Begin typing your search above and press return to search.

పాక్ మిస్టరీ స్పిన్నర్ పనిపట్టే ‘సూర్య’ టెక్నిక్స్

క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఒక యుద్ధం. అందులోనూ టీ20 వరల్డ్ కప్ వేదికగా జరుగుతున్న పోరుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

By:  A.N.Kumar   |   15 Feb 2026 2:03 PM IST
పాక్ మిస్టరీ స్పిన్నర్ పనిపట్టే ‘సూర్య’ టెక్నిక్స్
X

క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఒక యుద్ధం. అందులోనూ టీ20 వరల్డ్ కప్ వేదికగా జరుగుతున్న పోరుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియా ఒక ఆసక్తికరమైన వ్యూహంతో వార్తల్లో నిలిచింది. పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను ఎదుర్కొనేందుకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా బౌలర్ అవతారం ఎత్తడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఉస్మాన్ తారిఖ్.. ఎందుకంత చర్చ?

ప్రస్తుత వరల్డ్ కప్‌లో అత్యంత వివాదాస్పరమైన ప్రమాదకరమైన బౌలర్‌గా ఉస్మాన్ తారిఖ్ అవతరించాడు. అతని విచిత్రమైన బౌలింగ్ యాక్షన్, బంతిని విడిచే ముందు ఇచ్చే చిన్న విరామం బ్యాటర్లను తీవ్రంగా అయోమయానికి గురిచేస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా వంటి దిగ్గజ జట్లకు చుక్కలు చూపించిన తారిఖ్ టీమిండియాకు సవాల్‌గా మారుతాడని మాజీలు హెచ్చరిస్తున్నారు.

రంగంలోకి దిగిన 'మిస్టరీ' సూర్య!

సాధారణంగా నెట్స్‌లో తన బ్యాటింగ్ మెరుపులతో చెలరేగిపోయే సూర్యకుమార్ యాదవ్ ఈసారి మాత్రం తన రూట్ మార్చాడు. పాక్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్న క్రమంలో ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ శైలిని అచ్చుగుద్దినట్లు అనుకరిస్తూ బౌలింగ్ చేశాడు. తారిఖ్ బౌలింగ్ చేసేటప్పుడు ఆగే విధానాన్ని, రౌండ్ ఆర్మ్ యాక్షన్‌ను సూర్య ఫన్నీగా కానీ పక్కాగా అనుకరించాడు. సూర్య వేసిన ఈ 'మిస్టరీ' బంతులను టీమిండియా బ్యాటర్లు నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. మొదట్లో కాస్త ఇబ్బంది పడినప్పటికీ ఆ తర్వాత తారిఖ్ లాంటి బంతులను ఎలా ఎదుర్కోవాలో ఒక అవగాహనకు వచ్చారు.

స్మార్ట్ ప్రిపరేషన్.. వైరల్ వీడియో

సూర్యకుమార్ యాదవ్ చేసిన ఈ ప్రయోగం కేవలం వినోదం కోసమే కాదు, ప్రత్యర్థి బలహీనతలను, ప్రత్యేకతలను ముందే పసిగట్టే వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయిన కొద్దిసేపటికే మిలియన్ల వ్యూస్ సంపాదించింది. "కెప్టెన్ అంటే ఇలా ఉండాలి.. ప్రత్యర్థి అస్త్రాన్ని తన ప్రాక్టీస్‌తోనే నిర్వీర్యం చేస్తున్నాడు" అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పాక్‌పై భారత్ ఆధిపత్యం కొనసాగుతుందా?

ఐసీసీ మెగా టోర్నీలలో పాకిస్థాన్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. గత కొన్ని ఏళ్లుగా ఏకపక్ష విజయాలతో టీమ్ ఇండియా ఆధిపత్యం చలాయిస్తోంది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని.. దాయాది జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భారత్ కృతనిశ్చయంతో ఉంది.

కొలంబో స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లు ముగించుకున్న టీమిండియా ఇప్పుడు సమరానికి సిద్ధమైంది. ఉస్మాన్ తారిఖ్ మిస్టరీని ఛేదించి భారత్ మరో అద్భుత విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి!