తప్పులేదు.

వాస్తవానికి టాస్ ఓడిపోయి మొదటి ఇన్నింగ్స్ లో స్లో, టర్నింగ్ పిచ్ పై బ్యాటింగ్ చేయడం భారత బ్యాటర్లకు కష్టతరంగా మారిందన్నది వాస్తవం. ఇక, నిర్లక్ష్యంతో కొందరు ప్లేయర్లు అనవసర షాట్ కొట్టి ఔట్ కావడం, ఆ తర్వాతి బ్యాట్స్ మన్ పై ఒత్తిడి పెరగడం, లో స్కోర్ కే పరిమితం కావడం, మన ఆటగాళ్లు కాస్త దూకుడుగా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఉండడం, ఫీల్డింగ్ లో లోపాలు, ఆసీస్ బ్యాటర్ల కట్టడికి భారత బౌలర్లు పక్కా ప్రణాళిక వేసుకోకపోవడం వంటి విషయాలు వేరేగా చర్చించాల్సి ఉంటుంది. ఇదే మ్యాచ్ లో టాస్ మనం గెలిచి ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి ఉంటే ఆ జట్టు ఆటగాళ్లు కూడా కచ్చితంగా ఇబ్బంది పడి ఉండేవారు.

అందుకే, క్రికెట్ మ్యాచ్ లో పిచ్ ల తయారీ, డే అండ్ నైట్ మ్యాచ్ లపై చర్చ చేయాల్సిన అవసరముంది. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల ప్రదర్శనను టాస్, పిచ్ నిర్ణయించడం నిజంగా శోచనీయం. పిచ్ ఇరు జట్లలో ఉన్న బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్ల సామర్థ్యాన్ని సమానంగా పరీక్షించేలా ఉండాలిగానీ, ఒక జట్టుకు ఒకలాగా, మరో జట్టుకు మరోలా ఉండకూడదు. మన దేశంలో కొన్ని పిచ్ లు మాత్రమే చిన్నాచితకా మార్పులు మినహా రెండు ఇన్నింగ్స్ లలో ఒకేలా ఉంటున్నాయి. అలాంటి పిచ్ లను రూపొందించడం క్యూరేటర్లకు పెద్ద సమస్య కాదు. కానీ, వారు ఏ కారణాల చేతనో అహ్మదాబాద్ వంటి పిచ్ లను రూపొందిస్తుంటారు. ఈ పిచ్ ల సమస్య మన దేశంలోనే కాదు..అన్ని దేశాల్లో ఉంది.

ఇక, డ్యూ ఫ్యాక్టర్ అనేది రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ జట్టు పాలిట శాపం అని చెప్పవచ్చు. రెండో ఇన్నింగ్స్ లో మంచు పడుతుంది అని తెలిసి కూడా డే అండ్ నైట్ మ్యాచ్ లు నిర్వహించడం శోచనీయం. ప్రేక్షకులు డే అండ్ నైట్ మ్యాచ్ లకే స్టేడియానికి ఎక్కువగా వస్తుంటారు, టీవీలలో వీక్షకులు కూడా ఎక్కువగా సాయంత్రం పూట వీక్షిస్తుంటారు కాబట్టి ఆ మ్యాచ్ లకే నిర్వాహకులు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. స్పాన్సర్లకు యాడ్ ల ద్వారా ఆదాయం కావాలి కాబట్టి ప్రేక్షుకులు, వీక్షకులు కోట్లలో ఉంటేనే వారు తమ కోట్ల పెట్టబడి రాబట్టగలరు. అయితే, వేసవి కాలంలో డ్యూ లేకుంటే డే అండ్ నైట్ మ్యాచ్ లు అయినా పర్వాలేదు కానీ, కనీసం శీతాకాలంలో మాత్రం డే మ్యాచ్ ల వైపు నిర్వాహకులు, ఐసీసీ ఆలోచించాల్సిన అవసరముంది.

వన్డేలలో డే మ్యాచ్ లు నిర్వహించడం, కొద్దో గొప్పో మార్పులు మినహా 100 ఓవర్లపాటు ఇరు జట్లకు ఒకే తరహాలో ఉండే పిచ్ లు రూపొందించడం కష్టమైన పనికాదు. అలా కాదు, కుదరదు అంటే క్రికెటర్లకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తో పాటు బొమ్మా బొరుసు (అచ్చు బొమ్మా)లో కూడా శిక్షణనిస్తే బాగుంటుంది.

అన్ని రకాల పిచ్ లపై బ్యాటింగ్, బౌలింగ్ చేయగలిగితేనే ఆటగాడి అసలు సత్తా బయటపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, ఒకే మ్యాచ్ లో ఒక జట్టు ఆటగాడికి పిచ్ ఒకలా సహకరించి, మరో జట్టు ఆటగాడిపై పిచ్ పగబడితేనే సమస్య. టాస్ ఎవరు గెలిచినా పర్లేదు...కానీ, ఆటగాళ్ల టాలెంట్, ఆ రోజు మైదానంలో వాళ్ల ప్రదర్శనను బట్టే జట్టు గెలుపోటములు ఉండాలన్నది నిర్వివాదాంశం.

క్రికెట్ లో 'పిచ్', 'టాస్', 'డ్యూ ఫ్యాక్టర్' బాస్ అయితే మరి ప్లేయర్లు ఎవరు? ఈ మూస పద్ధతి? ఇంకెన్నాళ్లు అన్న ప్రశ్నలు సగటు క్రికెట్ అభిమానిని తొలిచివేస్తున్నాయి. దశాబ్దాల క్రికెట్ చరిత్రలో ఎన్నో రూల్స్ మారాయి. పిచ్, డ్యూ ఫ్యాక్టర్, డక్ వర్త్ లూయీస్ లకు సంబంధించి రూల్స్ ను మార్చి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది! అలా చేయకుంటే క్రికెట్ ను 'జెంటిల్మెన్' గేమ్ అని పిలవడం వ్యర్థం!