Begin typing your search above and press return to search.

10 రోజులకో టెస్టు మ్యాచ్.. టీమిండియాకు అత్యంత కీలకం

ఆటగాళ్ల గాయాల కారణంగా అందులో గెలుపోటములు చెప్పలేం.. మరోవైపు మూడో టెస్టు చాంపియన్ షిప్ తన్నుకొస్తోంది.

By:  Tupaki Desk   |   27 Dec 2023 1:30 AM GMT
10 రోజులకో టెస్టు మ్యాచ్.. టీమిండియాకు అత్యంత కీలకం
X

టీమిండియా ‘ప్రపంచ చాంపియన్’ గా నిలిచి 12 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఓడారు.. టి20 ప్రపంచ కప్ లలోనూ నిరాశపరిచారు.. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చేరినా కప్ అందుకోలేకపోయారు. మరో టి20 ప్రపంచ కప్ ఆరు నెలల్లో జరగనుంది. ఆటగాళ్ల గాయాల కారణంగా అందులో గెలుపోటములు చెప్పలేం.. మరోవైపు మూడో టెస్టు చాంపియన్ షిప్ తన్నుకొస్తోంది. దీనిలో ఫైనల్ కు చేరాలంటే అత్యంత కీలక సమయం ముందుంది.

సఫారీ ఖాన్సార్ లో ఎదురీత

టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. రెండు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ మంగళవారం ప్రారంభమైంది. పరిస్థితులు చూస్తుంటే ఈ టెస్టులో ఎదురీత తప్పదు. తొలి రోజు వర్షం కారణంగా ఆట నిలిపివేసే సమయానికి 208 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. గెలుపు సంగతి పక్కనపెడితే.. మిగతా నాలుగు రోజులు పుంజుకుంటే కనీసం డ్రా అయినా చేయగలుగుతుంది. మరో టెస్టు జనవరి 3 నుంచి మొదలుకానుంది. సఫారీ గడ్డపై మూడు దశాబ్దాలుగా టెస్టులు ఆడుతున్న టీమిండియా ఒక్కసారీ సిరీస్ గెలవలేదు. మరి ఈసారైనా సాధిస్తుందా? అంటే చెప్పలేం. అయితే, టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఇక్కడ గెలవడం చాలా కీలకం. ఎందుకంటే.. స్వదేశంలో టెస్టు విజయం సాధించినా వచ్చే పాయింట్లు తక్కువ. అదే విదేశాల్లో సిరీస్ చేజిక్కించుకుంటే డబుల్ పాయింట్లు బాగా వస్తాయి. ఫైనల్ చేరడంలో ఇవే ముఖ్యం.

77 రోజుల్లో 7 టెస్టులు..

2025 మార్చి నాటికి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు చాంపియన్ షిప్ ఫైనల్ చేరతాయి. కాగా, ఈ క్రమంలో టీమిండియాకు వచ్చే 77 రోజులు కీలకం. ఈ వ్యవధిలో రోహిత్ శర్మ సేన మొత్తం 7 టెస్టులు (దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు సహా) ఆడనుంది. సఫారీలతో రెండు టెస్టుల సిరీస్ ముగియగానే.. ఇంగ్లాండ్ తో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంటుంది. ఇందులో జనవరి 25న తొలి మ్యాచ్ మొదలవుతుంది. చివరిది మార్చి 7న ప్రారంభం అవుతుంది.

టెస్టులు కాదు.. సిరీస్ నెగ్గాలి..

దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ ను సమం చేసుకున్నా ఫర్వాలేదు. కానీ, ఓడిపోకూడదు. సిరీస్ ను 2-0తో లేదా 1-0తో గెలిస్తే బోనస్సే. అప్పుడు పాయింట్లు పెరుగుతాయి. ఇక ఇంగ్లాండ్ తో సిరీస్ స్వదేశంలోనే జరగనుంది. అంటే మనకు విజయావకాశాలు ఉంటాయనుకోవచ్చు. కానీ, ఇంగ్లాండ్ ను తక్కువ అంచనా వేయకూడదు. అసలే టెస్టులను వన్డేల తరహాలో ఆడుతూ ఒక్క రోజులో 400 పైగా కొట్టేస్తోంది. 9వ నంబరు,10వ నంబరు వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లున్న జట్టు అది. వన్డే ప్రపంచ కప్ ఘోర వైఫల్యాన్ని సరిచేయడానికి వచ్చే టెస్టు సిరీస్ వారికి మంచి అవకాశం. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ జట్టు పట్టుదలగా ఉంటుందనడంలో సందేహం లేదు. కాబట్టి.. టీమిండియాను ‘‘ప్రపంచ చాంపియన్’’ గా చూడాలంటే రానున్న 77 రోజులు అత్యంత కీలకం.