Begin typing your search above and press return to search.

ఆ ఫార్మాట్ ను 40 ఓవర్లకు కుదించాల్సిందే.. మరో దిగ్గజం మాట ఇది

మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు క్రికెట్ మారాల్సిన అవసరం ఉందని పండితులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 1:30 AM GMT
ఆ ఫార్మాట్ ను 40 ఓవర్లకు కుదించాల్సిందే.. మరో దిగ్గజం మాట ఇది
X

ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. మనిషి వ్యక్తిగత జీవితంలోనే కాక ఆటల్లోనూ సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇక అత్యంత జనాదరణ పొందిన క్రికెట్ విషయానికి వస్తే టెస్టులు, వన్డేలు, టి20లు ఇలా మూడు ఫార్మాట్లూ కొనసాగుతున్నాయి. కానీ, వీటిలో భవిష్యత్ లో ఒకటి ఉంటుందా? అనే సందేహాలు వస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు క్రికెట్ మారాల్సిన అవసరం ఉందని పండితులు చెబుతున్నారు.

50 కాదు.. 40

ఓ 25 ఏళ్ల కిందట వన్డే క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ఉన్న క్రేజ్ వేరు. మైదానాలు నిండిపోయేవి. టీవీలకు అతుక్కుపోయేవారు. పనులన్నీ మానుకుని.. ఆఫీసులకు సెలవు పెట్టి మరీ వన్డేలు చూసేవారు. కానీ, 2004లో టి20లు వచ్యాక పరిస్థితి మారింది. పొట్టి క్రికెట్ చకచకా అయిపోవడం.. అందులోనూ ఈ కాలానికి తగినట్టుగా దూకుడైన ఆట.. మెరుపు ఫీల్డింగ్ తో అందరూ టి20లకు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే వన్డేలు ఆకర్షణ కోల్పోయాయి. టి20లు మూడు మూడున్నర గంటలు సాగుతాయి. కానీ, వన్డేలు అలా కాదు.. 50 ఓవర్లకు ఏడు గంటల దాకా పడుతోంది. ఇంత సమయం క్రికెట్ చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా లేరనేది అభిప్రాయం. అందుకనే వన్డేలను 40 ఓవర్లకు కుదించాలనే వాదన వస్తోంది.

ఈ మాటన్నది మొదట మన దేవుడే..

‘‘వన్డేలను 40 ఓవర్లకు కుదించాలి.. రెండు ఇన్నింగ్స్ లు ఆడించాలి..’’ ఈ మాటలను కొన్నేళ్ల కిందటే అన్నాడు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. అత్యధిక వన్డేలు (463) ఆడిన సచిన్ నోటి నుంచే ఈ వ్యాఖ్యలు రావడం అందరినీ ఆశ్చర్యపరిచినా..ఇందులో వాస్తవం ఉంది. ప్రస్తుత తరంలో వన్డేలు అంటే మోజు తగ్గింది. యువ క్రికెటర్లు కూడా టి20 తరహా ఆటకే అలవాటయ్యారు. కాగా, సచిన్ లాగానే మరో దిగ్గజం కూడా ఇప్పుడు వన్డేలపై తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

40 ఓవర్లతోనే పూర్వ వైభవం

వన్డేలకు పూర్వ వైభవం రావాలంటే 40 ఓవర్లకు కుదించడమే ఉత్తమం అంటున్నాడు పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీమ్ అక్రమ్. పవర్ ప్లే ముగిశాక 10 నుంచి 40 ఓవర్ల మధ్యలో వన్డేలు బోర్ కొడుతున్నాయనే వాదనను అతడు సమర్థించాడు. అందుకనే 40 ఓవర్లకు కుదిస్తే సరిపోతుందని ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని చెబుతున్నాడు. అంతేకాదు.. టి20ల హవా నడుమ మున్ముందు వన్డే ప్రపంచ కప్ టోర్నీని చూస్తామా? లేదా? అనే సందేహాన్నీ వ్యక్తం చేశాడు అక్రమ్.

కొసమెరుపు: టి20 ప్రభావంతో వన్డేలు ఇప్పటికే చాలా వరకు తగ్గాయి. గతంలో టెస్టు, వన్డే సిరీస్ ఆడేవారు. ఇప్పుడు వన్డేలను తగ్గించి అందులోనే టి20లను చొప్పిస్తున్నారు. లేదా టెస్టులను తగ్గించి టి20లకు చోటిస్తున్నారు. వచ్చే వన్డే ప్రపంచ కప్ 2027 లో జరగనుంది. 2019కి ఇప్పటికే వన్డేలు చాలా వరకు తగ్గాయి. మరో నాలుగేళ్లలో ఏమేం మార్పులు వస్తాయో చూడాలి.