Begin typing your search above and press return to search.

పొట్టిలో పొడుగు.. పొడుగులో పొట్టి.. టీమిండియా రికార్డు

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఈ నెల 3వ తేదీన సెంచూరియన్ లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేసిందో అందరూ చూశారు

By:  Tupaki Desk   |   19 Jan 2024 11:33 AM GMT
పొట్టిలో పొడుగు.. పొడుగులో పొట్టి.. టీమిండియా రికార్డు
X

క్రికెట్ అంటే జెంటిల్ మెన్ గేమ్.. క్రికెట్ అంటే టీమ్ గేమ్.. క్రికెట్ అంటే అనూహ్య గేమ్ కూడా... ఈ రోజు సెంచరీ కొట్టిన బ్యాట్స్ మన్ రేపు డకౌట్ అవుతాడు. ఈ రోజు ఐదు వికెట్లతో హీరోగా నిలిచిన బౌలర్ రేపు భారీగా పరుగులిస్తాడు. అందుకే క్రికెట్ లో ఎప్పుడేం జరుగుతోందో ఎవరూ చెప్పలేరని అంటాడు దిగ్గజ బ్యాట్స్ మన్ సునీల్ గావస్కర్. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఇలాంటి రెండు ఘటనలు జరిగాయి. ఈ రెండింటిలోనూ మన టీమిండియానే పాత్రధారి కావడం ఇక్కడ విశేషం.

సఫారీలను రోజున్నరలోనే చుట్టేసి..

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఈ నెల 3వ తేదీన సెంచూరియన్ లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేసిందో అందరూ చూశారు. గత ఏడాది చివరలో టెస్టు మ్యాచ్ ను చేజార్చుకుని దారుణమైన పరిస్థితుల్లో సెంచూరియన్ మైదానంలో అడుగుపెట్టిన టీమిండియా అదరగొట్టింది. రోజున్నరలోపే దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. తొలి ఇన్నింగ్స్ లో సఫారీలను కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆపై మన జట్టు కూడా తడబడింది. 153 పరుగులు చేసి 98 ఆధిక్యం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 176 పరుగులు చేయగా.. 79 పరుగుల విజయలక్ష్యాన్ని మన జట్టు కాస్త ఇబ్బందిపడుతూనే అందుకుంది. ఈ టెస్టు మొత్తం మీద ఒకటింపావు రోజులోనే ముగిసింది. ప్రపంచ చరిత్రలో అతి తక్కువ సమయంలో ముగిసిన టెస్టుగా రికార్డులకెక్కింది.

రెండు సూపర్ ఓవర్లు ఆడేసి..

సఫారీ టెస్టు సిరీస్ ముగియగానే.. స్వదేశంలో అఫ్గానిస్థాన్ తో జరిగిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు పొట్టి ఫార్మాట్ టి20లోకి పునరాగమనం చేశారు. మూడు మ్యాచ్ ల సిరీస్ ను మన జట్టు క్లీన్ స్వీప్ చేసింది. తొలి రెండు మ్యాచ్ లు కాస్త తేలిగ్గానే జరిగినా.. మూడో టి20 మాత్రం అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 212 పరుగులు చేసింది. ఈ స్కోరును అఫ్ఘాన్ సమం చేసింది. ఇక సూపర్ ఓవర్లో అసలు డ్రామా జరిగింది. ఇరు జట్లూ 16 పరుగులు చేయడం.. రెండో సూపర్ ఓవర్ వేయాల్సి రావడం.. అక్కడ మన జట్టు 11 పరుగులు చేయడం.. అఫ్ఘాన్ 1 పరుగుకే రెండు వికెట్లు కోల్పోవడం అందరికీ తెలిసిందే. ఈ లెక్కన పొట్టి ఫార్మాట్ లో ఇది సుదీర్ఘ మ్యాచ్ గా నిలిచింది. ఎందుకంటే.. సూపర్ ఓవర్లోనూ టై అయితే.. రెండో సూపర్ ఓవర్ ఆడించిన తొలి మ్యాచ్ ఇదే. అంతకుముందు సూపర్ ఓవర్ టై అయితే.. బౌండరీల లెక్క ప్రకారం విజేతను నిర్ణయించేవారు. రెండేళ్ల కిందట ఈ నిబంధనను మార్చి రెండో సూపర్ ఓవర్ వేయిస్తున్నారు. కాగా.. ఈ మ్యాచ్ లో భారత్ 22ఓవర్లు ఆడింది. అఫ్ఘాన్ 21.3 ఓవర్లు ఆడింది. అంటే.. ఒక టి20 మ్యాచ్ లో 43.3 ఓవర్లు పడ్డాయి. ఈ లెక్కన ఇది సుదీర్ఘ మ్యాచ్ అనుకోవాలి. మొత్తానికి అటు పొట్టి ఫార్మాట్ టి20లో, ఇటు సుదీర్ఘ ఫార్మాట్ టెస్టుల్లో టీమిండియా కొత్త ఏడాదిలో ప్రత్యేకత నెలకొల్పింది.