Begin typing your search above and press return to search.

నేడే భారత్ – పాకిస్థాన్ పోరు... తాజా సమస్య ఇదే!

ఇండియా – పాకిస్థాన్ మధ్య జరిగే పోరు క్రికెట్ మైదానంలో అయినప్పటికీ అది భారీ యుద్ధంగానే భావిస్తుంటారు అభిమానులు.

By:  Tupaki Desk   |   9 Jun 2024 4:03 AM GMT
నేడే భారత్ – పాకిస్థాన్  పోరు... తాజా సమస్య ఇదే!
X

జూన్ 2 న ప్రారంభమైన టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో అసలు సిసలు సమారానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా గ్రూప్-ఏ లో భాగంగా భారత్ - పాకిస్థాన్ మధ్య రసవత్తర పోరు ఈరోజు జరగనుంది. ఇండియా – పాకిస్థాన్ మధ్య జరిగే పోరు క్రికెట్ మైదానంలో అయినప్పటికీ అది భారీ యుద్ధంగానే భావిస్తుంటారు అభిమానులు. ఈ సమయంలో ఆఫ్టర్ లాంగ్ టైం దాయాదీల పోరు అనేసరికి కొత్త ఉత్సాహం తెరపైకి వచ్చింది.

అవును... సాధారణంగా రెండు దేశాల మద్య క్రికెట్ పోరు అంటే.. ఆ రెండు దేశాలకు చెందిన అభిమానులే ఎక్కువగా చూస్తుంటారు. కానీ భారత్ – పాక్ మధ్య మ్యాచ్ అంటే మాత్రం ప్రపంచం వ్యాప్తంగా ప్రతీ క్రికెట్ అభిమాని స్క్రీన్ కు అతుక్కుపోతాడని చెప్పినా అతిశయోక్తి కాదు. పైగా ఈ టీ20 వరల్డ్ కప్ లో ఈ మ్యాచ్ రెండు జట్లకూ చాలా ముఖ్యం కావడంతో పోరు మరింత రసవత్తరంగా మారనుంది.

ఈ టోర్నీలో తన తొలిమ్యాచ్ లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్లో ఓడిపోయింది పాక్. మరోపక్క ఐర్లాండ్ పై గెలిచి బోణీ కొట్టి గెలుపు ఊపులో ఉంది భారత్. దీంతో.. ఈ మ్యాచ్ లో గెలుపు భారత్ కంటే పాక్ కు మరింత ముఖ్యమనే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ లో కూడా ఓడితే... పాక్ సూపర్-8 కు వెళ్లే దారులు దాదాపుగా మూసుకుపోయే ప్రమాదం ఉందనే చెప్పుకోవాలి.

భారత్ బ్యాటర్లు వర్సెస్ పాక్ బౌలర్లు!:

దశాబ్ధాలుగా భారత్ – పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే... అది పాకిస్థాన్ బౌలర్లకు, టీమిండియా బ్యాటర్స్ కూ మధ్య పోరుగానే చాలా మంది భావిస్తుంటారు. పాక్ ఫేసర్లు వేసే బుల్లెట్ లాంటి బంతులను టీమిండియా బ్యాటర్లు అంతే వేగంతో బౌండరీలకు తరలిస్తుంటే... మైదానం ఒక్కసారిగా హోరెత్తిపొతుంది. టీవీల ముందు వీక్షించే ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో హోరెత్తించేస్తుంటారు.

ఈ మ్యాచ్ కూడా అందుకు అతీతం కాదనే భావించాలి. పైగా ఈ పిచ్ పేసర్లకు పూర్తిగా సహకరిస్తుందని అంటున్నారు. ఈ సమయంలో... షహీన్ షా, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ అమీర్ తో పాక్ పేస్ దళం బలంగా ఉండగా... అంతకు మించి అన్నట్లుగా రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబె, హార్దిక్ పాండ్యా లతో కూడిన టీం ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ ఉంది.

పిచ్ రిపోర్ట్!:

కొత్తగా నిర్మించిన నాసా కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో డ్రాప్ ఇన్ పిచ్ లు బ్యాంటింగ్ కు కంటే సీం, స్వింగ్ కు బాగా సహకరించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో బూమ్రా, సిరాజ్, అర్ష్ దీప్, హార్థిక్ లకు చేతినిండా పని, భుజాల నిండా బాధ్యత ఉండే అవకాశం ఉంది!

సమస్య ఇదే:

అంతా బాగుంది.. ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది.. క్రికెట్ మత్తులో ఊగేందుకు తొలిసారి సిద్ధమైంది.. సరికొత్త పిచ్ లు ఎదురుచూస్తున్నాయి.. ఇరు జట్లూ రంగానికి సిద్ధమయ్యాయి.. ఈ సమయంలో ఒకపెద్ద సమస్య తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... ఈ మ్యాచ్ కోసం అందరితోపాటు వరుణుడు కూడా ఆసక్తి కనబరుస్తున్నాడని అంటున్నారు. మ్యాచ్ ఆరంభమైన ఆరగంట తర్వాత వర్షం పడే అవకాశం 51% ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో... పూర్తి 20 ఓవర్ల మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది టెన్షన్ గా మారింది.