Begin typing your search above and press return to search.

ప్రపంచ కప్ జట్టులోకి హైదరాబాదీ తిలక్? బంగ్లాపై వన్డే అరంగేట్రం

టీమిండియా యువ క్రికెటర్, హైదరాబాదీ ఎడమ చేతి వాటం బ్యాట్స్ మన్ తిలక్ వర్మను లక్ వెంటాడుతోంది.

By:  Tupaki Desk   |   15 Sep 2023 8:00 AM GMT
ప్రపంచ కప్ జట్టులోకి హైదరాబాదీ తిలక్? బంగ్లాపై వన్డే అరంగేట్రం
X

టీమిండియా యువ క్రికెటర్, హైదరాబాదీ ఎడమ చేతి వాటం బ్యాట్స్ మన్ తిలక్ వర్మను లక్ వెంటాడుతోంది. ఇప్పటికే టి20 జట్టులోకి అరంగేట్రం చేసిన 20 ఏళ్ల తిలక్ ఇప్పుడు వన్డే జట్టులోకీ వచ్చేశాడు. ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. వాస్తవానికి ఆసియా కప్ లో తిలక్ ఆడతాడని ఎవరూ ఊహించలేదు. అతడిని కేవలం స్టాండ్ బై ఆటగాడిగానే తీసుకెళ్లారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చేశాడు. ఇదంతా ఎలా జరిగిందంటే..?

లక్ తోడుంటే అంతా ఇంతే..

ఆసియా కప్ లో ఆడుతున్న జట్టు నుంచి టీమిండియా ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేశారు. అయితే, మొన్నటివరకు గాయాలతో సతమతం అయిన బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఫిట్ నెస్ పరీక్ష గట్టెక్కడంతో జట్టులోకి వచ్చారు. అటునుంచి అంటే ప్రపంచ కప్ జట్టుకూ ఎంపికయ్యారు. రాహుల్ ఫిట్ నెస్ పై మొదటినుంచి అనుమానాలు ఉన్నాయి. దీనికితగ్గట్లే ఆసియా కప్ లీగ్ మ్యాచ్ లలో అతడు ఆడలేదు. సూపర్ 4 మ్యాచ్ లో మైదానంలోకి దిగి పాకిస్థాన్ పై సూపర్ సెంచరీ కొట్టాడు. శ్రీలంకపైనా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో రాహుల్ రైట్ రైట్ అనిపించుకున్నాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ ది మరో కథ. రాహుల్ కంటే ముందే ఫిట్ నెస్ టెస్టు పాసై తుదిజట్టులోకీ వచ్చిన అతడు పాకిస్థాన్ పై లీగ్ మ్యాచ్ లో విఫలమయ్యాడు. నేపాల్ తో మ్యాచ్ లో బ్యాట్ పట్టాల్సిన అవసరం రాలేదు. పాకిస్థాన్ తో సూపర్ 4 మ్యాచ్ నాటికి అతడికి ఫిట్ నెస్ సమస్యలు ఎదురయ్యాయి. ఈ మ్యాచ్ తో పాటు లంకతోనూ ఆడించలేదు.

అతడిపై డౌటే.. తిలక్ కు ఆల్ రైటే

శ్రేయస్ ఫిట్ నెస్ ఓ అంతుచిక్కని రహస్యంలా ఉంది. ఇప్పటికే.. గాయాల నుంచి తాజాగా కోలుకున్న బుమ్రా, రాహుల్ వంటి వారిని ప్రపంచ కప్ నకు ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీకి శ్రేయస్ విషయం తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే తిలక్ ను బ్యాకప్ గా పరిగణిస్తోందని స్పష్టమవుతోంది. వాస్తవానికి అయ్యర్ ఫిట్ గా ఉంటే రాహుల్ కే తుది జట్టులో చోటు దక్కేది కాదు. అయితే, అతడి బ్యాడ్ లక్ రాహుల్ తో పాటు తిలక్ కూ లక్ గా మారుతోంది.

ప్రపంచ కప్ నకూ తిలక్?

హైదరాబాదీ తిలక్ వర్మ ప్రపంచ కప్ నకూ ఎంపికైనా ఆశ్చర్యం లేదు. గాయంతో సతమతం అవుతున్న అయ్యర్ బదులు ఎడమచేతి వాటం తిలక్ ను తీసుకోవడం మేలని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకనే.. అనూహ్యంగా బంగ్లాదేశ్ తో సూపర్ 4 మ్యాచ్ లో తిలక్ ను దింపారు. అసలు ఈ మ్యాచ్ తుది జట్టులో కోహ్లి, రోహిత్ తదితరులకు విశ్రాంతినిచ్చి అయ్యర్, రాహుల్ ను ఆడిస్తారని అంచనా వేశారు. కానీ, కోహ్లి, హార్దిక్ కు విశ్రాంతినిచ్చి తిలక్, సూర్య కుమార్ ను దింపారు. దీన్నిబట్టే తిలక్ పై జట్టు యాజమాన్యం భారీ అంచనాలు పెట్టుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఇక బంగ్లాతో మ్యాచ్ కు బౌలింగ్ విభాగంలోనూ భారీ మార్పులు జరిగాయి. బుమ్రా, సిరాజ్, కుల్దీప్ బదులు షమీ, ప్రసిద్ధ్, శార్దూల్ వచ్చారు.

కొసమెరుపు: ఇప్పటికే టీమిండియా ప్రపంచ కప్ జట్టులో హైదరాబాదీ పేసర్ సిరాజ్ కు చోటు దక్కింది. ఇప్పుడు అయ్యర్ ను పక్కనపెట్టి తిలక్ ను తీసుకుంటే ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఇద్దరు హైదరాబాదీలకు చాన్స్ దొరికినట్లు అవుతుంది. ఎప్పుడో 1992లో వెంకటపతిరాజు, అజహరుద్దీన్ రూపంలో టీమిండియాలో ఇద్దరు హైదరాబాదీలు ఆడినట్లు గుర్తు. మళ్లీ 30 ఏళ్లకు ఆ సీన్ రిపీట్ అవుతోంది. అందుకే.. తిలక్ కు ఆల్ ది బెస్ట్ చెబుదాం.