Begin typing your search above and press return to search.

వరల్డ్ ఛాంపియన్ టీమిండియాకు ఇంతకంటే ఘోర అవమానం లేదు

ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ జైత్రయాత్ర సాగించింది. దీంతో 4-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని భారత్‌కు ‘వైట్‌వాష్’ అవమానాన్ని మిగిల్చింది.

By:  A.N.Kumar   |   12 July 2026 11:22 AM IST
వరల్డ్ ఛాంపియన్ టీమిండియాకు ఇంతకంటే ఘోర అవమానం లేదు
X

టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ప్రపంచ ఛాంపియన్‌గా సగర్వంగా నిలిచిన భారత క్రికెట్ జట్టు.. వరుస పరాజయాలతో తీవ్ర విమర్శల పాలవుతోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కోల్పోయి అభిమానులను నిరాశపరిచిన టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్‌ పర్యటనలోనూ పూర్తిగా చేతులెత్తేసింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ జైత్రయాత్ర సాగించింది. దీంతో 4-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని భారత్‌కు ‘వైట్‌వాష్’ అవమానాన్ని మిగిల్చింది.

మూడు విభాగాల్లోనూ విఫలం.. లండన్ పిచ్‌లపై తేలిపోయిన భారత్

సిరీస్‌లో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అనే తేడా లేకుండా మూడు విభాగాల్లోనూ భారత ఆటగాళ్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఇంగ్లండ్ బౌలర్ల స్వింగ్, బౌన్స్‌ను తట్టుకోలేక భారత టాప్ ఆర్డర్ కుప్పకూలగా, బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రతి మ్యాచ్‌లోనూ స్పష్టమైన ఆధిపత్యం చెలాయించింది.

ఈ పరాజయంపై మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించే ఫ్లాట్ పిచ్‌లపై ఆడి అలవాటు పడటం వల్లే విదేశీ పరిస్థితులకు భారత ఆటగాళ్లు సరిగ్గా సర్దుబాటు కాలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్‌లోని ఇరుకైన, సీమింగ్ కండిషన్లలో ఆడటానికి కావలసిన సాంకేతిక నైపుణ్యం ప్రస్తుత యువ ఆటగాళ్లలో లోపించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఒత్తిడిలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్: నాయకత్వంపై ప్రశ్నలు

రోహిత్ శర్మ తర్వాత జట్టును ముందుండి నడిపించే బాధ్యతను అందుకున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంపై ఇప్పుడు తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన కెప్టెన్సీ చేపట్టిన తొలి సిరీస్‌లోనే ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో ఓటమి ఎదురైంది. ఇప్పుడు ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా వైట్‌వాష్ కావడంతో అయ్యర్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయారు. మైదానంలో సరైన వ్యూహాలను అమలు చేయడంలో వికెట్లు పడుతున్నప్పుడు భాగస్వామ్యాలు నెలకొల్పడంలో కెప్టెన్‌గా ఆయన విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.

టీమిండియా ముందున్న సవాళ్లు ఏంటి?

ఇటీవలి కాలంలో భారత క్రికెట్‌కు ఎదురైన అత్యంత నిరాశాజనకమైన ఫలితాల్లో ఈ సిరీస్ ఒకటిగా నిలిచిపోతుంది. వరల్డ్ కప్ గెలిచిన కొద్దిరోజుల్లోనే జట్టు ఈ స్థాయికి పడిపోవడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు యాజమాన్యం తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంది. విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు అక్కడి పరిస్థితులపై ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం..

కేవలం ఐపీఎల్ ప్రదర్శననే కాకుండా దేశీవాళీ క్రికెట్ రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రదర్శనలను కూడా ప్రామాణికంగా తీసుకోవాలి. జట్టు కూర్పులో సీనియర్, జూనియర్ల సమతుల్యతను పాటించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. వరుస పరాజయాల షాక్ నుంచి టీమిండియా ఎంత త్వరగా కోలుకుని, మళ్లీ విజయాల బాట పడుతుందో చూడాలి.