సన్ రైజింగ్ సడన్ డౌన్.. సరిగ్గా వారంలోనే ఎంత తేడా?
టి20 అంటేనే దూకుడు. దీనిని ఎవరూ కాదనరు. అయితే, సన్ రైజర్స్ పూర్తిగా దూకుడుగా ఆడతానంటే గత సీజన్ లో చెల్లింది ఏమో కానీ, ఈసారి నడిచేలా లేదు.
By: Tupaki Desk | 31 March 2025 9:27 AM ISTగత ఆదివారం.. ఐపీఎల్-18 రెండో రోజు.. సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్.. సొంతగడ్డ ఉప్పల్ లో సన్ రైజర్స్ చెలరేగింది. 286 పరుగులు బాదేసింది. ఐపీఎల్ రెండో టాప్ స్కోర్ ఇది. టాప్ స్కోర్ 287ను నిరుడు హైదరాబాద్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇంకేముంది..? ఈ ఏడాది సన్ రైజర్స్ 300 కొట్టేస్తారు అనే అంచనాలు వచ్చేశాయి.. అహో అంటూ పొగడ్తలూ మొదలయ్యాయి.
వారం తిరిగేసరికి పరిస్థితి మారిపోయింది. సన్ రైజర్స్ ఈ వారంలో ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడింది. లక్నోతో గత గురువారం ఉప్పల్ లోనే జరిగిన మ్యాచ్ లో 190 పరుగుల మెరుగైన స్కోరు చేసినా.. దానిని ప్రత్యర్థి కేవలం 16.1 ఓవర్లలోనే కొట్టిపారేసింది.
ఉగాది నాడు వైజాగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ మరింత డౌన్ అయింది. 163 పరుగులే చేసింది. దీనిని 16 ఓవర్లలోనే ఢిల్లీ కొట్టేసింది.
అంతా దూకుడేనా?
టి20 అంటేనే దూకుడు. దీనిని ఎవరూ కాదనరు. అయితే, సన్ రైజర్స్ పూర్తిగా దూకుడుగా ఆడతానంటే గత సీజన్ లో చెల్లింది ఏమో కానీ, ఈసారి నడిచేలా లేదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విఫలం అయితే తర్వాత వచ్చేవారూ చేతులెత్తేస్తున్నారు. తెలుగు యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మరీ నిరుత్సాహ పరుస్తున్నాడు. సొంతగడ్డ వైజాగ్ లో ఆదివారం డకౌట్ అయ్యాడు. కొత్త కుర్రాడు అనికేత్ వర్మ మాత్రమే బ్యాటింగ్ లో నిలకడ చూపుతున్నాడు. క్లాసెన్ ను పూర్తిగా ఉయోగించుకోవడం లేదని అనిపిస్తోంది. అతడూ గొప్పగా ఏమీ ఆడడం లేదు.
బౌలింగ్ లోనూ సన్ రైజర్స్ ఫెయిల్ అవుతోంది. బ్యాట్స్ మెన్ భారీ స్కోరు చేసి పెడితే తప్ప ప్రత్యర్థులను నిలువరించలేకపోతోంది. రాజస్థాన్ పై 286 పరుగులు చేయబట్టి సరిపోయింది కానీ, 30-40 తక్కువ కొట్టి ఉంటే ఓడిపోయేదే.
నాణ్యమైన స్పిన్నర్ ఏడి?
షమీ, కెప్టెన్ కమ్మిన్స్, హర్షల్ పటేల్ వంటి వారున్నా పేస్ లో పదును కొరవడింది. ఉత్తరప్రదేశ్ కుర్రాడు జీషన్ అన్సారీని తీసుకున్నా అతడు భారీగా పరుగులిచ్చాడు. అభిషేక్ శర్మతో బౌలింగ్ వేయించాల్సి వస్తోంది. రెండు మ్యాచ్ లు ఓడినప్పటికీ సన్ రైజర్స్ కు అవకాశాలు ఉన్నాయి. కానీ, చాలా లోపాలను సరిచేసుకుంటేనే..
