Begin typing your search above and press return to search.

టి20ల్లో 300 స్కోర్.. ఆ రోజు మరీ దగ్గర్లోనే

క్రికెట్ లో ఒకప్పుడు టెస్టులు మాత్రమే ఉండేవి.. సంప్రదాయ ఫార్మాట్ కాబట్టి అందులో పరుగులు ఎంత అనేది లెక్క ఉండేది కాదు.

By:  Tupaki Desk   |   4 April 2024 5:30 PM GMT
టి20ల్లో 300 స్కోర్.. ఆ రోజు మరీ దగ్గర్లోనే
X

క్రికెట్ లో ఒకప్పుడు టెస్టులు మాత్రమే ఉండేవి.. సంప్రదాయ ఫార్మాట్ కాబట్టి అందులో పరుగులు ఎంత అనేది లెక్క ఉండేది కాదు. కానీ, టెస్టు ఎంత బాగా జరిగింది? ఎవరు గెలిచారు? అనేది ఇప్పటికీ ఆసక్తికరంగానే చూస్తున్నారు. ఇక వన్డేలు వచ్చాక చాన్నాళ్లు టెస్టు ప్రభావమే కనిపించింది. అయితే, న్యూజిలాండ్ కెప్టెన్ మార్టిన్ క్రో కారణంగా 1992 ప్రపంచ కప్ వన్డే ఆటతీరు స్వరూపాన్నే మార్చేసింది. ఆ వెంటనే 1996లో భారత్ వేదికగా జరిగిన కప్ లో శ్రీలంక దూకుడుకు కొత్త నిర్వచనం చెప్పింది. వన్డేల్లో అలాఅలా స్కోరు 300 దాటేసింది. గత 15 ఏళ్లలో 400 స్కోరు కూడా సాధారణమైపోయింది. ఈ మధ్యలోనే వచ్చిన టి20లు క్రికెట్ కు మరింత దూకుడు నేర్పాయి.

200 కాదు.. అంతకుమించి

అసలే పొట్టి ఫార్మాట్.. వీర బాదుడుకు పెట్టింది పేరు. దీంతో 200 పరుగులు అనేది టి20ల్లో పెద్ద స్కోరుగా మారింది. ఈ లక్ష్యాన్ని కూడా ఉఫ్ మని ఊదేసే జట్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా భారత్, ఇంగ్లండ్. తమదైన రోజున వెస్టిండీస్, న్యూజిలాండ్ కూడా 200పైన టార్గెట్ ను కొట్టేయగలవు. ఈ నేపథ్యంలో టి20ల్లో కచ్చితంగా గెలిచే టార్గెట్ ఏదంటే 250 అని చెప్పాలి.

300 కనుచూపు మేరలో..

వన్డేల్లో 400 పరుగులు సాధారణంగా మారిన ఈ రోజుల్లో టి20ల్లో 200 కూడా మోస్తరు స్కోరు అవుతోంది. ఇక ముందుముందు పొట్టి ఫార్మాట్లో 300 పరుగులను అందుకోవడం పెద్ద కష్టమేం కాదేమో? దీనికి కచ్చితమైన ఉదాహరణ.. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). కాగా, అంతర్జాతీయ టి20ల్లో ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే టీమ్ స్కోర్ 300 దాటింది. గత ఏడాది సెప్టెంబరులో నేపాల్ జట్టు మంగోలియాపై 314 పరుగులు చేసింది. అయితే, ఇవి రెండూ అనామక జట్లు. అంతర్జాతీయంగా పెద్ద జట్లను చూస్తే.. ఇంగ్లండ్ గత డిసెంబరులో వెస్టిండీస్ పై 267 పరుగులు బాదింది.

ఐపీఎల్ లోనే అవకాశం?

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో వారం వ్యవధిలో రెండుసార్లు 250 పైగా పరుగులు నమోదయ్యాయి. మార్చి 27న బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఉతికి ఆరేసింది. 277 పరుగులతో లీగ్ టాప్ స్కోర్ సాధించింది. అయితే, ఆ బుధవారం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ను దడదడలాడిస్తూ 272 పరుగులు కొట్టింది. వాస్తవానికి కోల్ కతా 290 పరుగులు చేసేలా కనిపించింది. 19వ ఓవర్ చివరి బంతికి, 20వ ఓవర్ తొలి బంతికి రసెల్ ఔట్ కావడంతో రెండో అతిపెద్ద స్కోరు 272 వద్ద ఆగిపోయింది. కాగా, మరికాస్త దూకుడు చూపి ఉంటే 300 కూడా కొట్టేదేమో అనిపించింది.

కొసమెరుపు: ప్రస్తుత ఐపీఎల్ లో రెండు పెద్ద స్కోర్లు 277 (హైదరాబాద్), 272 (విశాఖపట్టణం) తెలుగు గడ్డపై జరిగిన మ్యాచ్ లలో నమోదైనవే కావడం విశేషం.