తెలుగోడు సహా ’టీమ్ ఇండియా’కు గాయాలు... యువ పేసర్ కు చాన్స్
ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్ లో 1-2తో వెనుకబడి.. కీలకమైన నాలుగో టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల్లో టీమ్ ఇండియాకు వరుస షాక్ లు తగులుతున్నాయి.
By: Tupaki Desk | 21 July 2025 9:49 AM ISTఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్ లో 1-2తో వెనుకబడి.. కీలకమైన నాలుగో టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల్లో టీమ్ ఇండియాకు వరుస షాక్ లు తగులుతున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు గాయం బెడద ఉండగా.. అతడిని అన్ని టెస్టులు ఆడించకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. రెండో టెస్టుకు పక్కనపెట్టి.. మూడో మ్యాచ్ లో ఆడించారు. నాలుగో టెస్టులో ఆడించాలా వద్దా? అనేది పరిశీలిస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో మరో నలుగురు కీలక ఆటగాళ్లకు గాయాలు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన రెండో టెస్టులో బుమ్రా స్థానంలో వచ్చి పది వికెట్లు (6+4) తీసి గెలుపునకు కారణమైన పేసర్ ఆకాశ్ దీప్ గాయం కారణంగా నాలుగో టెస్టులో ఆడడం కష్టమేనని తెలుస్తోంది. మూడో టెస్టు జరిగిన లార్డ్స్ లోనే అతడు హిప్ ఇంజూరీతో బాధపడినట్లు సమాచారం. ఆకాశ్ కు చికిత్స అందిస్తున్నారు.
టెస్టు సిరీస్ ప్రారంభం నుంచి ఆడించాలని డిమాండ్ వస్తున్న ఎడమచేతి వాటం పేసర్ అర్షదీప్ సింగ్ ఏకంగా జట్టుకే దూరం అయ్యాడు. ప్రాక్టీస్ సందర్భంగా బంతిని ఆపబోతే ఎడమచేతికి గాయం అయింది. దీంతో అర్షదీప్ ను భారత్ కు తిప్పి పంపుతున్నారు.
లార్డ్స్ టెస్టులో మెరుగ్గా ఆడిన తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా గాయం బాధితుడేనని తెలుస్తోంది. జిమ్ చేస్తుండగా అతడి మోకాలు దెబ్బతిన్నది. లిగ్మెంట్ కు గాయం అయినట్లు స్కాలింగ్ లో బయటపడింది. దీంతో మిగిలిన రెండు టెస్టులు ఆడడం కష్టమేనని చెబుతున్నారు.
మరోవైపు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ లార్డ్స్ టెస్టులో వేలి గాయానికి గురయ్యాడు. అయినా రెండో ఇన్నింగ్స్ లో అతడు బ్యాటింగ్ కు దిగాడు. కానీ, సహజ శైలిలో ఆడలేక.. త్వరగా ఔటయ్యాడు. అది జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపింది. పంత్ ను వికెట్ కీపర్ గా కంటే స్పెషలిస్ట్ బ్యాటర్ గా నాలుగో టెస్టులో ఆడించాలని, ధ్రువ్ జురెల్ కు కీపర్ గా చాన్స్ ఇవ్వాలనే సూచనలు వస్తున్నాయి. పంత్ ను కేవలం బ్యాటర్ గా ఆడించే కంటే పూర్తిగా రెస్ట్ ఇవ్వాలని సలహా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సలహా ఇచ్చాడు.
పేసర్ అర్షదీప్ స్థానంలో అన్షుల్ కాంబోజ్ కు తొలిసారిగా జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. దేశవాళీల్లో 79 వికెట్లు తీసిన అతడు.. ఇటీవలి ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రాణించాడు. ఇంగ్లండ్ లో ఇండియా ఎ జట్టుకు ఆడాడు. 24 ఏళ్ల అన్షుల్ రెండు అనఫీషియల్ టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడమే కాక హాఫ్ సెంచరీ కూడా చేశాడు. ఇన్ని ఇబ్బందుల మధ్య నాలుగో టెస్టులో టీమ్ ఇండియా ఎలాంటి జట్టుతో దిగుతుందో చూడాలి.
