Begin typing your search above and press return to search.

ఆసియా కప్ ముంగిట టీమిండియాకు 4 సవాళ్లు

అయితే, మనకో మంచి అవకాశం ఏమంటే.. వన్డే ప్రపంచ కప్ నకు ముందు ఆసియా కప్ జరగనుండడం. మిగతా జట్లకు లేని ఈ చాన్స్ టీమిండియాకు దక్కింది.

By:  Tupaki Desk   |   15 Aug 2023 10:46 AM GMT
ఆసియా కప్ ముంగిట టీమిండియాకు 4 సవాళ్లు
X

వన్డే ప్రపంచ కప్ మరెంతో దూరంలో లేదు. అటుఇటుగా కేవలం రెండున్నర నెలల సమయం. కానీ, టీమిండియా పరిష్కరించుకోవల్సిన సమస్యలు ఎన్నో..? అసలు ఇప్పటివరకు ప్రపంచ కప్ ప్రాబబుల్స్ పైనే స్పష్టత రాలేదు. ఆస్ట్రేలియా వంటి జట్లు ఇప్పటికే 18 మంది ప్రాబబుల్స్ ను ప్రకటించాయి. ఆ జట్టు ఎంత ముందంజలో ఉందో దీన్నిబట్టే తెలుసుకోవచ్చు. కానీ, టీమిండియా మాత్రం సొంతగడ్డపై విశ్వ సమరానికి సంసిద్ధమయ్యే స్థితిలోనే ఉంది. అయితే, మనకో మంచి అవకాశం ఏమంటే.. వన్డే ప్రపంచ కప్ నకు ముందు ఆసియా కప్ జరగనుండడం. మిగతా జట్లకు లేని ఈ చాన్స్ టీమిండియాకు దక్కింది. వన్డే ఫార్మాట్ లోనే జరగనున్న దీనిని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచ కప్ జట్టుపై స్పష్టత వచ్చినట్లే...?

ఈ నెల 30 నుంచి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆసియా కప్ నకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వచ్చే నెల 2న పాక్, భారత్ మ్యాచ్‌ ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇక ఆసియా కప్ లో ఆరు దేశాలు పాల్గొంటాయి. అందులో భారత్ తన సామర్థ్యాన్ని పరీక్షించుకునే చాస్సుంది. అయితే, ఆ నాలుగు సమస్యలు తీరితేనే..?

టాపార్డర్ బ్యాకప్ ఎవరు?

ప్రపంచ కప్ అంటే మహా సమరం. అన్ని జట్లు సర్వ సిద్ధమై వస్తాయి. అయితే, ఎవరైనా ఆటగాడు పొరపాటున గాయపడితే అతడికి బ్యాకప్ గా సమర్థుడిని ఉంచుకోవడం అత్యవసరం. ఈ లెక్కన చూస్తే.. టీమిండియా వన్డే ఓపెనర్లుగా సారథి రోహిత్ శర్మ, యువ శుబ్ మన్ గిల్ వస్తారు. వన్ డౌన్ విరాట్ కోహ్లిదే. వీరికి ఒకరైనా బ్యాకప్ ఆటగాడిని చూసుకోవాలి. ఇషాన్ కిషన్ ఆ సత్తా ఉన్నవాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా కొట్టాడు. ఎడమ చేతివాటం కావడం కూడా కలిసొస్తుంది. మరి అతడికి 15 మంది జట్టులో స్థానం ఉంటుందా? లేదా? అన్నది చూడాలి.

నాలుగో వారు ఎవరు?

టీమిండియా వంటి అగ్రశ్రేణి జట్టుకు ఐదేళ్లుగా నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్ మన్ లేడు. గతంలో అజింక్య రహానే, అంబటి రాయుడు కాస్త న్యాయం చేశారు. వారిద్దరూ ఫేడ్ అయ్యాక మాత్రం మరొకరు ఆ స్థానాన్ని భర్తీ చేయడం లేదు. 2019 ప్రపంచ కప్ లో ఈ అంశమే జట్టును బాగా ఇబ్బంది పెట్టింది. ఆసియా కప్‌ లో తక్షణమే దీనికి పరిష్కారం కనుగొనాలి. కేఎల్ రాహుల్‌ , శ్రేయస్ అయ్యర్‌, సూర్యకుమార్, హైదరాబాదీ తిలక్ వర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ నుంచి ఒకరిని ఈ స్థానానికి ఎంపిక చేయాలి. వీరందరిలో శ్రేయస్ మాత్రమే నంబర్ 4కు న్యాయం చేయగలడు. ఇక భారత పిచ్ లు స్పిన్ కు అనుకూలం. అయితే, ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్ల కంటే పాక్, శ్రీలంక జట్ల ఆటగాళ్లు స్పిన్ ను సమర్థంగా ఎదుర్కొంటారు. కాబట్టి టీమిండియా స్పిన్నర్ల ఎంపిక విషయంలో జాగ్రత్త పడాలి. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌ తో పాటు అశ్విన్‌ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్, చాహల్ లో ఒకరికే అవకాశం దక్కుతుంది. అది కుల్దీపే.

బుమ్రా వచ్చేశాడు.. పేసు గురి కుదిరినట్టేనా?

ప్రపంచ క్రికెట్ అంతా ఇప్పుడు టీమిండియా పేసర్ బుమ్రా వైపు చూస్తోంది. ఏడాదిగా క్రికెట్ కు దూరమైన అతడు ఫిట్ నెస్ సాధించి ఐర్లాండ్ తో టి20లకు కెప్టెన్ గానూ ఎంపికయ్యాడు. బుమ్రా రాకతో బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా మారింది. ఐర్లాండ్ సిరీస్ లో బుమ్రా రాణిస్తే భారత్ కు శుభవార్తే. అయితే, వన్డే ప్రపంచ కప్ లో ఇద్దరు పేసర్లకే చాన్సుంటుంది. ఆ రెండో పేసర్ హైదరాబాదీ సిరాజ్ అయ్యే వీలుంది. మూడో పేసర్ గా ఆల్ రౌండర్లు శార్దూల్ ఠాకూర్‌ , హార్దిక్‌ పాండ్యా బాధ్యతలు తీసుకుంటారు. వీరిలో శార్దూల్ మంచి ఫామ్‌ లో ఉండగా.. టి20 కెప్టెన్ పాండ్య నిరాశపరుస్తున్నాడు. కానీ, అతడిని పూర్తిగా విస్మరించలేం. ఏదేమైనా మొత్తం సమస్యలకు ఆసియా కప్ లో పరిష్కారం వెదుక్కుంటేనే టీమిండియా ఈ సారి ప్రపంచ కప్ గెలిచే చాన్సుంటుంది.