Begin typing your search above and press return to search.

ఆ కుర్రాడు .. దేశవాళీ ధోనీ అట..

దేశానికి టి20, వన్డే ప్రపంచ కప్ లు, మరెన్నో ప్రతిష్ఠాత్మక సిరీస్ లు, అంతకుమించిన విజయాలు ధోనీ అందించాడు.

By:  Tupaki Desk   |   21 Dec 2023 10:23 AM GMT
ఆ కుర్రాడు .. దేశవాళీ ధోనీ అట..
X

భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీది ఒక శకం. అనామక జార్ఖండ్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అతడి ప్రస్థానం మహోన్నతం. సాధారణ కుటుంబం నుంచి వచ్చి అసాధారణ క్రికెటర్ గా మారిన వైనం అసాధారణం. దేశానికి టి20, వన్డే ప్రపంచ కప్ లు, మరెన్నో ప్రతిష్ఠాత్మక సిరీస్ లు, అంతకుమించిన విజయాలు ధోనీ అందించాడు. మెరుపు స్టంపింగ్ లు.. చురుకైన రనౌట్లు.. చక్కటి క్యాచ్ లు.. వికెట్ల వెనుక పెట్టని గోడ.. వ్యూహాల్లో మహా దిట్ట.. అలాంటి క్రికెటర్ మళ్లీ దొరుకుతాడా..? అంటే.. కచ్చితంగా చెప్పలేం.. కానీ, ఓ కుర్రాడు దేశవాళీ క్రికెట్ లో ధోనీగా పేరుతెచ్చుకున్నాడు.

వయసు 19.. ధర రూ.7 కోట్లు

మొన్నటి ఐపీఎల్‌ వేలంలో అందరినీ ఆకట్టుకున్న అంశం.. దేశయ కుర్రాళ్లకు మంచి ధర దక్కడం. మరీ అందులోనూ అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్‌ జాబితాలోని వారికి రూ.కోట్లు వెచ్చించారు. ఇలా జార్ఖండ్ యువ ఆటగాడు కుమార్‌ కుశాగ్రా రూ.7.20 కోట్లు దక్కించుకున్నాడు. ఇంతా చేస్తే అతడి వయు 19 మాత్రమే. ఆడింది 13 ఫస్ట్ క్లాస్, 23 లిస్ట్ ఏ మ్యాచ్ 11 టి20లే. కానీ, అందరూ అతడిని అప్పుడే ధోనీతో పోలుస్తున్నారు. అందులోనూ కుశాగ్ర సొంత రాష్ట్రం కూడా జార్ఖండే. దీంతో దేశవాళీ క్రికెట్‌ లో ‘మరో ధోనీ’ అంటూ పొగిడేస్తున్నారు.

హిట్టర్.. మహా చురకు

కుశాగ్ర మంచి హిట్టర్.. వికెట్ల వెనుక చురుగ్గా కదులుతాడు. దీంతో బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరభ్ గంగూలీ ఫోకస్ లో పడ్డాడు. కుమార్‌ ఐదేళ్ల వయసులోనే క్రికెట్‌పై ఆసక్తి చూపాడు. దీంతో తండ్రే అతడికి కోచ్‌ గా మారాడు. మంచి కోచ్ గా పేరు తెచ్చుకున్న బాబ్‌ వూమర్‌ రచించిన ‘ఆర్ట్‌ అండ్‌ సైన్స్‌ ఆఫ్‌ క్రికెట్‌’ పుస్తకాన్ని నాలుగైదు సార్లు చదివి కుమారుడికి శిక్షణ ఇచ్చాడు. ఇక ఐపీఎల్‌ వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పోటీ పడి మరీ కుశాగ్రను ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది.

రూ.10 కోట్లయినా పెడతానన్నాడు..

వికెట్‌ కీపింగ్‌, బ్యాటింగ్ నైపుణ్యాలను చూసి కుశాగ్ర కోసం రూ.10 కోట్ల వరకైనా పెట్టేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ మెంటార్‌ సౌరభ్‌ గంగూలీ సిద్ధమయ్యాడట. ఈ విషయాన్ని కుమార్ తండ్రి శ్రీకాంత్ తెలిపాడు. ఈడెన్‌ గార్డెన్స్‌లో ట్రయల్స్‌ అనంతరం.. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులోకి తీసుకొంటామని గంగూలీ చెప్పాడన్నాడు. ట్రయల్స్‌లో కుమార్‌ హిట్టింగ్‌, మైదానంలో చురుకుదనం గంగూలీని ఆకట్టుకున్నాయట. అతడిలో ధోనీ లక్షణాలున్నాయని.. బెయిల్స్‌ పడగొట్టే తీరు అద్భుతమని గంగూలీ కొనియాడాడని శ్రీకాంత్ చెప్పాడు. కాగా, కుమార్ కుశాగ్ర రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. ఎవరూ ఊహించని రీతిలో రూ.7 కోట్లపైగా ధరతో ఢిల్లీ జట్టు అతడిని కొనుక్కుంది. కాగా, కుశాగ్ర కుడి చేతి వాటం బ్యాట్స్ మన్ . అండర్ 19లో జాతీయ జట్టుకు ఆడాడు.