Begin typing your search above and press return to search.

శ‌ని..ఆది..పాక్- భార‌త్..టి20ప్ర‌పంచ క‌ప్ సెమీస్ బెర్తు ఎవ‌రిది?

పాక్ మ్యాచ్ ల‌న్నీ శ్రీలంక‌లోనే జ‌రుగుతున్నాయి. లంక సొంత‌గ‌డ్డపై ప్ర‌మాద‌కారి. పైగా వ‌ర్షం ముప్పు ఉంది. శ‌నివారం వ‌ర్షంతో మ్యాచ్ ర‌ద్ద‌యితే పాక్.. మూడు మ్యాచ్ ల‌లో రెండు పాయింట్ల‌తోనే ఉంటుంది.

By:  Tupaki Political Desk   |   28 Feb 2026 9:08 AM IST
శ‌ని..ఆది..పాక్- భార‌త్..టి20ప్ర‌పంచ క‌ప్ సెమీస్ బెర్తు ఎవ‌రిది?
X

టి20 ప్రపంచ క‌ప్ సెమీస్ స్టేజ్ కు చేరువ‌వుతోంది. సూప‌ర్ 8 ద‌శ శ‌ని, ఆదివారాల్లో ముగియ‌నుంది. అయితే, జ‌ట్ల సామ‌ర్థ్యం ప్ర‌కారం చూస్తే ఈపాటికే సెమీఫైన‌ల్ కు చేరే నాలుగు జ‌ట్లేవో తేలిపోవాల్సింది. కానీ, టీమ్ఇండియాకు గ్రూప్ 1 సూప‌ర్8 తొలి మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికా షాక్ ఇవ్వ‌డం, గ్రూప్2లో పాకిస్థాన్-న్యూజిలాండ్ మ‌ధ్య తొలి మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్ద‌వ‌డంతో రేసు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. భార‌త్ తో పాటు ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక రెండు వ‌రుస ప‌రాజ‌యాల‌తో టోర్నీ నుంచి ఔట్ అయింది. ఇప్పుడిక మిగిలింది శ‌నివారం పాకిస్థాన్-శ్రీలంక‌, ఆదివారం భార‌త్-వెస్టిండీస్ మ్యాచ్ లే. ఒక‌విధంగా చెప్పాలంటే ఈ రెండూ టోర్నీలో అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన స‌మ‌రాలు. వీటిలో గెలుపు ఓట‌ములు ఆయా జ‌ట్ల సెమీస్ బెర్తుల‌ను ఖాయం చేయ‌నున్నాయి. ఇక శుక్ర‌వారం ఇంగ్లండ్ చేతిలో అనూహ్యంగా ప‌రాజ‌యం పాలైన న్యూజిలాండ్ సెమీస్ అవ‌కాశాల‌ను పాకిస్థాన్ ద‌యాదాక్షిణ్యాల‌కు అప్ప‌గించింది. ఇంగ్లండ్ పై కివీస్ గెలిచి ఉంటే.. ఇప్ప‌టికే లంక‌పై ద‌క్కిన విజ‌యంతో నాలుగు పాయింట్ల‌తో నేరుగా సెమీస్ కు వెళ్లేది. కానీ, ఇంగ్లండ్ గ‌ట్టిగా పోరాడి న్యూజిలాండ్ విధించిన 160 ప‌రుగుల టార్గెట్ ను మ‌రో మూడు బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించేసింది. మ‌రోవైపు మొన్న పాకిస్థాన్ పై గెలుపుతోనే ఇంగ్లండ్ సెమీస్ చేరింది. ఇప్పుడూ సూప‌ర్ 8లో మూడుకు మూడు మ్యాచ్ లు నెగ్గి టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది.

వ‌ర్షం దెబ్బ‌.. ఇక్క‌డిదాక తెచ్చింది

గ్రూప్ -2లో న్యూజిలాండ్ కు సెమీస్ రేసు ఇంత క్లిష్టం కాక‌పోయేది. కానీ, పాక్ తో వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్ద‌వ‌డం దెబ్బ‌కొట్టింది. మూడు మ్యాచ్ ల‌కు గాను ఒక ర‌ద్దు, ఒక గెలుపు, ఒక ఓట‌మితో ఉన్న ఆ జ‌ట్టుకు ఇప్పుడు ప్ల‌స్ 1.390 ర‌న్ రేట్ తో ఉండ‌డ‌మే కాస్త ఉప‌శ‌మ‌నం. మ‌రోవైపు ఇదే గ్రూప్ లో ఉన్న పాక్.. శ‌నివారం శ్రీలంక‌పై ఓడిపోతే ఇంటికి వెళ్తుంది. అప్పుడు కివీస్ సెమీస్ కు వెళ్తుంది. పాక్ జ‌ట్టు ఇంగ్లండ్ చేతిలో గెలిచే మ్యాచ్ ను చేజార్చుకుంది. ర‌న్ రేట్ మైన‌స్ 0.461 ఉన్నందున సెమీస్ చేరాలంటే లంక‌పై 64 ప‌రుగుల తేడాతో గెలిచి తీరాలి. లేదా 13.1 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్ ను ఛేదించాలి.

మ‌ళ్లీ వ‌ర్షం వ‌స్తే..

పాక్ మ్యాచ్ ల‌న్నీ శ్రీలంక‌లోనే జ‌రుగుతున్నాయి. లంక సొంత‌గ‌డ్డపై ప్ర‌మాద‌కారి. పైగా వ‌ర్షం ముప్పు ఉంది. శ‌నివారం వ‌ర్షంతో మ్యాచ్ ర‌ద్ద‌యితే పాక్.. మూడు మ్యాచ్ ల‌లో రెండు పాయింట్ల‌తోనే ఉంటుంది. న్యూజిలాండ్ సెమీస్ చేరుతుంది.

మ‌న టీమ్ఇండియా ప‌రిస్థితి ఏమిటో?

టీమ్ఇండియా ఆదివారం వెస్టిండీస్ తో క్వార్ట‌ర్స్ కాని క్వార్ట‌ర్స్ ఆడుతుంది. గురువారం నాటి మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికా విరుచుకుప‌డి విండీస్ ను ఓడించి మ‌న ప‌ని సులువు చేసింది. ఆదివారం విండీస్ పై భార‌త్ గెలిస్తే చాలు సెమీస్ కు వెళ్తుంది. ఓడితే.. క‌రీబియ‌న్ జ‌ట్టు సెమీస్ చేరుతుంది.