డబ్ల్యూటీసీ ఫైనల్.. 10 మ్యాచ్‌లు.. టీమ్ ఇండియా 8 నెగ్గాల్సిందే!
ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ).. సంప్రదాయ ఫార్మాట్ లోనూ ఓ ప్రపంచకప్ స్థాయి ట్రోఫీ ఉండాలంటూ ప్రవేశపెట్టిన టోర్నీ.
By: Tupaki Desk | 18 Nov 2025 10:00 PM ISTప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ).. సంప్రదాయ ఫార్మాట్ లోనూ ఓ ప్రపంచకప్ స్థాయి ట్రోఫీ ఉండాలంటూ ప్రవేశపెట్టిన టోర్నీ. తొలి రెండు సైకిల్స్ లో టీమ్ ఇండియా రన్నరప్ తో సరిపెట్టుకుంది. మన కప్ (గద) ఆశలను మొదటిసారి న్యూజిలాండ్, రెండోసారి ఆస్ట్రేలియా దెబ్బకొట్టాయి. మూడోసారి అయితే ఫైనల్ రేసులో చాలా ముందున్నా అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో ఓడిపోయి, ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పరాజయం పాలవడంతో ఫైనల్ అవకాశం చేజారింది. అదే సమయంలో దక్షిణాఫ్రికా వరుసగా విజయాలు సాధించి ఫైనల్ కు చేరడం, టైటిల్ కొట్టడం కూడా జరిగిపోయింది. అలా పరోక్షంగా మన బెర్తును కొట్టేసిన దక్షిణాఫ్రికా ఇప్పుడు ప్రత్యక్షంగానే దెబ్బకొట్టేలా కనిపిస్తోంది. కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టెస్టులో అనూహ్య పరాజయమే దీనంతటికీ కారణం. ఇప్పటికే డబ్ల్యూటీసీ సైకిల్ లో టీమ్ ఇండియా 8 టెస్టులు ఆడేసింది. ఇంగ్లండ్ తో ఐదు మ్యాచ్ లలో రెండు గెలిచి రెండు ఓడింది. వెస్టిండీస్ పై రెండూ నెగ్గింది. దక్షిణాఫ్రికాపై ఒకటి ఓడింది. ఈ నెల 22 నుంచి గువాహటిలో జరగనున్న రెండో టెస్టులో గనుక విజయం సాధించకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో చాలా కష్టాలు ఎదురవుతాయి.
ప్రస్తుతం నాలుగో స్థానంలో...
టీమ్ ఇండియాకు ఈ డబ్ల్యూటీసీ సైకిల్ లో మరో 10 మ్యాచ్ లు మాత్రమే ఉన్నాయి. ఫైనల్ చేరాలంటే వీటిలో 8 గెలిచి తీరాల్సిందే. అంటే ప్రతి మ్యాచ్ కూడా కీలకమే. పాయింట్ల పట్టికలో శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తర్వాత భారత్ (54.17 శాతం) నాలుగో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరాలంటే కనీసం 64-68 శాతం పాయింట్ల పర్సంటేజీ ఉండాలి.
మిగిలిన మ్యాచ్ లు ఇవే..
దక్షిణాఫ్రికాతో గువాహటిలో రెండో టెస్టుతో పాటు శ్రీలంకతో వారి దేశంలో 2, న్యూజిలాండ్ తో వారి దేశంలో 2, ఆస్ట్రేలియాతో స్వదేశంలో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. దక్షిణాఫ్రికాను ఇప్పుడు ముందుగా ఓడిస్తే.. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ ను కొట్టేయొచ్చు. శ్రీలంకను వారి దేశంలో ఓడించడం పెద్ద కష్టం కాదు కానీ, న్యూజిలాండ్ ను అక్కడ పడగొట్టడం కష్టమే. ఇక పాయింట్ల ప్రకారం చూస్తే ఈ పది మ్యాచ్ లలో టీమ్ ఇండియా అన్నీ గెలిస్తే 172 పాయింట్లు (79.63 శాతం)తో ఫైనల్ చేరుతుంది. 8 గెలిస్తే పాయింట్లు 148 అవుతాయి. పర్సంటేజ్ 68.52కు చేరుతుంది. ఏడు టెస్టుల్లో విజయం సాధిస్తే పాయింట్లు 136కు పరిమితమై పర్సంటేజీ 62.96కు పరిమితం అవుతుంది. గత సైకిల్స్ లో 65 శాతం పర్సంటేజీ సాధించిన జట్లే ఫైనల్ చేరాయి. కాబట్టి పది మ్యాచ్ లలో టీమ్ ఇండియా 8 గెలిచి తీరాల్సిందే.
