Begin typing your search above and press return to search.

మీతో ఒక సిరీస్ వేసుకుంటాం..! టీమ్ఇండియాకు ఫుల్ డిమాండ్!

ప్ర‌పంచ క్రికెట్ లో టీమ్ఇండియా ఎంత బ‌ల‌మైన‌దో... భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్థాయి ఏమిటో చెప్పే ఉదాహ‌ర‌ణ ఇది..! బాబ్బాబు.. మాతో ఒక్క సిరీస్ ఆడండి అంటూ ప‌లు దేశాల క్రికెట్ బోర్డులు అభ్య‌ర్ధిస్తున్నాయి.

By:  Tupaki Political Desk   |   14 March 2026 6:00 PM IST
మీతో ఒక సిరీస్ వేసుకుంటాం..! టీమ్ఇండియాకు ఫుల్ డిమాండ్!
X

ప్ర‌పంచ క్రికెట్ లో టీమ్ఇండియా ఎంత బ‌ల‌మైన‌దో... భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్థాయి ఏమిటో చెప్పే ఉదాహ‌ర‌ణ ఇది..! బాబ్బాబు.. మాతో ఒక్క సిరీస్ ఆడండి అంటూ ప‌లు దేశాల క్రికెట్ బోర్డులు అభ్య‌ర్ధిస్తున్నాయి. ఇంత‌గా టీమ్ఇండియాకు డిమాండ్ ఏర్ప‌డ‌డానికి కార‌ణాలు చెప్పుకొంటే 1) ఏడాదిన్న‌ర‌లోనే వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఉండ‌డం 2) భార‌త్ తో ఆడితే ఆయా దేశాల క్రికెట్ బోర్డుల‌కు వ‌చ్చే డ‌బ్బులు.. 3) ఖాళీ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుని లోపాల‌ను స‌రిచేసుకునేందుకు అవ‌కాశం ఉండ‌డం. అందుకే, మీరు కాస్త వీలు చేసుకుని మా జ‌ట్టుతో ఒక్క సిరీస్ ఆడండి అంటూ కోరుతున్నాయి.

వ‌న్డేల‌కు మ‌ళ్లీ మూడొచ్చింది..

టి20ల‌ ప్ర‌వాహంలో వ‌న్డేల ప్రాభ‌వం త‌గ్గింది. అయితే, ఇప్ప‌టికీ ప్ర‌పంచ క‌ప్ అంటే వ‌న్డే ప్ర‌పంచ క‌ప్పేన‌నే అభిప్రాయం ఉంది. 2027 న‌వంబ‌రులో దీనికి ద‌క్షిణాఫ్రికా-న‌మీబియా-జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. అయితే, ఇప్పుడు వ‌న్డేలు త‌క్కువ‌య్యాయి. ఏదో ప్ర‌పంచ క‌ప్ సంవ‌త్స‌రంలో మాత్రం ప్రాక్టీస్ కోసం అన్న‌ట్లు నిర్వ‌హిస్తున్నారు. ఎలాగూ 2027లో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఉన్నందున ప‌లు దేశాల బోర్డులు ఈ ఫార్మాట్ కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించాయి. రాబోయే కాలంలో టి20 సిరీస్ స్థాయిలోనే వ‌న్డేలూ జ‌ర‌గ‌నున్నాయి. పైగా, టీమ్ఇండియా త‌మ దేశానికి రావాల‌ని కోరుకుంటున్నాయి.

జూన్ లోనే..

ఈ నెల 28న మొల‌య్యే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)... మే నెలాఖ‌రు వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. అంటే, జూన్ లో మాత్ర‌మే సిరీస్ ల‌కు అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే రెండు నెల‌ల నుంచి టీమ్ఇండియా త‌మ దేశంలో ప‌ర్య‌ట‌న చేయాల‌ని ప‌లు దేశాల బోర్డులు కోరుతున్నాయి. వీటిని ఐపీఎల్ త‌ర్వాత బీసీసీఐ ప‌రిశీలించే చాన్సుంది. అంతేగాక‌, విదేశీ జ‌ట్ల‌తో స్వ‌దేశంలో జ‌రిగే సిరీస్ ల‌లోనూ వ‌న్డేల‌కు చోటిచ్చే అవ‌కాశాన్ని ప‌రిశీలిస్తోంది.

ఇదీ మ‌న‌ షెడ్యూల్...

జూన్ లో టీమ్ఇండియా అఫ్ఘానిస్థాన్ తో ఒక టెస్టు, మూడు వ‌న్డేలు ఆడాల్సి ఉంది. ఇది భార‌త్ లోనే జ‌రుగుతుంది. ఆ వెంట‌నే ఇంగ్లండ్ వెళ్లి మూడు వ‌న్డేలు, 5 టి20లు ఆడుతుంది. ఐర్లాండ్ తో మూడు వ‌న్డేలు కానీ మూడు టి20లు ఆడుతుంద‌ని భావిస్తున్నారు. శ్రీలంక‌తో జ‌న‌వ‌రిలో జ‌ర‌గాల్సిన వ‌న్డే సిరీస్ ను ఆగ‌స్టులో టెస్టు సిరీస్ తో క‌లిపి ఆడే అంశాన్ని ప‌రిశీలిస్తున్నారు. సెప్టెంబ‌రులో యూఏఈలో అఫ్ఘానిస్థాన్ తో భార‌త్ మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ యుద్ధం కార‌ణంగా సందిగ్ధంలో ప‌డింది. అప్ప‌టికి ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగితే.. అవ‌కాశం ఉంటుంది.

బంగ్లాతో సిరీస్ ఉంటుందా?

బంగ్లాదేశ్ తో 2024లో టెస్టు సిరీస్ ఆడింది టీమ్ఇండియా. నిరుడు ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్ జ‌ర‌గాల్సి ఉన్నా.. ప‌రిస్థితుల కార‌ణంగా వాయిదా ప‌డింది. 2026లోనూ జ‌రిగే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. సెప్టెంబ‌రులో ఆసియా క్రీడ‌ల్లో టీమ్ఇండియా ప్ర‌థ‌మ శ్రేణి జ‌ట్టుతోనే ఆడ‌నుంది. 3 వ‌న్డేలు, 5 టి20లు ఆడేందుకు అక్టోబ‌రులో వెస్టిండీస్ జ‌ట్టు మ‌న దేశానికి వ‌స్తుంది. అనంత‌రం టీమ్ఇండియా న్యూజిలాండ్ కు వెళ్లి 2 టెస్టులు, మూడు వ‌న్డేలు, 5 టి20ల సిరీస్ ఆడుతుంది. అయితే, వ‌న్డేల‌ను 3 నుంచి 5 కు పెంచాల‌ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కోరుతోంది. దీని త‌ర్వాత శ్రీలంక ప‌ర్య‌ట‌కు వ‌స్తుంది. మూడు వ‌న్డేలు, 5 టి20లు ఆడుతుంది.