రోహిత్ రిటైర్.. ఆ నలుగురిలో టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ ఎవరు?
మూడేళ్లకు పైగా సాగిన టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్సీని వదులుకుంటూ రిటైర్మెంట్ ప్రకటించేశాడు రోహిత్ శర్మ.
By: Tupaki Desk | 8 May 2025 3:30 AMమూడేళ్లకు పైగా సాగిన టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్సీని వదులుకుంటూ రిటైర్మెంట్ ప్రకటించేశాడు రోహిత్ శర్మ. మరి అతడి స్థానంలో కెప్టెన్ ఎవరు? సీనియర్ విరాట్ కోహ్లి మళ్లీ పగ్గాలు చేపట్టడు.. శ్రేయస్ అయ్యర్ కు మంచి పేరే ఉన్నప్పటికీ ప్రస్తుతం అతడు టెస్టు జట్టులో లేడు. మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు గాయాల బెడద ఉంది.. బ్యాటర్ కేఎల్ రాహుల్ పదేళ్లుగా జట్టులో ఉంటున్నా తనదైన ముద్ర వేయలేకపోయాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ఇటీవల దారుణంగా విఫలం అవుతున్నాడు. పైగా ఇతడి షాట్ సెలక్షన్ పై తీవ్ర విమర్శలు ఉన్నాయి.
కోహ్లి తప్ప పైన పేర్కొన్న వారి నుంచే టెస్టులకు కొత్త కెప్టెన్ ను ప్రకటించాల్సి ఉంది. ఇంగ్లండ్ తో నెల రోజుల్లో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ మొదలుకానుంది. అంటే.. ఐపీఎల్ ముగిసీ ముగియగానే ఇంగ్లండ్ బయల్దేరాల్సి ఉంటుంది. దీంతో తక్షణమే కెప్టెన్ ప్రకటన చేయాలి.
క్రికెట్ పండితుల అంచనా ప్రకారం చూస్తే ప్రస్తుతం యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను గిల్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. స్వయంగా రాణిస్తూ దాదాపు ప్లేఆఫ్స్ చేర్చేశాడు. 25 ఏళ్ల కుర్రాడు కాబట్టి గిల్ కే టెస్టు కెప్టెన్సీ దక్కొచ్చు. వన్డే ఫార్మాట్ లో జరిగిన ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీలోనూ గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అంతకుముందు జింబాబ్వే టూర్ లో టి20లకు కెప్టెన్సీ కూడా చేశాడు. ఐపీఎల్ ప్రదర్శననూ చూశారు కాబట్టి గిల్ కు టెస్ట్ కెప్టెన్సీ దక్కినట్లే.
వాస్తవానికి రోహిత్ స్థానంలో మరో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ పేరు మొన్నటివరకు టెస్టు కెప్టెన్సీకి వినిపించింది. అయితే, జైశ్వాల్ పై ఇంకా నమ్మకం కుదరలేదు.
ఆస్ట్రేలియాలో డిసెంబరు-జనవరిలో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో మొదటి టెస్టులో గెలిపించి, ఐదో టెస్టులో కెప్టెన్సీ చేసిన (గాయంతో వైదొలగాడు) పేసర్ బుమ్రాను కెప్టెన్ చేయొచ్చు కానీ, అతడికి గాయాల సమస్య ఉంది.
శ్రేయస్ అయ్యర్ తిరిగొస్తే కేఎల్ రాహుల్ కు టెస్టు జట్టులో చోటే కచ్చితం అని చెప్పలేం. రాహుల్ ను జట్టులో ఉంచాలంటే పంత్ ను తప్పించాలి. టెస్టుల్లో పంత్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపుతారు.
ఓ పోల్ ప్రకారం బుమ్రా (29.63 శాతం) టెస్టు కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. రాహుల్ (27.78), గిల్ (28.79) చాలా దగ్గరగా ఉన్నారు. పంత్ (4.63) దగ్గరలో కూడా లేడు. పంత్ కంటే వీళ్లెవరూ కాదు (9.26) అనే అభిప్రాయానికే ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం.
సెలక్టర్ల అభిప్రాయం ప్రకారం కచ్చితంగా గిల్ కే టెస్టు కెప్టెన్సీ దక్కుతుందని తెలుస్తోంది.