Begin typing your search above and press return to search.

తిలక్ టాటూ.. అమ్మానాన్న.. ఓ ఫ్రెండ్ సమైరా..

సోషల్ మీడియా యుగంలో ఫ్యాషన్ పోకడలూ ఎక్కువే.. అందులోనూ సినీ, క్రీడా రంగాల వారైతే మరింత ఫ్యాషన్ ప్రియులుగా కనిపిస్తుంటారు

By:  Tupaki Desk   |   6 Oct 2023 10:13 AM GMT
తిలక్ టాటూ.. అమ్మానాన్న.. ఓ ఫ్రెండ్ సమైరా..
X

సోషల్ మీడియా యుగంలో ఫ్యాషన్ పోకడలూ ఎక్కువే.. అందులోనూ సినీ, క్రీడా రంగాల వారైతే మరింత ఫ్యాషన్ ప్రియులుగా కనిపిస్తుంటారు. చెవులకు రింగులు.. విభిన్న హెయిర్ స్టైల్స్.. వీటికిమించి ఇప్పుడు టాటూలు. టీమిండియా 360 డిగ్రీ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ ను చూస్తే టాటూల మోజు ఎంతటి పరాకాష్టనో తెలుస్తుంది. అతడే కాదు.. కోహ్లి మరికొందరు క్రికెటర్లూ ఒంటిపై టాటూలతో కనిపిస్తారు. అయితే, వీరిలాగే హైదరాబాదీ కుర్ర బ్యాట్స్ మన్ తిలక్ వర్మ సైతం టాటూ ఇష్టుడే. తిలక్ టాటూలు వేయించుకుంటున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. కాగా, ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన తిలక్ కుడి చేతిపై పరమశివుడు, వినాయకుడి చిత్రాలను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు.

ప్రపంచ కప్ మిస్ అయినా..

ఐదేళ్ల కిందటి వరకు హైదరాబాద్ లో తిలక్ వర్మ అంటే ఎవరో పెద్దగా తెలియదు. ఇంటర్వ్యూ కోసం చిరునామా ఎక్కడో రెండు రోజులు వెదుక్కోవాల్సి వచ్చింది. రెండేళ్ల కిందటి వరకు ఐపీఎల్ ఆడతాడని కూడా అనుకోలేదు. కానీ, ఇప్పుడు అతడో భవిష్యత్ స్టార్. మరీ ముఖ్యంగా ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత తిలక్ ఫేట్ మారిపోయింది. టీమిండియా తలుపు తట్టడమే కాక చక్కటి ఇన్నింగ్స్ తో తన సత్తా నిరూపించుకున్నాడు. అయితే, తిలక్ కు వన్డే ప్రపంచ కప్ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆసియా క్రీడల్లో మాత్రం చోటుదక్కింది. ఇందులో భాగంగా బుధవారం నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో డకౌట్ అయినా.. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగి ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. వాస్తవానికి తిలక్ వెస్టిండీస్ పర్యటనలో టి20ల్లో రాణించాడు. కానీ, తర్వాతే వెనుకబడ్డాడు. ఐదు మ్యాచ్ ల్లో పరుగులు చేయలేకపోయాడు. అయితే, ఆసియా క్రీడల సెమీస్ లో మాత్రం 26 బంతుల్లోనే 55 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

రికార్డు హాఫ్ సెంచరీ..

ఆసియా కప్ సెమీస్ లో హాఫ్ సెంచరీతో అంతర్జాతీయ టి20ల్లో నాకౌట్ మ్యాచ్‌ల్లో అర్ధశతకం చేసిన పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా తిలక్ రికార్డు నెలకొల్పాడు. అయితే, ఇటీవలి వరుస వైఫల్యాల నేపథ్యంలో తిలక్ కు ఈ అర్ధ సెంచరీ చాలా ప్రత్యేకంగా నిలిచింది. దీంతోనే ఫిఫ్టీ కొట్టగానే సంబరాలు చేసుకున్నాడు. జెర్సీని పైకి లేపి.. ఒంటిపై ఉన్న టాటూను చూపాడు. అందులో తల్లిదండ్రుల రూపాన్ని వేయించుకున్నట్లు కనిపించింది. కాగా, హాఫ్ సెంచరీని తల్లికి అంకితం ఇచ్చిన తిలక్.. సెలబ్రేషన్ లో బెస్ట్ ఫ్రెండ్ సమైరాను సైతం భాగం చేశానని చెప్పాడు.

ఎవరా సమైరా..?

సినీ, క్రీడా ప్రపంచంలో ఆకర్షణ ఎక్కువ. సక్సెస్ తో వచ్చే ఆకర్షణ మరింతగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల్లో ఫాలోయింగ్ విపరీతం. ఇలాంటి ఫాలోయింగ్ తోనే చాలా మంది కుర్రాళ్లు గాడితప్పుతుంటారు. అలానే తిలక్ కూడా సమైరా పేరు చెప్పగానే ఎవరా? ఆ అమ్మాయి అని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. కానీ, సమైరా ఎవరో కాదు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముద్దులు కూతురు. నాలుగేళ్ల సమైరాతో తిలక్‌కు మంచి స్నేహం కుదిరింది.

ఐపీఎల్ బంధం..

సాదాసీదా హైదరాబాదీ క్రికెటర్ గా ఉన్న తిలక్ కెరీర్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడడం ద్వారా మలుపు తిరిగింది. అక్కడ సచిన్, రోహిత్ వంటి దిగ్గజ క్రికెటర్ల ఫోకస్ లో పడిన అతడు అటునుంచి అటే టీమిండియాలోకీ వచ్చాడు. ఆగస్టులో వెస్టిండీస్‌ సిరీస్ రెండో టీ20లో అంతర్జాతీయ టీ20ల్లో తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. దానిని సమైరాకు అంకితం ఇచ్చాడు. సెంచరీ లేదా హాఫ్ సెంచరీ చేసినప్పుడు ఇలా వేడుకలు చేసుకుంటానని సమైరాకు మాటిచ్చినట్లు చెప్పాడు.