Begin typing your search above and press return to search.

ప్రపంచ కప్ కొట్టేదెవరో కాదు.. ఈ టాప్ 5లో చితక్కొట్టేదెవరో..?

ఈ ప్రపంచ కప్ తర్వాత స్మిత్, కోహ్లి, రూట్, కేన్ నలుగురూ ఒక్కొక్కరుగావన్డేలకు దూరం జరిగినా ఆశ్చర్యం లేదు.

By:  Tupaki Desk   |   4 Oct 2023 4:30 PM GMT
ప్రపంచ కప్ కొట్టేదెవరో కాదు.. ఈ టాప్ 5లో చితక్కొట్టేదెవరో..?
X

ఆ నలుగురు బ్యాట్స్ మెన్ పుష్కర కాలంగా ప్రపంచ క్రికెట్ ను ఏలుతున్నారు. చిత్రమేమంటే.. వారంతా సమకాలీకులు. ఇంకా చెప్పాలంటే అండర్-19 దశనుంచే ఒకేసారి ప్రయాణం మొదలుపెట్టారు. అలాఅలా.. ప్రపంచ స్థాయి బ్యాట్స్ మన్ అయ్యారు. ఒకసారి వెనక్కుతగ్గినా.. పుంజుకొని ముందుకొచ్చేంత ఆత్మవిశ్వాసం వారిది. అందుకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (జీవోఏటీ)గా మిగిలిపోయారు. ఇప్పుడు వారంతా కెరీర్ చరమాంకంలో ఉన్నారు. వారి స్థానాన్ని భర్తీచేసేందుకు తానున్నానంటూ వస్తున్నాడో మేటి బ్యాట్స్ మన్. మరి భారత్ ఏకైక వేదికగా జరగనున్న ప్రపంచ కప్ లో ఈ ఐదుగురిలో ‘‘కొట్టేసేదెవరో?’’

ఫ్యాబ్ ఫోర్ లో కప్ అందించేవారే టాప్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి (భారత్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్).. వర్తమాన ప్రపంచ క్రికెట్ లో నిస్సందేహంగా మేటి బ్యాట్స్ మెన్. వీరందరికీ 33 ఏళ్లు దాటాయి. ఈ నేపథ్యంలో నలుగురిలో మేటి బ్యాట్స్ మన్ ఎవరంటే ఒక్కరిని చెప్పలేం. అయితే, ఈసారి ఎవరైతే నిలకడగా రాణించి తమ దేశానికి కప్ అందిస్తారో వారినే ఈ నలుగురిలో టాప్ బ్యాట్స్ మన్ అని గుర్తించక తప్పదు.

అతడు ఉన్నాడు..ఫ్యాబ్ 4లోని నలుగురూ కాక మరో బ్యాట్స్ మన్ కూడా ప్రపంచ క్రికెట్ పై తన ముద్ర వేస్తున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడుతూ మున్ముందు తానే టాప్ బ్యాట్స్ మన్ అని చాటుతున్నాడు. అతడే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్.

కోహ్లి అవుతాడా కింగ్?? భారత బ్యాట్స్ మన్ అని కాదు కాని.. ఫ్యాబ్ 4లో విరాట్ కోహ్లినే టాపర్. అయితే, క్రికెట్ కు ప్రామాణికం అయిన టెస్టుల్లో అతడి గణాంకాలు మిగతా ముగ్గురి కంటే తక్కువగా ఉన్నాయి. మరోవైపు స్మిత్ కు టి20లు, వన్డేల్లో, విలియమ్సన్ , రూట్ కు టి20ల్లో అసలు పెద్దగా పేరు లేదు. కాబట్టి కోహ్లినే టాప్ అనుకోవాలి. అయితే, కెరీర్ ప్రారంభంలోనే ప్రపంచ విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడైన అతడు తర్వాత కెప్టెన్ గా ఆ ఘనతను అందుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ అవకాశం ఓ మేటి బ్యాటర్ గా అతడి ముందు నిలిచింది. దీనిని సద్వినియోగం చేసుకుంటే కోహ్లినే నంబర్ వన్ అని ఒప్పుకోక తప్పదు.

