Begin typing your search above and press return to search.

సన్ రైజర్స్ సారథిగా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్

మరీ గొప్పగా లేదు.. మరీ చెత్తగా ఏమీ కాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) ప్రస్థానం ఇది

By:  Tupaki Desk   |   4 March 2024 7:08 AM GMT
సన్ రైజర్స్ సారథిగా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్
X

మరీ గొప్పగా లేదు.. మరీ చెత్తగా ఏమీ కాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) ప్రస్థానం ఇది. లీగ్ రెండో సీజన్ లోనే 2009లో దక్కన్ చార్జర్స్ హైదరాబాద్ గా ఉన్నప్పుడు టైటిల్ కొట్టేసింది. అయితే, వివిధ కారణాలతో తర్వాత ఫ్రాంచైజీ చేతులు మారింది. పేరు కూడా సన్ రైజర్స్ గా మారింది. 2016లో మరోసారి విజేతగా నిలిచింది. 16 సీజన్ల పాటు విరాట్ కోహ్లి లాంటి స్టార్ బ్యాట్స్ మన్, డివిలియర్స్ వంటి మేటి ప్లేయర్ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒక్కసారి కూడా చాంపియన్ గా నిలవలేదు. ఢిల్లీ, పంజాబ్ వంటి వాటికీ సాధ్యం కాని ఘనతను సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. అలాంటి జట్టు ఈసారి కెప్టెన్ మార్పుతో బరిలో దిగుతోంది. కొత్తగా వస్తున్న కెప్టెన్ కూడా మామూలు వాడు కాదు.

టైటిల్ కొడుతుందా?

సన్ రైజర్స్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చివరిసారిగా 2016లో విజేతగా నిలిచింది. ఆపై 2018లో రన్నరప్ తో సరిపెట్టుకుంది. గత రెండు సీజన్ల నుంచి ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు. కానీ, ఈ నెల 22న మొదలయ్యే సీజన్ కు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సారథ్యంలో బరిలో దిగుతోంది. కమ్మిన్స్ ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాను విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే.

సమర్థ నాయకుడు..

దక్షిణాఫ్రికాతో సిరీస్ లో వరుసగా మూడు వన్డేలు, వన్డే ప్రపంచ కప్ లో వరుసగా తొలి రెండు మ్యాచ్ లు ఓడింది ఆస్ట్రేలియా. కానీ, తర్వాత 9 మ్యాచ్ లలో విజయం సాధించి కప్ కొట్టేసింది. జట్టు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా కమ్మిన్స్ చూపిన నాయకత్వ పటిమనే కంగారూలను మళ్లీ చాంపియన్లు చేసింది అనడంలో సందేహం లేదు. ప్రపంచ కప్ ఫైనల్ లోనూ కమ్మిన్స్ చక్కటి బౌలింగ్ చేశాడు. ఇవన్నీ చూసిన సన్ రైజర్స్ అతడిని వచ్చే సీజన్ కు కెప్టెన్ గా ఎంచుకుని రూ.20.5 కోట్లకు వేలంలో కొనుక్కుంది. ప్రాథమిక ధర రూ.2 కోట్లకు వేలంలోకి వచ్చిన అతడిని పదిరెట్లు ఎక్కువ డబ్బుతో సన్ రైజర్స్ తీసుకోవడం విశేషం. ఇది కమ్మిన్స్ కూడా ఊహించని ధరే. గతంలో కోల్ కతా నైట్ రైడర్స్ అతడిని రూ.10 కోట్లకు పైగా పెట్టి తీసుకుంటే గాయాలతో దూరమయ్యాడు. కానీ, ఈసారి ఫిట్ గా ఉన్నాడు. కాగా, అంతా ఊహించినట్లే, లాంచనంగా కమ్మిన్స్ ను తమ కెప్టెన్ గా ప్రకటించింది సన్ రైజర్స్ హైదరాబాద్. గత సీజన్ లో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ మార్క్ రమ్ హైదరాబాద్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అంతకుముందు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, కివీస్ స్టార్ బ్యాటర్ విలియమ్సన్ ఈ బాధ్యతలు చూశారు.