Begin typing your search above and press return to search.

సూర్య కుమార్ యాద‌వ్.. చ‌రిత్ర‌లో నిలిచిపోయావ్..!

ముంబై జ‌ట్టులో సూర్య కుమార్ యాద‌వ్ అని ఆట‌గాడు ఉన్నాడు. మీడియం పేస్ వేస్తాడు. అత‌డిని టీమ్ఇండియాలోకి తీసుకోవాలి అని గ‌తంలో ఓసారి సునీల్ గావ‌స్క‌ర్ అన్నాడు.

By:  Tupaki Political Desk   |   9 March 2026 10:22 AM IST
సూర్య కుమార్ యాద‌వ్.. చ‌రిత్ర‌లో నిలిచిపోయావ్..!
X

ఒక‌ప్ప‌టి టీమ్ ఇండియా ఓపెన‌ర్ వ‌సీం జాఫ‌ర్ కెప్టెన్సీలో అరంగేట్రం.. ఇప్ప‌టి చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ తో క‌లిసి అదే మ్యాచ్ లో ప్రాతినిధ్యం.. మొన్న‌టివ‌ర‌కు టి20 కెప్టెన్ గా ఉన్న రోహిత్ శ‌ర్మతో క‌లిసి తొలి మ్యాచ్ లో బ్యాటింగ్.. కానీ, టీమ్ఇండియాలోకి మాత్రం 11 ఏళ్ల త‌ర్వాత ఎంట్రీ..! అది కూడా టి20 స్పెష‌లిస్ట్ గా..! ఇన్నేళ్ల త‌ర్వాత చూస్తే.. చ‌రిత్ర‌లో నిలిచిపోయే అతికొద్ది మంది కెప్టెన్ల‌లో ఒక‌డు..! అత‌డే సూర్య‌కుమార్ యాద‌వ్.. తాజాగా టి20 ప్రపంచ‌క‌ప్ అందించి.. జ‌ట్టును జ‌గ‌జ్జేత‌గా నిలిపిన క‌పిల్ దేవ్, మ‌హేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శ‌ర్మ‌ల స‌ర‌స‌న చేరాడు. సునీల్ గావ‌స్క‌ర్, స‌చిన్ టెండూల్క‌ర్, విరాట్ కోహ్లి వంటి దిగ్గ‌జాల‌కు కూడా సాధ్యం కాని అరుదైన ఘ‌న‌త‌ను సూర్య సొంతం చేసుకున్నాడు.

ఎప్ప‌టి ప్రయాణం.. ఎక్క‌డిదాక‌...

ముంబై జ‌ట్టులో సూర్య కుమార్ యాద‌వ్ అని ఆట‌గాడు ఉన్నాడు. మీడియం పేస్ వేస్తాడు. అత‌డిని టీమ్ఇండియాలోకి తీసుకోవాలి అని గ‌తంలో ఓసారి సునీల్ గావ‌స్క‌ర్ అన్నాడు. ఆ త‌ర్వాత ఓ ఇంట‌ర్య్వూలో రోహిత్ మాట్లాడుతూ.. ముంబైలో 2008 నుంచి అనేక టోర్నీలు ఆడుతూ కిందామీద ప‌డుతూ చివ‌ర‌కు వెలుగులోకి వ‌చ్చాడు సూర్య అని చెప్పాడు. ఈ రెండు విశ్లేష‌ణ‌లు చేసింది దిగ్గ‌జ క్రికెట‌ర్లు అనే మాట గుర్తుంచుకోవాలి. అందుకే, సూర్య ప్ర‌యాణం ఎక్క‌డినుంచి ఎక్క‌డిదాక అనే మాట‌కు స‌రిగ్గా స‌రిపోతుంది.

మంచి ఫామ్ లో ఉన్నా..

