Begin typing your search above and press return to search.

బ్యాటింగ్ బెంగ.. ఫీల్డింగ్ ఫెయిల్.. టీ20 ప్రపంచ కప్.. టీమిండియాకు కలే..

ఈ టి20 ప్రపంచ కప్ నకు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్లు, వెటరన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను పొట్టి ఫార్మాట్ కు పక్కనపెట్టారు.

By:  Tupaki Desk   |   11 Jun 2024 10:06 AM GMT
బ్యాటింగ్ బెంగ.. ఫీల్డింగ్ ఫెయిల్.. టీ20 ప్రపంచ కప్.. టీమిండియాకు కలే..
X

ఎప్పుడో 2007లో అదీ.. మిగతా జట్లేవీ టి20 ఫార్మాట్ కు అలవాటు పడని సమయంలో.. ధోనీ లక్ కూడా కొంత కలిసొచ్చి.. తొలి టి20 ప్రపంచ కప్ ను గెలిచింది భారత్.. మళ్లీ ఇప్పటివరకు 7 కప్ లు జరిగాయి.. ఒక్కసారీ టీమిండియా విజేతగా నిలవలేదు. తాజాగా జరుగుతున్న కప్ లోనూ మన జట్టు ఆడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

కూర్పు సరైనదేనా?

ఈ టి20 ప్రపంచ కప్ నకు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్లు, వెటరన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను పొట్టి ఫార్మాట్ కు పక్కనపెట్టారు. దాదాపు వారి టి20 కెరీర్ అయిపోయిందని, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యానే ఇక కెప్టెన్ అని తీర్మానించారు. చివరకు చూస్తే రోహిత్, కోహ్లీ మళ్లీ టీమిండియాలోకి వచ్చారు. రోహిత్ కు గతంలో లాగే కెప్టెన్సీ ఇచ్చారు. ఇక కోహ్లీని అతడికితోడుగా ఓపెనింగ్ కు పంపుతున్నారు. మరోవైపు విరాట్ రెగ్యులర్ ఓపెనర్ కాదు. అతడు నిఖార్సయిన వన్ డౌన్ బ్యాటర్. అలాంటివాడితో ఇన్నింగ్స్ మొదలుపెట్టిస్తున్నారు. ఇదేమీ ఫలితం ఇవ్వడం లేదు.

బ్యాటింగ్ ఆర్డర్ సరైనదేనా?

పెను ప్రమాదం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఫామ్ లోనే కనిపిస్తున్నాడు. కోహ్లిని ఓపెనర్ గా పంపి.. అతడి వన్ డౌన్ లో పంత్ ను ఆడిస్తున్నారు. కానీ, పంత్ ఐదో, ఆరో నంబరులో రావాల్సిన వాడు. అప్పుడైతే భారీ షాట్లతో విలువైన పరుగులు రాబడతాడు. టీమ్ కు ఉపయోగపడతాడు. ఇప్పుడు ఈ స్థానంలో హార్దిక్ పాండ్యా వస్తున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లతో ఆడేటప్పుడు ఇక్కడ తేడా కనిపిస్తుంది.

జడే‘జాదూ’ మిస్..

టీమిండియాకు పదేళ్లుగా ఆల్ రౌండర్ గా విశేష సేవలందిస్తున్నాడు రవీంద్ర జడేజా. ఇటీవలి కాలంలో జడ్డూ బౌలింగ్ లో మ్యాజిక్ మిస్ అయింది. అతడు బ్యాటింగ్ లోనూ తేలిపోతున్నాడు. దీంతోనే అక్షర్ పటేల్ ను నమ్ముకోవాల్సి వస్తోంది. జట్టులో వీరిద్దరే స్పెషలిస్ట్ స్పిన్నర్లు. అయితే, అక్షర్ బౌలింగ్ ఏమంత కచ్చితంగా ఉండదు. మేటి బ్యాటర్లు ఎదురైతే అతడు తేలిపోతాడు.

పేసర్లే నిలపాలి..

ఒక్కొక్కటిగా చూస్తే ఇన్ని లోపాలు కనిపిస్తున్నా.. క్రికెట్ అనేది జట్టుగా ఆడాల్సిన ఆట. అయితే, పేస్ బౌలింగ్ విభాగం మాత్రం బాగా రాణిస్తోంది. పాక్ తో మ్యాచ్ లో బుమ్రా అద్భుతం చేయగా.. సిరాజ్ తక్కువ పరుగులిచ్చాడు. యువ బౌలర్ అర్షదీప్ మెరుగైన ప్రదర్శన చేశాడు. అమెరికా పిచ్ లు పేసర్లకూ అనుకూలిస్తున్న క్రమంలో ఈ ముగ్గురే కీలకం కానున్నారు.

వాస్తవానికి పాకిస్థాన్‌ తో మ్యాచ్‌ లో టీమిండియా బ్యాటింగ్ దారుణం. బ్యాటర్లు నిర్లక్ష్యంగా ఆడారు. నాసా కౌంటీ స్టేడియంలోని డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ లు పేస్‌ కు అనుకూలం. అది తెలిసీ.. నాణ్యమైన బౌలింగ్ వనరులున్న పాకిస్థాన్ పై అనవసర షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. బంతిని గాల్లోకి లేపారు. 8 మంది క్యాచ్ ఔటయ్యారు. జాగ్రత్తగా క్రీజులో కుదురుకుందామనే ప్రయత్నం ఎవరిలోనూ కనిపించలేదు. అసలు పంత్‌ ఎప్పుడో ఔట్ కావాల్సింది. పేలవ ఫీల్డింగ్‌ తో బతికిపోయాడు. ఐపీఎల్‌ లో దుమ్ము రేపిన కోహ్లి, శివమ్‌ దూబె రెండో మ్యాచ్‌ లోనూ విఫలమయ్యారు.

పాక్ ఇన్నింగ్స్‌ లో బుమ్రా వేసిన మూడో ఓవర్‌ నాలుగో బంతికి రిజ్వాన్‌ క్యాచ్‌ ను ఫైన్‌ లెగ్‌ లో దూబె, తర్వాతి ఓవర్‌ తొలి బంతికే సిరాజ్‌ బాబర్‌ రిటర్న్ క్యాచ్‌ ను ఒడిసి పట్టలేకపోయాడు.

ముందుంది సూపర్-8

ప్రపంచ కప్ లో టీమిండియా సూపర్ 8కు చేరడం ఖాయం. అయితే, అక్కడినుంచి ఎలాగన్నది చూడాలి. ఇలాగే ఆడితే ఇంటికే.