స్మిత్ రూట్ కేన్ వీరిలో ఎవరో? 2015 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడైన స్టీవ్ స్మిత్ అప్పటికే ఆస్ట్రేలియా జట్టులో కీలకంగా ఉన్నాడు. కానీ, కప్ లో ఎక్కువ సారథ్య బాధ్యతలు మైకేల్ క్లార్క్ నిర్వర్తించి ట్రోఫీని అందుకున్నాడు. 2019లో మాత్రం స్మిత్ కష్టకాలం ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆ చిక్కులేమీ లేనందున ఆసీస్ ను ప్రపంచ విజేతగా నిలపగలడా? లేదా? అనేది చూడాలి.

2015, 2019 రెండు ప్రపంచ కప్ లలోనూ ఫైనల్ చేరిన న్యూజిలాండ్ జట్టులో కేన్ విలియమ్సన్ సభ్యుడు. 2019లో కెప్టెన్ కూడా. ఐపీఎల్ సందర్భంగా గాయమైన కేన్.. కోలుకుని మళ్లీ జట్టులోకి వచ్చాడు. భారత్ లో ఎప్పటినుంచో ఐపీఎల్ ఆడుతున్న అతడు న్యూజిలాండ్ ను ఎలా నడిపిస్తాడో చూడాలి. కప్ ను అందిస్తే గనుక న్యూజిలాండ్ ను తొలిసారి ప్రపంచ విజేతగా నిలిపిన ఘనత అందుకుంటాడు.

రూట్ రూటేమిటో? ఇంగ్లండ్ చరిత్రలోనే టెస్టుల్లో మేటి బ్యాట్స్ మన్ ఎవరంటే జో రూట్ పేరు చెప్పక తప్పదు. అయితే, వన్డేల్లో పరిపూర్ణ బ్యాట్స్ మన్ అని చెప్పలేని పరిస్థితి. ఈ కారణంగానే రూట్ కు వన్డే కెప్టెన్సీ దక్కలేదు. 2019లో ఇంగ్లండ్ విజేతగా నిలవడంలో రూట్ పాత్రను విస్మరించలేం. అయితే, క్రెడిట్ అంతా నాటి కెప్టెన్ మోర్గాన్ కు దక్కింది. కానీ, ఇప్పుడు మాత్రం భారత పిచ్ లపై ఆడగల సత్తా మిగతా ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ కంటే రూట్ కే ఎక్కువ. కాబట్టి రూట్ తనదైన నిలకడతో రాణించి కప్ అందిస్తే ఇంగ్లండ్ గ్రేట్ బ్యాట్స్ మన్ గా రికార్డులకెక్కుతాడు.

బాబర్ దండయాత్ర స్మిత్, కోహ్లి, రూట్, కేన్ తర్వాతి తరంలో బ్యాటింగ్ విన్యాసాలు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కే సొంతం. కోహ్లి తరహాలో మూడు ఫార్మాట్లూ ఆడగల సత్తా బాబర్ ది. అంతేకాదు..మూడు ఫార్మాట్లోనూ కెప్టెన్ గా ఉన్నది బాబర్. దీన్నిబట్టే అతడి స్థాయి ఏమిటో చెప్పొచ్చు. కాగా, గత ప్రపంచ కప్ సమయానికే బాబర్ పాక్ బ్యాటింగ్ మూల స్తంభం. ఇప్పుడు తమ దేశంలాంటి పరిస్థితులే ఉండే భారత్ లో ప్రపంచ కప్ జరుగుతున్నందున అతడు కచ్చితంగా రాణిస్తాడనడంలో సందేహం లేదు. అదే జరిగితే.. మంచి బౌలింగ్ బలం ఉన్న పాకిస్థాన్ ప్రపంచ కప్ విజేతగా ఆవిర్భవిస్తుంది. తమ దేశానికి దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తర్వాత రెండోసారి కప్ అందించిన దిగ్గజంగా బాబర్ నిలిచిపోతాడు.

కొసమెరుపు: ఈ ఐదుగురిలో కప్ కొట్టేంతగా బౌలర్లను చితక్కొట్టేది ఎవరో తేలాలంటే నవంబరు 19న తేలుతుంది. మరొక్క మాట ఏమంటే.. ఈ ప్రపంచ కప్ తర్వాత స్మిత్, కోహ్లి, రూట్, కేన్ నలుగురూ ఒక్కొక్కరుగావన్డేలకు దూరం జరిగినా ఆశ్చర్యం లేదు.