వన్డేలకు *కొత్త కెప్టెన్*.. ఆ ఆలోచనే లేదు.. తేల్చేసిన బీసీసీఐ
ఓవైపు కుర్రాడు గిల్.. మరోవైపు విజయవంతమైన కెప్టెన్ రికార్డున్న అయ్యర్... వీరిలో వన్డే కెప్టెన్ ఎవరు కావాలన్నది పెద్ద చర్చకు దారితీసే చాన్సుంది.
By: Tupaki Desk | 22 Aug 2025 12:21 PM ISTటీమ్ ఇండియా గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది పెద్ద సంచలనమే... మొన్నటికి మొన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్ బ్యాటర్లను ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ నుంచి తీసివేయడం చర్చనీయాంశం అయింది. ఆ తరువాత అది టెక్నికల్ గ్లిచ్ అని తేలింది. ఇప్పుడు వన్డే కెప్టెన్ ఎవరు? అనే రగడ జరుగుతోంది. అసలు కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్నప్పటికీ.. ఇదిగో అతడే కొత్త కెప్టెన్ అంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో మొదట టెస్టు కెప్టెన్ శుబ్ మన్ గిల్ పేరు బయటకు రాగా నిన్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పేరు వినిపించింది.
టి20 జట్టులో చోటు దక్కక...
టి20 ఫార్మాట్లో వచ్చే నెల నుంచి జరగనున్న ఆసియా కప్ కోసం ప్రకటించిన టీమ్ ఇండియాలో శ్రేయస్ కు చోటు దక్కలేదు. దీంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విజయవంతమైన కెప్టెన్, వన్డేల్లో మంచి ఇన్నింగ్స్, టి20ల్లోనూ దూకుడున్న బ్యాట్స్ మన్ ను పక్కనపెడతారా? అంటూ విమర్శకులు నోళ్లకు పని కల్పించారు. అయితే, అయ్యర్ కు కేవలం జట్టు కూర్పు కారణంగా చోటు ఇవ్వలేకోయారనేది వాస్తవం. అందులోనూ టెస్ట్ కెప్టెన్ గిల్ కు టి20 వైస్ కెప్టెన్సీ ఇవ్వడంతో అయ్యర్ కు మరిక చోటులేకపోయింది. టీమ్ ఇండియా టెస్టు ఓపెనర్ యశస్వి జైశ్వాల్, ఐపీఎల్ టాప్ స్కోరర్ సాయి సుదర్శన్ కూ ఆసియా కప్ జట్టులో స్థానం లభించని సంగతి తెలిసిందే. కానీ, అయ్యర్ విషయమే ఎక్కువ చర్చకు వచ్చింది.
రోహిత్ ఉండగానే....
ఓవైపు టెస్టులు, టి20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ వన్డే కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ కూ సిద్ధం అవుతున్నాడు. 2027 ప్రపంచకప్ లోనూ ఆడతాడని అంటున్నారు. ఇంతలోనే అయ్యర్ ను కెప్టెన్ చేస్తారనే ప్రచారం జరిగింది. అది కూడా 2027 ప్రపంచ కప్ కోసం ప్రణాళిక అని చెప్పుకొచ్చారు.
కవరింగ్ కోసం లీకులు...?
అయ్యర్ కు టి20 జట్టులో ప్లేస్ ఇవ్వలేకపోయినందుకు బీసీసీఐని అందరూ ప్రశ్నించారు. దీని కవరింగ్ కోసం అన్నట్లు అతడికి వన్డే కెప్టెన్సీ ఇస్తున్నారని నిన్న లీకులు బయటకు వచ్చాయి. కానీ, తాజాగా అసలు అలాంటి ప్రతిపాదనే లేదని, ఆ చర్చ జరగలేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తేల్చిచెప్పారు. సైకియా మాటలను బట్టి చూస్తే వన్డేలకూ గిల్ కే పగ్గాలు అప్పగించే చాన్సుందని చెబుతున్నారు. అయ్యర్ కు కూడా అవకాశాలున్నా.. అతడికంటే వయసులో చిన్నవాడైన గిల్ నే భవిష్యత్ వన్డే కెప్టెన్ చేస్తారని అంచనా. బీసీసీఐ వర్గాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.
ఇద్దరిలో ఎవరో..?
ఓవైపు కుర్రాడు గిల్.. మరోవైపు విజయవంతమైన కెప్టెన్ రికార్డున్న అయ్యర్... వీరిలో వన్డే కెప్టెన్ ఎవరు కావాలన్నది పెద్ద చర్చకు దారితీసే చాన్సుంది. అభిమానులు కూడా ఎవరిని తేల్చుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారనడంలో సందేహం లేదు. కాస్త ఎక్కువ మొగ్గు మాత్రం గిల్ కే ఉంటుందేమో?