భారత జ‌ట్టులో చోటు అంటే అన్నీ క‌లిసిరావాలి. 2010లో సూర్య తొలి రంజీ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో అత‌డే టాప్ స్కోర‌ర్ (73). ఈ ఇన్నింగ్స్ రోహిత్ 37 ప‌రుగులు, కెప్టెన్ జాఫ‌ర్ 32 ప‌రుగులే చేశారు. ఇదే ఫామ్ ను సూర్య చాలాకాలం కొన‌సాగించాడు. మీడియం పేస్ తో వికెట్లు కూడా తీశాడు. కానీ, కాలం క‌లిసిరాలేదు. ఇత‌డికంటే చాలా ఆల‌స్యంగా కెరీర్ మొద‌లుపెట్టిన పృథ్వీ షా వంటి వారు అంత‌లోనే తెర‌మ‌రుగ‌య్యారు. కానీ, సూర్య మాత్రం ఆట‌నే న‌మ్ముకున్నాడు. త‌న ఆట‌ను కూడా మార్చుకున్నాడు. టి20ల్లో సూప‌ర్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు ప్ర‌పంచ క‌ప్ టైటిల్ కూడా అందించాడు.

భ‌విష్య‌త్ ఏమిటి?

సూర్య వ‌య‌సు 35 దాటింది. 30 ఏళ్లు దాటాక టీమ్ ఇండియాలోకి వ‌చ్చాడు. లేటుగా వ‌చ్చినా లేటెస్ట్ అన్న‌ట్లుగా టి20 ఫార్మాట్ కెప్టెన్ గా ఎదిగాడు. వాస్త‌వానికి హార్దిక్ పాండ్యా వంటి ప్ర‌తిభావంతుడైన ఆల్ రౌండ‌ర్, శుమ్ మ‌న్ గిల్ వంటి మేటి బ్యాట‌ర్ ఉండ‌గా సూర్య‌ను కెప్టెన్ చేస్తార‌ని ఏడాదిన్న‌ర కింద‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఊహించ‌లేదు. అయితే, అత‌డిపై న‌మ్మ‌కం ఉంచిన హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్.. సార‌థ్యం ద‌క్కేలా చేశాడు. ఫ‌లితంగా టి20ల్లో జ‌ట్టు బ‌లంగా ఎదిగింది. గ‌త ఏడాది సెప్టెంబ‌రులో ఆసియా క‌ప్ లో పాకిస్థాన్ ను మూడుసార్లు చిత్తు చేసిన‌ప్పుడే ఇది స్ప‌ష్ట‌మైంది. ప్ర‌పంచ క‌ప్ లో క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ సూర్య స్ఫూర్తిదాయ‌క నాయ‌క‌త్వం ఎంతో మేలు చేసింది. తొలి మ్యాచ్ లో అమెరికాపై అజేయంగా 84 ప‌రుగులు చేసి గెలిపించాడు. అయితే, వ‌య‌సు రీత్యా సూర్య‌ను టి20 జ‌ట్టులో కొన‌సాగించ‌డం ఏం స‌బ‌బు? అనే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. పైగా అత‌డు ఫామ్ లో లేడు అనే విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. వీటికి స‌మాధానంగా ప్ర‌పంచ‌ క‌ప్ అందించి నోళ్లు మూయించాడు. దీంతో.. ఇప్ప‌టికైతే మ‌రో రెండేళ్లు సూర్య‌నే టి20 కెప్టెన్ అని చెప్పొచ్చు. త‌నంత‌ట తానుగా రిటైరైతే త‌ప్ప‌..!

కొస‌మెరుపుః టి20 ప్రపంచ క‌ప్ లు అందించిన మిగ‌తా ఇద్ద‌రు కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, రోహిత్ శ‌ర్మ‌లు టెస్టులు, వ‌న్డేల్లోనూ సార‌థ్యం వ‌హించారు. సూర్య మాత్రం ఆ ఫార్మాట్ల‌లో అతి కొద్ది మ్యాచ్ లే ఆడాడు. టి20 స్పెష‌లిస్ట్ గా ఆడుతూ సూర్య క‌ప్ తెచ్చాడు.