Begin typing your search above and press return to search.

టి20 ప్ర‌పంచ క‌ప్.. అభిషేక్ ను తీసేయ‌లేం..సంజూను న‌మ్మ‌లేం!

అంటే, డిఫెండింగ్ చాంపియ‌న్, ర‌న్న‌ర‌ప్ ఇప్పుడు టి20 సూప‌ర్ 8 మ్యాచ్ ఆడ‌నున్నాయి అన్న‌మాట‌. అంతా బాగానే ఉన్నా... మ‌రి, టీమ్ ఇండియా ఓపెన‌ర్ ఫామ్ ప‌రిస్థితి...?

By:  Tupaki Entertainment Desk   |   21 Feb 2026 8:00 PM IST
టి20 ప్ర‌పంచ క‌ప్.. అభిషేక్ ను తీసేయ‌లేం..సంజూను న‌మ్మ‌లేం!
X

డిఫెండింగ్ చాంపియ‌న్ ఇంత‌వ‌ర‌కు టి20 ప్ర‌పంచ క‌ప్ గెల‌వ‌లేదు..! దాదాపు 20 ఏళ్ల పొట్టి ఫార్మాట్ ప్ర‌పంచ క‌ప్ చ‌రిత్ర‌లో ఇదొక సంప్ర‌దాయంగా మారింది..! కానీ, ఈసారి టీమ్ఇండియా ఆ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసే ప్ర‌య‌త్నంలో ఉంది. మూడు ఫార్మాట్ల‌లోకెల్లా టి20ల్లో అత్యంత ప‌టిష్ఠంగా క‌నిపిస్తున్న భార‌త జ‌ట్టు.. తాజాగా జ‌రుగుతున్న ప్ర‌పంచ క‌ప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా లీగ్ ద‌శ‌ను ముగించింది. ఆదివారం సూప‌ర్-8 తొలి మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికాను ఢీకొన‌నుంది. గ‌త టి20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ లో భార‌త్ ప్ర‌త్య‌ర్థి ద‌క్షిణాఫ్రికానే కావ‌డం ఇక్క‌డ చెప్పుకోద‌గిన విష‌యం. అంటే, డిఫెండింగ్ చాంపియ‌న్, ర‌న్న‌ర‌ప్ ఇప్పుడు టి20 సూప‌ర్ 8 మ్యాచ్ ఆడ‌నున్నాయి అన్న‌మాట‌. అంతా బాగానే ఉన్నా... మ‌రి, టీమ్ ఇండియా ఓపెన‌ర్ ఫామ్ ప‌రిస్థితి...?

ఎవ‌రిని ఆడించాలో?

ఏడాదిన్న‌ర‌గా టీ20ల్లో టీమ్ఇండియా త‌ర‌ఫున రికార్డుల మోత మోగిస్తున్నాడు అభిషేక్ శ‌ర్మ‌. ఈ పంజాబీ కుర్రాడి బ్యాటింగ్ ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించింది. అయితే, స‌రిగ్గా ప్ర‌పంచ క‌ప్ స‌మ‌యానికి అభిషేక్ శ‌ర్మ ఫామ్ కోల్పోయాడు. లీగ్ ద‌శ‌లో మూడు మ్యాచ్ లు ఆడి ఖాతానే తెర‌వ‌లేదు. ఒక మ్యాచ్ కు ఫిట్ నెస్ స‌మ‌స్య‌ల‌తో అందుబాటులో లేక‌పోయాడు. ఇత‌డితో సూప‌ర్ 8కు వెళ్తే ప‌రిస్థితి ఏమిటి? అనే ప్ర‌శ్న వ‌స్తోంది. అయితే, మ‌రో ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ ప‌రిస్థితి కూడా ఏమీ భిన్నంగా ఏమీ లేదు. అభిషేక్ లేనందున న‌మీబియాతో మ్యాచ్ లో సంజూకు అవ‌కాశం ఇస్తే అత‌డు నిరాశ‌ప‌రిచాడు. అందుక‌నే.. ఇత‌డిని తీయ‌లేం.. అత‌డిని న‌మ్మ‌లేం అన్న‌ట్లుంది ప‌రిస్థితి.

గంభీరే పెద్ద అండ‌...

అభిషేక్ ఫిట్ నెస్ ఏమో కానీ.. అత‌డికి హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ నుంచి పూర్తిస్థాయి అండ‌దండ‌లు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఒక బంతి (అమెరికాపై), నాలుగు బంతులు (పాకిస్థాన్ పై), మూడు బంతులు (నెద‌ర్లాండ్స్ పై).. ఇదీ అభిషేక్ ఎదుర్కొన్న బంతుల ప‌రిస్థితి. ఏ మ్యాచ్ లోనూ ప‌ట్టుమ‌ని ఒక ఓవ‌ర్ క్రీజులో నిల‌వ‌ని అత‌డికి.. గంభీర్ మాత్రం అండ‌గా నిలుస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, అభిది కేవ‌లం బ్యాడ్ ఫేజ్ మాత్ర‌మే. ఒక్క‌సారి అత‌డు కుదురుకుంటే... ఇక తిరుగుండ‌ద‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అందుక‌నే, స‌ఫారీల‌తో మ్యాచ్ లో అభిషేక్ ఆడ‌డం ఖాయం అంటున్నారు. పైగా ఇటీవ‌ల‌ ద‌క్షిణాఫ్రికాపై అత‌డి రికార్డు బాగుంది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా అభిషేక్ ను ప్రపంచ స్థాయి ఆట‌గాడిగా పేర్కొంటూ అత‌డికి ఆడిస్తామ‌నే అంటున్నాడు.

లెఫ్టీ గంభీర్ ఏం చెప్పాడో...?

మైదానం బ‌య‌ట అభిషేక్ గురువు యువ‌రాజ్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఆల్ రౌండ‌ర్. భార‌త జ‌ట్టులోకి వ‌చ్చాక అత‌డికి హెడ్ కోచ్ గంభీర్ మార్గ నిర్దేశం చేస్తున్నాడు. గంభీర్ కూడా ఎడ‌మ‌చేతి వాటం బ్యాట‌రే అన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా నెట్ సెష‌న్స్ లో అభితో సుదీర్ఘంగా సంభాసిస్తూ క‌నిపించాడు గంభీర్. దీన్నిబ‌ట్టి యువ ఓపెన‌ర్ పైనే గంభీర్ న‌మ్మ‌కం ఉంచిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎక్కువ మార్పులు చేసినా.. ఇబ్బందే. పైగా హైద‌రాబాదీ తిల‌క్ వ‌ర్మ దూకుడుగా ఆడ‌డం లేదు. గాయం నుంచి కోలుకుని వ‌చ్చిన అత‌డు ఇంకా ట‌చ్ లోకి రాలేదు. సంజూ ఫామ్ కోల్పోయాడు. కాబ‌ట్టి, అభిషేక్ పై న‌మ్మ‌కం ఉంచ‌డ‌మే టీమ్ఇండియా మేనేజ్ మెంట్ చేయాల్సిన ప‌ని.