భారత్-పాక్ సూపర్ 4 మ్యాచ్... ఈసారి టికెట్లు తెగాయ్...!
ప్రపంచ కప్ వంటి టోర్నీల్లో అయితే కొన్ని రోజుల ముందుగానే టికెట్లు అయిపోతాయి... కానీ,ఈసారి ఆసియా కప్ లో మాత్రం సగం కూడా టికెట్ లు అమ్ముడుపోలేదని సమాచారం.
By: Tupaki Desk | 20 Sept 2025 5:28 PM ISTప్రపంచ క్రీడారంగంలో మరే రెండు దేశాల జట్లు తలపడినా భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంతటి క్రేజ్ ఉండదు..! ప్రపంచ కప్ వంటి టోర్నీల్లో అయితే కొన్ని రోజుల ముందుగానే టికెట్లు అయిపోతాయి... కానీ,ఈసారి ఆసియా కప్ లో మాత్రం సగం కూడా టికెట్ లు అమ్ముడుపోలేదని సమాచారం. చివరకు స్టేడియంలో చూసినా ఇదే వాస్తవం అనిపించింది. పెహల్గాం ఉగ్రదాడి ఘటన అనంతరం తలెత్తిన పరిణామాలే దీనికి కారణంగా అభిమానులు పేర్కొన్నారు. ఈ ప్రభావంతోనే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కనీసం కరచాలనం చేయలేదు. మ్యాచ్ లో గెలిచాక కూడా విజయాన్ని ఆపరేషన్ సిందూర్ వీరులకు అంకితం ఇచ్చాడు సూర్య. ఇప్పుడు మళ్లీ సూపర్-4 దశ స్టార్ట్ కానుంది.
శనివారం నుంచే..
ఆసియా కప్ లో శనివారం నుంచే సూపర్ 4 దశ మొదలుకానుంది. దుబాయ్ లో జరిగే ఈ తొలి మ్యాచ్ లో శ్రీలంక-బంగ్లాదేశ్ తలపడనున్నాయి. మరోవైపు భారత్-పాక్ మధ్య ఆదివారం దుబాయ్ లోనే రెండో మ్యాచ్ జరగనుంది. కాగా, రేపటి మ్యాచ్ లోనూ షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటి కార్యక్రమం ఉండబోదు. అయితే, మ్యాచ్ టికెట్లు మాత్రం బాగానే అమ్ముడుపోయినట్లు సమాచారం.
హీటెక్కిన వాతావరణంలో...
లీగ్ దశ మ్యాచ్ లో పాక్ ను ఘోరంగా ఓడించడమే కాక దారుణంగా అవమానించింది భారత్. ఈ కోపాన్ని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ మీద చూపించింది పాక్. యూఏఈతో మ్యాచ్ కు ఆయనను తొలగించాలని పట్టుబట్టింది. కానీ, పైక్రాఫ్ట్ ఆదివారం మ్యాచ్ కు కూడా రిఫరీగా కొనసాగనున్నారు. ఇక సూపర్ 4 మ్యాచ్ సందర్భంగానైనా సరే పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ లు ఉండవని.. కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐ నుంచి ఏమైనా సమాచారం వస్తే తప్ప మన ఆటగాళ్ల వైఖరి మారదని స్పష్టమవుతోంది. శుక్రవారం నాటి మ్యాచ్ లో ఒమన్ ఆటగాళ్లతో సరదాగా సంభాషించిన సూర్యకుమార్.. పాక్ ఆటగాళ్లకు పరోక్ష సందేశం పంపారు. ఇక పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా సైతం తాము ఎలాంటి సవాల్ నైనా ఎదుర్కొంటామని ప్రకటించాడు. అందుకే ఆదివారం నాటి మ్యాచ్ టికెట్లకు డిమాండ్ పెరిగింది.
-టికెట్ల విక్రయించే సైట్లలో సీట్ల ఖాళీలు తక్కువగా ఉన్నాయి. మ్యాచ్ సమయానికి మొత్తం అయిపోయే అవకాశాలే ఉన్నాయి.
