టీమ్ ఇండియాను నడిపించనున్న అపోలో టైర్స్
ఆరేడేళ్ల క్రితం వరకు టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్ గా ఒప్పొ సంస్థ వ్యవహరించింది. ఆపై ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ వచ్చింది. అనంతరం ఆన్ లైన్ గేమింగ్ సంస్థ డ్రీమ్ 11 వచ్చింది.
By: Tupaki Desk | 16 Sept 2025 5:39 PM ISTప్రపంచంలోనే ప్రస్తుతం అత్యంత విజయవంతమైన జట్టు.. అత్యంత ధనిక బోర్డు.. ఒక్క మ్యాచ్ కే రూ.వందల కోట్లు.. స్పాన్సర్ షిప్ వేలకోట్లు.. ఇదీ టీమ్ ఇండియా రేంజ్. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు స్థాయి.. అయితే, ఆన్ లైన్ గేమింగ్ నిషేధం వంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో జెర్సీ స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ బరిలో దిగాల్సి వచ్చింది. ప్రస్తుతం కప్ లో రెండు మ్యాచ్ లలోనూ సునాయాసంగా గెలిచి సూపర్ సిక్స్ కు చేరువగా ఉంది టీమ్ ఇండియా. ఫైనల్ వరకు మన జట్టుకు తిరుగులేదు. టి20 ఫార్మాట్ కాబట్టి కప్ కొట్టడంపైనే కాస్త అనుమానం.
ఒప్పొ నుంచి అపొలో వరకు..
ఆరేడేళ్ల క్రితం వరకు టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్ గా ఒప్పొ సంస్థ వ్యవహరించింది. ఆపై ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ వచ్చింది. అనంతరం ఆన్ లైన్ గేమింగ్ సంస్థ డ్రీమ్ 11 వచ్చింది. కానీ, ఆన్ లైన్ గేమ్ ల నిషేధంతో డ్రీమ్ 11 కథ ముగిసింది. ఈ స్థానంలోకి ఎవరు వస్తారా? అనే చర్చ నడుస్తోంది. పెద్దగా సమయం లేనందున టీమ్ ఇండియా డ్రీమ్ 11 పేరున్న జెర్సీ లేకుండానే ఆసియా కప్ లో బరిలో దిగింది. వచ్చే అక్టోబరులో ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్టుతో వన్డే, టి20 సిరీస్ ఉంది. అప్పటికి స్పాన్సర్ ఖరారు కావాలి. తాజాగా డ్రీమ్ 11 స్థానంలోకి అపోలో టైర్స్ వచ్చింది.
అపోలో టైర్స్ పేరుతో...
టైర్ల తయారీ రంగంలో ప్రఖ్యాతిచెందిన అపోలో టైర్స్. దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగానూ ఈ సంస్థ టైర్లు రయ్ రయ్ మంటూ రోడ్లపై పరుగులు పెడుతుంటాయి. తాజాగా స్పాన్సర్ షిప్ నేపథ్యంలో బీసీసీఐకి ఒక మ్యాచ్ కు రూ.4.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది డ్రీమ్11 ఇచ్చినదానికంటే రూ.50 లక్షలు అధికం కావడం గమనార్హం. ఈ లెక్కన భారత క్రీడా రంగంలో అత్యంత లాభాధాయక స్పాన్సర్ షిప్ ఇది కానుంది.
-అపోలో టైర్స్ ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ వంటి ప్రసిద్ధ ఫుట్ బాల్ లీగ్ లో అత్యంత డిమాండ్ ఉండే మాంచెస్టర్ యునైటెడ్ కు స్పాన్సర్ గా వ్యవహరించింది. పలు క్లబ్ లకూ మద్దతు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సైక్లింగ్ లోనూ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఫుట్ బాల్ ను క్షేత్రస్థాయి నుంచి ప్రోత్సహించడంలో ముందుంది.
